లేఆఫ్స్‌ తప్పించుకున్న టెక్కీలకు నరకం.. ఇద్దరి పని ఒకరితోనే చేయిస్తున్న కంపెనీలు!

లేఆఫ్స్‌ తప్పించుకున్న టెక్కీలకు నరకం.. ఇద్దరి పని ఒకరితోనే చేయిస్తున్న కంపెనీలు!

టెక్ రంగంలో ఇప్పుడు "జాబ్ పోయినోళ్ల" కంటే.. ఉద్యోగంలో "మిగిలిపోయినోళ్ల" పరిస్థితి మరింత దారుణంగా మారుతోంది. లేఆఫ్స్ లిస్టులో తమ పేరు లేదని హమ్మయ్యా అంటూ కలిగే ఊరట క్షణకాలమే అంటున్నారు. ఆ వెంటనే వారిపై పడే అదనపు పనిభారం, మానసిక ఒత్తిడి నరకాన్ని తలపిస్తున్నాయట. కంపెనీలు కాస్ట్ కటింగ్ పేరుతో ఉద్యోగులను తొలగిస్తున్నప్పటికీ.. క్లయింట్లు ఆశించే టార్గెట్లు, ప్రాజెక్ట్ డెడ్‌లైన్లు మాత్రం తగ్గడం లేదు. ఫలితంగా ఇద్దరు వ్యక్తులు చేసే పనిని ఒక్కరే చేయాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. "మీకు జాబ్ దక్కింది, హమ్మయ్య అనుకునేలోపే... మీ సహోద్యోగి పనిలో 50 శాతం మీకు అదనంగా వచ్చి చేరుతుంది" అనే సోషల్ మీడియా వైరల్ పోస్ట్ తెగ వైరల్ అవుతోంది.

లేఆఫ్స్ తర్వాత పెరిగే పనిభారం:
కంపెనీల బ్యాలెన్స్ షీట్లలో ఖర్చులు తగ్గినట్లు కనిపించడానికి మేనేజ్‌మెంట్లు ఉద్యోగులను తొలగిస్తుంటాయి. కానీ ఆయా ఉద్యోగులు నిర్వహిస్తున్న ప్రాజెక్ట్‌లను, టాస్క్‌లను ఏంచేయాలనే దానిపై మాత్రం స్పష్టమైన ప్లానింగ్ అస్సలు ఉండదు. తాజాగా ఒక టెక్కీ సోషల్ మీడియాలో పంచుకున్న విషయాలే ఇందుకు నిదర్శనం. అతడి కంపెనీలో ఒక స్క్రామ్ మాస్టర్, మరో సీనియర్ డెవలపర్ లేఆఫ్ అయ్యారట. ఆ కంపెనీ ఈ లేఆఫ్స్‌ను మేనేజ్ చేసేందుకు ఒక ప్రణాళిక వేసింది: స్క్రామ్ మాస్టర్ బాధ్యతలను ఒక సీనియర్ ఉద్యోగికి అప్పగించగా.. సీనియర్ డెవలపర్ బాధ్యతలను నేరుగా టెక్ లీడ్ భుజాన వేసి చేతులు దులుపుకుందంట.

కాగితాలపై చూడటానికి మాత్రమే ఇది ఎఫీషియెంట్ మేనేజ్మెంట్ మాదిరిగా కనిపిస్తుంది. కానీ ఆచరణలో ఇది ఉద్యోగుల పాలిట ఒక శాపమే. ఇప్పటికే తమ సొంత బాధ్యతలతో సతమతమవుతున్న ఉద్యోగులకు.. అదనంగా మరో కొత్త బాధ్యతలను అప్పగిస్తే వారి ప్రొడక్టివిటీ దెబ్బతింటుంది. ఒక టెక్ లీడ్ తన రోజువారీ కీలకమైన టెక్నికల్ పనులు తీసుకోవాలా లేక కోడింగ్ పనులు పూర్తి చేయాలా లేదంటే తొలగించబడిన డెవలపర్ బాధ్యతలు చూసుకోవాలా అని సతమతమవుతాడు. ఒకే వ్యక్తి ఏకకాలంలో రెండు మూడు వేర్వేరు రోల్స్ పోషించడం వల్ల వర్క్ క్వాలిటీ తగ్గి ఒత్తిడి పెరుగుతుంది.

►ALSO READ | వ్యాపారులకు బిగ్ రిలీఫ్: UPI పేమెంట్స్‌పై ఛార్జీలు దీపావళి వరకూ వాయిదా

లేఆఫ్స్ మీటింగ్ ముగియడంతో సమస్య తీరిపోదు. అసలు సమస్య అక్కడి నుంచే మొదలవుతుందని టెక్కీలు అంటున్నారు. ఉద్యోగం నిలబెట్టుకున్న మిగతా సిబ్బంది ప్రతి నిమిషం "తరువాతి రౌండ్ లేఆఫ్స్‌లో నా ఉద్యోగం ఉంటుందా?" అనే భయంతో బతుకాల్సి వస్తుంది. పైగా, పెరిగిన పనిభారాన్ని ఎదిరించి ప్రశ్నించే ధైర్యం ప్రస్తుత మార్కెట్ పరిస్థితులలో ఎవరికీ ఉండటం లేదు. మార్కెట్లో జాబ్ సెక్యూరిటీ లేకపోవటంతో ఉద్యోగులు తమకు ఇష్టం లేకపోయినా అదనపు పనిని భరించక తప్పని పరిస్థితి.

ఈ దారుణ పరిస్థితిపై సోషల్ మీడియా వేదికగా ఉద్యోగులు తమ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేవలం ఖర్చులు తగ్గించుకునే ఏకైక లక్ష్యంతో కంపెనీలు చేస్తున్న ఈ తరహా ప్రయోగాలు, దీర్ఘకాలంలో ఉద్యోగుల ఉత్సాహాన్ని దెబ్బతీస్తాయని నిపుణులు హెచ్చరిస్తున్నారు. తదుపరి రౌండ్ లేఆఫ్స్‌లో ఎవరి ఉద్యోగం ఊడుతుందో అనే టెన్షన్ కంటే.. కంపెనీలో మిగిలితే మా ఉద్యోగం, మా వ్యక్తిగత జీవితం నరకంగా మారుతుందనేది ప్రస్తుతం ప్రతి టెక్కీని వేధిస్తున్న అసలు సిసలైన ప్రశ్న. మెుత్తానికి లేఆఫ్స్ తప్పించుకున్నామని ఆనందపడాలో.. వర్క్ డబుల్ అయిందని బాధపడాలో కూడా తెలియని పరిస్థితి టెక్కీలకు ఆందోళన కలిగిస్తోంది.