అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేసినా, ఏం మాట్లాడినా ప్రపంచవ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఆయన ప్రవర్తన రోజు రోజుకూ శ్రుతి మించుతున్నది. వెనెజువెలా అధ్యక్షుడిని బంధించడం, గ్రీన్‌ల్యాండ్ ద్వీపాన్ని కొంటాం అనడం, ఇరాన్ అంతర్గత సంఘర్షణలకు ఆజ్యం పోస్తూ అక్కడి రాచరిక ప్రభుత్వాన్ని కూల్చి ఆక్రమించాలని పన్నుతున్న కుయుక్తులు వెల్లడవుతున్నాయి. తాము చెప్పిందే ప్రపంచ దేశాలకు వేదం అని ట్రంప్ భావిస్తున్నారు.
అంతర్జాతీయ దౌత్య సంబంధాలకు తూట్లు పొడవడం శోచనీయం. ఐరాసను నిర్వీర్యం చేయడం లాంటి లక్ష్యాలతో ట్రంప్ ముందుకు సాగుతూ ప్రపంచ మానవాళికి ప్రమాదకారిగా మారుతున్నారు. ఇదే క్రమంలో తాజాగా ఐరాసకు ప్రత్యామ్నాయంగా ‘బోర్డు ఆఫ్ పీస్’ అనే మరో అంతర్జాతీయ వేదికకు శ్రీకారం చుట్టారు.
ప్రతిపాదిత ‘బోర్డు ఆఫ్ పీస్’ ప్రధాన లక్ష్యాలు
ఐక్యరాజ్యసమితిని నిర్వీర్యం చేసే పనిలో భాగంగా నేడు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ ‘బోర్డ్ ఆఫ్ పీస్ (శాంతి బోర్డు)’ ప్రతిపాదనను చేస్తూ వివిధ దేశాలను సభ్యులుగా చేరాలని లేఖలు రాస్తున్నారు. ప్రపంచంలో శాంతి స్థాపన, యుద్ధాల పరిష్కారాలకు మధ్యవర్తిత్వం వహించడం, ప్రపంచ వివాదాల పరిష్కారం లక్ష్యం అంటున్నారు.
సంక్షోభాల నివారణ, యుద్ధాల్లో నష్టపోయిన నగరాలను పునర్నిర్మాణం, యుద్ధానంతర పరిపాలన పర్యవేక్షణ, అంతర్జాతీయ భద్రతా దళాన్ని మోహరించడం, హమాస్ లాంటి ఉగ్ర సంస్థలను నిరాయుధులను చేయడం లాంటి ప్రధాన లక్ష్యాలతో బోర్డ్ ఆఫ్ పీస్ స్థాపిస్తున్నానని ట్రంప్ తెలిపారు. దీనికి తానే శాశ్వత అధ్యక్షుడిగా ఉంటానని ట్రంప్ ప్రతిపాదించడం నేడు అంతర్జాతీయ స్థాయిలో చర్చకు దారి తీస్తున్నది.
బోర్డ్ ఆఫ్ పీస్‌లో సభ్యత్వం పొందే దేశాలు విధిగా 1 బిలియన్ డాలర్ల (9,098 కోట్ల రూపాయలు) భారీ విరాళం ఇవ్వాల్సి ఉంటుందనే ప్రకటన ప్రకంపనలు సృష్టిస్తున్నది. ఈ భారీ మొత్తాన్ని యుద్ధ ప్రాంతాల అభివృద్ధి, శాంతి భద్రతల పర్యవేక్షణ నిమిత్తం వినియోగిస్తామని ట్రంప్ ఊదరగొడుతున్నారు. మొదట గాజా పునర్నిర్మాణం కోసం అనుకున్న మొదలైన బోర్డ్ ఆఫ్ పీస్ నేడు ఐరాస భద్రతామండలికి ప్రత్యామ్నాయంగా రానున్న మరో శక్తిమంతమైన వేదికగా మారనుందనే అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు.
దేశాలకు ట్రంప్ ఆహ్వానం
“బోర్డ్ ఆఫ్ పీస్”లో సభ్యత్వం తీసుకోవాలని భారత్, పాకిస్థాన్, కెనడా, ఈజిప్ట్, టర్కీ, అర్జెంటీనా, అల్బేనియా, హంగేరీ, యూఏఈ, మొరాకో, వియత్నాం, కజకిస్తాన్, బెలారస్, రష్యా, పరాగ్వే,
స్లోవేనియా, థాయిలాండ్ వంటి దేశాలకు అధికారిక ఆహ్వానాలు అందాయి. ఇప్పటికే 20 దేశాలు ఈ మండలిలో చేరేందుకు అంగీకరించారని ట్రంప్ కాలరు ఎగరేస్తున్నారు.
యూకే, రష్యా, ఈయూ దేశాలు ఇప్పటివరకు స్ఫందన తెలుప లేదు. మరో వైపు చైనా, ఫ్రాన్స్, నార్వే, స్వీడన్ లాంటి దేశాలు బోర్డ్ ఆఫ్ పీస్‌లో చేరేందుకు తిరస్కరించడంతో ట్రంప్‌కు కోపం వస్తున్నది. భద్రతామండలికి బదులు బోర్డ్ ఆఫ్ పీస్ వేదిక రావడంతో చైనా ప్రాధాన్యం తగ్గవచ్చనే భయం కూడా చైనాను వేధిస్తున్నట్లు కనిపిస్తున్నది. తమ ఆహ్వానాన్ని అంగీకరించని దేశాలపై 200 శాతం వరకు సుంకాలు విధిస్తామని ట్రంప్ హెచ్చరిస్తున్నారు.
ఈ బోర్డులో అమెరికా విదేశాంగ మంత్రి మార్కు రూబియా, ట్రంప్ అల్లుడు జారెడ్ కుష్నర్, ప్రపంచ బ్యాంకు అధ్యక్షుడు అజయ్ బంగా, బ్రిటన్ మాజీ ప్రధాని టోనీ బ్లెయిర్, అమెరికా జాతీయ భద్రతా సలహాదారు రాబర్ట్ గాబ్రియేల్ వంటి ప్రపంచ స్థాయి ప్రముఖులు సభ్యులుగా ఉన్నారు. ఏడాదికి కనీసం ఒక సమావేశం నిర్వహించే ఈ బోర్డు కీలక నిర్ణయాలపై ఓటింగ్ నిర్వహించనున్నట్లు తెలుస్తున్నది. ఇజ్రాయిల్‌ను దేశంగా అంగీకరించని పాకిస్థాన్‌కు బోర్డ్ ఆఫ్ పీస్‌లో సభ్యత్వం ఇవ్వడం తమకు రుచించడం లేదని నేతన్యాహూ బాహాటంగానే అంటున్నారు.
బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్?
ఉగ్రవాదానికి ఊపిరిలూదుతున్న పాకిస్థాన్ సభ్యత్వం ఉన్న బోర్డ్ ఆఫ్ పీస్‌లో భారత్ చేరడం ఇబ్బందికరమైన నిర్ణయంగా కనిపిస్తున్నది. నేడు భారత్ తీసుకోనున్న నిర్ణయాన్ని బట్టి ట్రంప్ సుంకాల ఆయుధాల ప్రయోగం ఆధారపడి ఉంటుంది. ప్రపంచ శాంతి మిథ్యగా మారిపోయింది. 1945లో ఏర్పడిన ఐరాస నేడు పేపర్ టైగర్‌గానే మిగిలిపోయింది.
ట్రంప్‌కు ఐరాస అంటే కోపం వస్తున్నది. నిజానికి ట్రంప్ చేయతలపెట్టిన ఈ శాంతి స్థాపన పనులన్నీ ఐరాస ద్వారా కూడా చేయవచ్చు. అమెరికా ఆధిపత్యంలో, కనుసన్నల్లో ఉండే విధంగా బోర్డు ఆఫ్ పీస్ ప్రతిపాదన తెచ్చి, నయాన్నో భయాన్నో అన్ని దేశాలను ఒప్పించాలని ట్రంప్ వ్యూహరచన చేస్తున్నారు. ఈ సంధి కాలంలో భారత్ తీసుకునే నిర్ణయాన్ని బట్టి అమెరికా-, భారత్ సంబంధాలు ఆధారపడి ఉంటాయి.
- డా. బుర్ర మధుసూదన్ రెడ్డి-
