చర్లపల్లి తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ..

చర్లపల్లి తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో వీడిన మిస్టరీ..

ఇటీవల సంచలనం రేపిన చర్లపల్లి తల్లి-పిల్లల ఆత్మహత్య కేసులో మిస్టరీ వీడింది. గత 9 రోజులుగా పోలీసులకు సవాల్ గా మారిన ఈ కేసులో ఎట్టకేలకు చిక్కుముడి వీడింది. డిప్రెషన్ కారణంగానే విజయారెడ్డి ఆత్మహత్య చేసుకున్నట్లు నిర్దారించారు పోలీసులు. కొంతకాలంగా ఆమె తీవ్రమైన మానసిక ఒత్తిడితో బాధపడుతున్నట్టు గుర్తించారు పోలీసులు. విజయరెడ్డి డిప్రెషన్ కు గల కారణాలపై లోతుగా విచారణ చేపట్టారు పోలీసులు. 

విజయారెడ్డి పిల్లలు మొదటి నుంచి తల్లి మాటకు విరుద్ధంగా వెళ్లేవారు కాదని.. పిల్లలను విజయారెడ్డి పూర్తిగా తన కంట్రోల్ లో పెట్టుకొని వారిని వెంట తీసుకెళ్లిందని అంటున్నారు పోలీసులు. తల్లి చెప్పిందే చేయాలనే స్థితిలో ఉండబట్టే.. పిల్లలు ఆమెతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారని తెలిపారు పోలీసులు. విజయారెడ్డి రెండో ఫోన్ వినియోగించారనే ప్రచారంలో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు పోలీసులు.మరణానికి ముందు వారం రోజుల కాల్ డేటాను పరిశీలిస్తున్నారు పోలీసులు.

జనవరి 31న ఉదయం చర్లపల్లి-  ఘట్ కేసర్  రైల్వే స్టేషన్ల మధ్య ఎంఎంటిఎస్ డౌన్ లైన్ లో విజయారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి ఆత్మహత్యకు పాల్పడ్డారు.విజయారెడ్డి బోడుప్పల్ హరితహారం కాలనీ వాసిగా గుర్తించారు పోలీసులు. విజయారెడ్డి   కూతురు  తన్య రెడ్డి, కుమారుడు విశాల్ రెడ్డిగా గుర్తించారు. కూతురు ఇంటర్ సెకండియర్, కుమారుడు విశాల్ రెడ్డి  ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. విజయశాంతి రెడ్డి భర్త సురేందర్ రెడ్డి నెల్లూరులో ఉంటున్నట్లు తెలుస్తోంది.