ఇంటర్ విద్యకు గ్రహణం వీడినట్లేనా.. గత పాలకుల అలసత్వ తీరుతో  గాడి తప్పింది

ఇంటర్ విద్యకు గ్రహణం వీడినట్లేనా.. గత పాలకుల అలసత్వ తీరుతో  గాడి తప్పింది

 ప్రతి విద్యార్థి లైఫ్​ను మలుపుతిప్పే చదువు ఇంటర్ విద్యే. అలాంటి ఇంటర్ విద్య గత పదేండ్లలో తీవ్ర నిర్లక్ష్యానికి గురైంది. గత పాలకుల అలసత్వ తీరుతో పూర్తిగా గాడి తప్పింది. గ్లోబరీనా సంస్థ తప్పిదాలకు 21 మంది ఇంటర్ విద్యార్థులు ప్రాణాలు కోల్పోయారు. ఫలితంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు మసకబారితే.. ప్రైవేట్ కాలేజీలు రాజ్యమేలాయి.

తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చాక ఇంటర్ బోర్డుకు పదేండ్లు పట్టిన గ్రహణం వీడింది. రెండేళ్లుగా విద్యా వ్యవస్థ గాడిన పడుతోంది. విప్లవాత్మకమైన మార్పులను తెస్తూ ప్రభుత్వం ఇంటర్ విద్యకు ప్రాధాన్యం ఇస్తోంది.

మొన్నటివరకు బూజుపట్టిన భవనంలా కనిపించే నాంపల్లిలోని ఇంటర్ బోర్డు ఆఫీసు కొత్త హంగులు దిద్దుకుంటోంది.  ప్రభుత్వం.. ఇంటర్ బోర్డును పూర్తిస్థాయిలో రినోవేషన్ చేస్తోంది.  కొత్తగా కమాండ్ కంట్రోల్ సెంటర్​ను ప్రారంభించింది. రాష్ట్రవ్యాప్తంగా ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అధ్యాపక, సిబ్బంది పనితీరు, విద్యార్థులు హాజరును ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తోంది. 

పబ్లిసిటీలో సైతం ప్రైవేట్​కు దీటుగా ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ముందుండేలా సోషల్ మీడియా టీమ్​లను ఏర్పాటు చేసుకుంది. ఇక వచ్చే విద్యాసంవత్సరం నుంచి ఇంటర్మీడియెట్ సిలబస్ మారనుంది. అన్ని సబ్జెక్టుల్లో 20 శాతం సిలబస్ తగ్గించదానికి బోర్డు కసరత్తు చేస్తోంది. సీబీఎస్ఈ తరహాలో ఇంటర్నల్ మార్కుల విధానం తీసుకురావడానికి ఇంటర్ బోర్డు నిర్ణయం తీసుకుంది.

రాష్ట్ర ప్రభుత్వ మార్పులు ఇలా..

12 ఏళ్ల తర్వాత 1,532 జూనియర్ లెక్చరర్ల ఖాళీలను భర్తీ చేసింది. అవసరాల మేరకు కాంట్రాక్టు లెక్చరర్లను కూడా తీసుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 430 జూనియర్ కాలేజీలు ఉండగా.. వీటిలో 1,72,500 మంది విద్యార్థులు చదువుతున్నారు. ఎక్కువగా జూనియర్ కాలేజీలు గ్రామీణ ప్రాంతాల్లోనే ఉన్నాయి. ప్రతి ఇంటర్ కాలేజీ భవనాలను ప్రభుత్వం ఆధునీకరిస్తోంది. 

శిథిలావస్థకు చేరిన ప్రాంతాల్లో కొత్తవి నిర్మించింది. ఫర్నిచర్, కెమికల్ లాబ్స్ , కంప్యూటర్ ల్యాబ్, లైబ్రరీలను ఏర్పాటు. మౌలిక సదుపాయాలైన బాత్ రూమ్​లు, వాటర్, చుట్టూ కాంపౌండ్ వాల్స్ సదుపాయాలు కల్పించింది. 24 గంటలు కరెంట్ సప్లై ఉండేలా చర్యలు. సెక్యూరిటీని కూడా నియమించింది. 

మహిళా కాలేజీల్లో మరింత రక్షణకు చర్యలు తీసుకుంది. కాలేజీలను సీసీ కెమెరాల పర్యవేక్షణ కిందకు తెచ్చింది. ఇంటర్ బోర్డులోని కమాండ్ కంట్రోల్ రూమ్​కు అనుసంధానించింది.

మిడ్ డే మీల్స్ 

ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో ఎక్కువగా పేద, మధ్యతరగతి విద్యార్థులే చదువుతుంటారు. ఆర్థిక ఇబ్బందుల కారణంగా చాలామంది విద్యార్థులు పౌష్టిక ఆహారాన్ని తీసుకోలేకపోతున్నారు. ఉదయం తినకుండా కాలేజీకి వచ్చేవారు కూడా చాలామంది ఉంటున్నారు. వచ్చే ఏడాది నుంచి జూనియర్ కాలేజీల్లో మధ్యాహ్న భోజన సదుపాయం కల్పించాలని ప్రభుత్వం భావించింది. 

ఉదయం టిఫిన్ కూడా పెట్టాలని యోచిస్తోంది. మిడ్ డే మీల్స్ స్కీమ్ అమలుకు ఆలోచన చేస్తున్నట్లు ఇంటర్ బోర్డు అధికారులు చెబుతున్నారు. ఈ పథకం అమలైతే ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో విద్యార్థులు సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంటుంది.

ప్రైవేటు ‘ఫీజు’ ఒత్తిడిని తప్పించేందుకు..

మొన్నటివరకు ఇంటర్ విద్యార్థి యాన్యువల్ పరీక్ష హాల్ టికెట్ జూనియర్ కాలేజీలకే వచ్చేవి. దీంతో ప్రైవేట్ కాలేజీల్లోని విద్యార్థులు ఫీజు పూర్తిగా చెల్లించకుంటే.. యాజమాన్యాలు ఎగ్జామ్స్ చివరి నిమిషం వరకు ఇబ్బంది పెట్టి హాల్ టికెట్ ఇచ్చేవికావు. కొన్ని సందర్భాల్లో ఫీజు చెల్లిస్తేనే హాల్​టికెట్ ఇచ్చిన కాలేజీలు కూడా లేకపోలేదు. 

గతేడాది నుంచి విద్యార్థి సెల్ నెంబర్​కే హాల్ టికెట్ పంపించేలా ఇంటర్ బోర్డు రూల్ అమలులోకి తెచ్చింది. ఈసారి పేరెంట్ సెల్ నెంబర్​కు కూడా హాల్ టికెట్, సెంటర్ లొకేషన్ వెళ్లనుంది. హాల్ టికెట్​పై ఉండే క్యూ ఆర్ కోడ్ ద్వారా ఈజీగా సెంటర్​కు చేరుకోవచ్చు. అదేవిధంగా ప్రతి సెంటర్​లోని ప్రతి పరీక్ష హాల్​లో తప్పనిసరిగా వాల్​ క్లాక్ ఉండేలా చర్యలు తీసుకుంది.

బోర్డులో రాజకీయాలకు చెక్

మొన్నటివరకు ఇంటర్ బోర్డు గ్రూప్ రాజకీయాలకు కేరాఫ్​గా ఉండేది. ఉద్యోగ సంఘాల నేతల ఆధిపత్యం బోర్డుపై స్పష్టంగా కనిపించేది. అలా గత పదేళ్లు కొందరి కనుసన్నల్లోనే బోర్డు నడిచింది. ఒక్కరిద్దరుఉద్యోగ సంఘాల నాయకులు, రిటైర్డ్ అధికారులు చెప్పినట్లుగానే బోర్డు అధికారులు, కిందిస్థాయి సిబ్బంది పనిచేసేవారనే విమర్శలు సైతం వినిపించాయి. 

ప్రతి ఏడాది జూనియర్ కాలేజీల అఫిలియేషన్, అడ్మిషన్ల టైంలో ప్రైవేట్ జూనియర్ కాలేజీల కోసం ప్రభుత్వ జూనియర్ కాలేజీలను నిర్వీర్యం చేశారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇష్టారాజ్యంగా నిధుల దుర్వినియోగం కూడా జరిగిందనే ఆరోపణలు ఉన్నాయి. కానీ గత రెండేళ్లుగా ఇంటర్ బోర్డులో రాజకీయాలకు చెక్ పడింది. ఇంటర్ విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించే ప్రయత్నం సీరియస్​గానే జరుగుతోందని జరుగుతున్న మార్పులను చూస్తే అర్థమవుతోంది.

నిఘా నీడలో పరీక్షలు 

ఇంటర్ విద్యలో ఎక్కువగా ప్రైవేట్ కాలేజీల్లో చదివే విద్యార్థులకే అధికంగా మార్కులు, ర్యాంకులు వచ్చినట్లు యాజమాన్యాలు గిమ్మిక్కులు చేస్తుంటాయి. దీనికి కారణం ప్రాక్టికల్, థియరీ పరీక్షల్లో ప్రైవేట్ కాలేజీల్లో నిర్వహించే సమయంలో మేనేజ్ చేస్తున్నారనే విమర్శలు కూడా ఉన్నాయి. ఇలాంటి అక్రమాలకు తావులేకుండా ఇంటర్ బోర్డు సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరిగేలా ప్రభుత్వం పకడ్బందీ చర్యలు తీసుకుంది. 

గతేడాది నుంచి అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ కాలేజీల్లో సీసీ కెమెరాలను ఏర్పాటు చేసింది. వాటిని ఇంటర్ బోర్డు కంట్రోల్ రూమ్​కు అనుసంధానించింది. ఒకవైపు జంబ్లింగ్, మరోవైపు సీసీ కెమెరాల నిఘాతో ఇంటర్ విద్యలో మాస్ కాపీయింగ్ అక్రమాలకు చెక్ పెట్టిందని చెప్పొచ్చు. 

- కంచ రాజు,జర్నలిస్ట్-