బెంగళూరు ఆటో డ్రైవర్ల తీరుపై ఇన్ఫోసిస్ మాజీ సీఎఫ్ఓ మోహన్ దాస్ పాయ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. సిటీలోని ఆటో డ్రైవర్లు ప్రభుత్వ నిబంధనలను అస్సలు పట్టించుకోకుండా మీటర్ ధరలకు విరుద్ధంగా ప్రయాణికుల నుంచి అధిక డబ్బు వసూళ్లు చేస్తున్నారంటూ తీవ్రంగా విమర్శించారు. అసలు అక్రమ వసూళ్లకు పాల్పడే ఆటో డ్రైవర్లకు ప్రజలు ఎందుకు మద్దతు ఇవ్వాలని సూటిగా ప్రశ్నించారు పాయ్. దీంతో ఈ మ్యాటర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో బెంగళూరు ఆటోవాలాల దందాపై పెద్ద చర్చకు దారితీసింది.
బెంగళూరులో బైక్ టాక్సీలను నిషేధించాలని కోరుతూ ఆటో డ్రైవర్ల సంఘం ప్రధాని మోదీకి లేఖ రాసిన నేపథ్యంలో పాయ్ చేసిన కామెంట్స్ అందరినీ ఆలోచింపజేస్తోంది. బైక్ టాక్సీల వల్ల తమ జీవనోపాధి దెబ్బతింటుందని ఆటో యూనియన్లు వాదిస్తుండగా.. పాయ్ మాత్రం అసలు సమస్య ఆటో డ్రైవర్ల ప్రవర్తనలోనే ఉందని కుండబద్దలు కొట్టి చెప్పేశారు. చాలామంది ఆటో డ్రైవర్లు మీటర్ ప్రకారం నడపడానికి నిరాకరిస్తూ, ప్రయాణికులను డబ్బుల కోసం వేధిస్తున్నారని తన ఎక్స్ పోస్టులో ఆరోపించారు. నిబంధనలను పాటించకుండా ప్రజలను ఇబ్బంది పెట్టే వారికి ప్రజల నుంచి అసలు సపోర్ట్ ఎలా ఎందుకు వస్తుందంటూ పాయ్ నిలదీశారు. దీంతో నెటిజన్లు కూడా ఔను ఆటోవాలాల ప్రవర్తన అస్సలు బాలేదంటూ ఓపెన్ కామెంట్స్ చేస్తున్నారు.
ALSO READ : ఇంటర్నెట్ సెన్సేషన్ మేజర్ రిషబ్ సింగ్: ఎవరు ఈ రియల్ హీరో ?
ఈ వివాదం వెనుక బెంగళూరులో నెలకొన్న రవాణా సంక్షోభం కనిపిస్తోంది. కర్ణాటక హైకోర్టు ఇటీవలే బైక్ టాక్సీలపై ఉన్న నిషేధాన్ని ఎత్తివేస్తూ తీర్పునిచ్చింది. దీంతో రాపిడో, ఉబర్, ఓలా బైక్ ట్యాక్సీ సేవలు మళ్లీ రోడ్లపైకి వచ్చాయి. ట్రాఫిక్ ఎక్కువగా ఉండే బెంగళూరులో తక్కువ ఖర్చుతో వేగంగా ప్రయాణించేందుకు ప్రజలు బైక్ టాక్సీలకే మొగ్గు చూపుతున్నారు. ఇది తమ ఆదాయాన్ని దెబ్బతీస్తోందని ఆటో డ్రైవర్లు గత కొంతకాలంగా నిరసనలు చేస్తున్నారు. గతంలో బైక్ టాక్సీ రైడర్లపై భౌతిక దాడులకు కూడా ఆటోవాలాలు దిగిన వీడియోలు వందల్లో సోషల్ మీడియాలోకి వచ్చిన వేళ వాళ్ల దురుసు ప్రవర్తన ప్రజలందరికీ కనిపించింది.
ALSO READ : అంతరిక్షంలో AI డేటా సెంటర్లు
గత ఏడాది కర్ణాటక రవాణా శాఖ ఈ సేవలను చట్టవిరుద్ధమని ప్రకటించినప్పటికీ.. హైకోర్టు జోక్యంతో సీన్ మారింది. ప్రస్తుతం చట్టబద్ధంగానే బైక్ టాక్సీలు నడుస్తున్నాయి. ఈ క్రమంలో ఆటో డ్రైవర్లు తమపై వచ్చే విమర్శలను సరిదిద్దుకోకుండా.. పోటీని అడ్డుకోవాలని చూడటం సరికాదనేది పాయ్ ప్రధాన వాదన. ప్రజలకు మెరుగైన, చౌకైన సేవలు అందించే వ్యవస్థలు అందుబాటులోకి వచ్చినప్పుడు.. పాత పద్ధతుల్లో ప్రయాణికులను దోచుకోవడం కుదరదని తన వ్యాఖ్యల ద్వారా స్పష్టం చేశారు పాయ్. ఆటో డ్రైవర్లు నిజాయితీగా మీటర్ ధరలకే సేవలు అందిస్తేనే వారికి ప్రజల నుంచి సపోర్ట్ ఉంటుందని అభిప్రాయపడ్డారు. సో బెంగళూరులోని ఆటోవాలాలు తీరు మార్చుకోవాలంటూ పాయ్ తన పోస్ట్ ద్వారా చురకలు అంటించారు. బైక్ ట్యాక్సీల బ్యాన్ కోసం ప్రజలను సపోర్ట్ కోరటం సరికాదంటూ గట్టిగానే చెప్పారు.
