ఇన్నొవేషన్..తప్పిపోయిన వాళ్లకు క్యుఆర్ కోడ్!

ఇన్నొవేషన్..తప్పిపోయిన వాళ్లకు క్యుఆర్ కోడ్!

ప్రతిరోజు న్యూస్​పేపర్​లోనో, సోషల్​ మీడియాలోనో ‘ఫలానా వ్యక్తి కనపడుటలేదు. ఆచూకీ తెలిపిన వారికి తగిన పారితోషికం ఇస్తాం’ అనే ప్రకటనలు చూస్తుంటాం. అది చూడగానే ‘అయ్యో పాపం’ అని ఒక క్షణం అనుకుని వెంటనే వేరే పనిలోకి వెళ్లిపోతాం. కానీ తప్పిపోయిన వాళ్లు ఏమయ్యారో? ఎక్కడున్నారో? తెలియక ఆ కుటుంబ సభ్యులు పడే బాధ మాటల్లో చెప్పలేం. అందులోనూ కనపడకుండా పోయిన వాళ్ల మానసిక పరిస్థితి సరిగా లేకపోతే?! ఇలాంటి పరిస్థితుల్లో ఈ క్యుఆర్​కోడ్​ పెండెంట్​ సాయపడుతుంది. తప్పిపోయిన మీ వాళ్లను మీ దగ్గరకు చేరుస్తుంది అంటున్నాడు ముంబయికి చెందిన 24 ఏండ్ల డాటా ఇంజినీర్​ అక్షయ్​ రిడ్లన్​.

ఇండియాలో 2023 ప్రపంచ జనాభా లెక్కల రివ్యూ ప్రకారం ప్రతి నెలా 64, 851 మంది కనిపించకుండా పోతున్నారు. ఈ విషయంలో సాటి మనుషులుగా ఆ వార్తలు చూసి జాలి పడితే సరిపోతుందా? కానేకాదు. నాకైతే మనసు కదిలిపోయింది. అందుకే క్యుఆర్​ కోడ్ లాకెట్స్​ తయారుచేశా. ఇది డిమెన్షియా, అల్జీమర్స్​ బారిన పడిన పెద్ద వాళ్లకు, డౌన్స్​ సిండ్రోమ్​తో ఉన్న చిన్న పిల్లలకు అక్కరకొస్తుంది. ఈ డిజిటల్​ ప్రపంచంలో రకరకాల వేరబుల్​ ట్రాకింగ్​ డివైజ్​లు అందుబాటులో ఉన్నాయి. అలా తయారుచేసిందే ఈ డివైజ్​ కూడా. దీన్ని తయారుచేసేందుకు నన్ను ముందుకు నడిపింది మాత్రం నేను చదివిన ఒక వార్త.

పరీక్షల కోసం చదువుతూ...

యుపిఎస్​సి కాంపిటేటివ్​ పరీక్షలకి 2019లో ప్రిపేర్​ అవుతున్నప్పుడు రోజూ న్యూస్​ పేపర్​ చదివేవాడ్ని. అప్పుడు తప్పిపోయిన పిల్లల గురించిన కొన్ని స్టోరీలు చదివినప్పుడు అవి నన్ను వెంటాడేవి. అలా నన్ను ఆటిస్టిక్​ పిల్ల వాడైన తరుణ్​ గుప్తా స్టోరీ కదిలించింది. 2019 అక్టోబర్​1న అతను మిస్సయ్యాడనే వార్త చదివా. పదిహేడేండ్ల తరుణ్​ ముంబయి సిఎస్​టి స్టేషన్​లో మిస్​ అయ్యాడు. తప్పిపోయి ఏం తోచక ఉన్న ఆ అబ్బాయిని ఒకతను చూసి ఆర్​పీఎఫ్​ పోలీస్​కి అప్పగించాడు. 

తరుణ్​ని రాంగ్ ట్రెయిన్​లో ఎక్కించాడు అతను. అప్పటినుంచి ఇప్పటివరకు ఆ అబ్బాయి ఆచూకీ తెలియలేదు. ఇది ఒక ఇన్సిడెంట్​ అయితే సరిగ్గా ఆ టైంలోనే మా ప్రొఫెసర్​ కూడా ‘చాలా విషయాలను మర్చిపోతున్నా’ అని చెప్పారు. అది పని ఒత్తిడి వల్ల వచ్చే మామూలు మరుపే అనుకున్నా. కానీ, అది డిమెన్షియా అని చెప్పారామె. ఆ తరువాత  డిమెన్షియా గురించి చదివా. దానివల్ల వచ్చే సమస్యల గురించి తెలుసుకున్నా.

తిరిగి ఇంటికి...

ఈ సమస్యకు టెక్నాలజీని ఆధారంగా చేసుకుని పరిష్కారం కనుక్కోవాలి అనుకున్నా. అలా ‘చేతన’ అనే ప్రాజెక్ట్​ను సెప్టెంబర్​ 12, 2023న మొదలుపెట్టా. క్యుఆర్​ కోడ్​ పెండెంట్​ను తయారుచేశా. ఈ క్యుఆర్​ కోడ్స్​ స్కాన్​ చేస్తే ఆ వ్యక్తికి సంబంధించిన కాంటాక్ట్​ డిటెయిల్స్​తో పాటు మెడికల్​గా వాళ్లకున్న సమస్య తెలుస్తుంది. వీటితోపాటు ఎమర్జెన్సీ కాంటాక్ట్​ నెంబర్, ఇంటి అడ్రెస్​ క్యుఆర్​ కోడ్ స్కాన్​ చేసిన వాళ్లకు తెలుస్తాయి. 

కారణం అదే...

అయితే దీనికంటే ముందు పెంపుడు జంతువుల కోసం క్యుఆర్​ కోడ్​ ఉన్న నెక్​ కాలర్​ బెల్ట్​ తయారుచేశా. దీన్ని తయారుచేయడానికి కారణం మా ఇంట్లో జరిగిన ఒక ఇన్సిడెంట్​. మే 2020న  మా ఇంటికి దగ్గరలో ఒక పెండ్లి వేడుక చాలా గ్రాండ్​గా చేశారు. పెద్దపెద్ద శబ్దాలతో బాణాసంచా కాల్చారు. ఆ శబ్దాలకు మా పెంపుడు కుక్క భయపడిపోయింది. ఆ సౌండ్స్​ తట్టుకోలేక ఆ మూగజీవం అక్కడినుంచి దూరంగా పారిపోయింది. నేను ​ ఇంటి చుట్టుపక్కల వాళ్లందరికీ దాని గురించి అడిగా. 

ఎక్కడన్నా కనిపిస్తే చెప్పమని రిక్వెస్ట్​ చేశా. దాని ఫొటో సోషల్​ మీడియాలో పోస్ట్​ చేశా. ఎన్ని ప్రయత్నాలు చేసినా లాభం లేకుండా పోయింది. అప్పుడు నేను పడిన బాధ మాటల్లో చెప్పలేను. అప్పుడే నాకు​ మిస్​ అయిన పెట్స్​ కోసం ఒక డివైస్​ చేయాలనే ఆలోచన వచ్చింది. అలా నేను క్యుఆర్​ కోడ్​ ఉన్న పెట్​ కాలర్​ తయారుచేశా. దాన్ని స్కాన్​ చేస్తే ఆ పెట్​కి సంబంధించిన పూర్తి​ సమాచారం తెలుస్తుంది. పెట్​ పేరు, మెడికల్ హిస్టరీ, కాంటాక్ట్​ ఇన్ఫర్మేషన్​, దాని యజమాని​ పేరు, కాంటాక్ట్​ డిటెయిల్స్​ ఉంటాయి. బృహత్​ ముంబయి కార్పొరేషన్​ సాయంతో పైలట్​​ ప్రాజెక్ట్​గా లాంచ్​ చేశాం. ఈ ప్రాజెక్ట్​లో భాగంగా  ముంబయి ఇంటర్నేషనల్​ ఎయిర్​పోర్ట్​ లిమిటెడ్​ చుట్టుపక్కల ఉండే 20 స్ట్రీట్​ డాగ్స్​కు ఈ కాలర్​ కట్టాం. దీనివల్ల వీధి కుక్కలకు స్టెరిలైజేషన్, వ్యాక్సినేషన్​ వేయడం ఈజీ అయింది.

రీసెర్చ్​ చేశాక...

నేషనల్​ సెంటర్​ ఫర్​ బయోటెక్నాలజీ ఇన్ఫర్మేషన్​ (ఎన్​సీబీఐ) రిపోర్టు ప్రకారం 8.8 మిలియన్ల ఇండియన్స్​ 60 ఏండ్లు పైబడిన వాళ్లు డిమెన్షియా బారిన పడుతున్నారు. డిమెన్షియా అంటే  కాగ్నిటివ్​ ఫంక్షనింగ్​ లోపం. అంటే...  జ్ఞాపకశక్తి వీక్​ అయిపోతుంది. ఆలోచించలేరు. గుర్తు ఉండదు. రీజనింగ్​ ఉండదు. అల్జీమర్స్​ అనేది డిమెన్షియాకు ఒక కారణం. డిమెన్షియా ఉన్న వాళ్లకు ఎన్నో ఏళ్లుగా ఉన్న ఇంటినుంచి బయటకు వచ్చినా తిరిగి వెళ్లాల్సిన దారి గుర్తుండదు. 

ఇటువంటి వాళ్ల కోసం క్యుఆర్​ కోడ్​ తయారుచేయాలన్న ఆలోచన వచ్చాక వాళ్ల గురించి తెలుసుకోవాలి అనుకున్నా. ఆ ప్రయత్నంలో వాళ్ల ఇంటి సభ్యులను, డాక్టర్స్​, ఓల్డేజ్​హోం వాళ్లతో మాట్లాడా. అలాగే డిసేబిలిటీ ఉన్న పిల్లల తల్లిదండ్రులతో కూడా మాట్లాడా. ముఖ్యంగా కుటుంబ సభ్యులతో మాట్లాడినప్పుడు కనపడకుండా పోయిన తమ వాళ్ల గురించి ఆలోచిస్తూ ఎంత బాధపడుతున్నారో అర్థమైంది.

 
నేను తయారుచేసే టెక్నాలజీ వాళ్ల పిల్లలు, తల్లిదండ్రులను కనుక్కోవడంలో చేయూతగా ఉండాలి అనిపించింది. డౌన్స్​సిండ్రోమ్​, అల్జీమర్స్​, డిమెన్షియా వంటి మానసిక సమస్యలు ఉన్న వాళ్లు కమ్యూనికేషన్​ కూడా ఎఫెక్టివ్​గా చేయలేరు. అటువంటి సమస్యల నుంచి క్యుఆర్​ ట్యాగ్స్​ బయటపడేస్తాయి. ఈ మెకానిజమ్​ వల్ల వాళ్లని గుర్తించడం ఈజీ అవుతుంది. దారి తెలియక తప్పిపోయిన వ్యక్తులు తమ ఇళ్లకు చేరతారు. ఈ పెండెంట్​డిజైన్​ గట్టిగా ఉంటుంది. ఎక్కువకాలం పనిచేస్తుంది. ఎటువంటి వాతావరణ పరిస్థితుల్లో అయినా పాడుకాదు. నేను తయారుచేసిన క్యుఆర్​ కోడ్​ పెండెంట్​ డివైస్​ను​ సెప్టెంబర్ 13, 2023న​ డాక్టర్​ స్వాతి పిరమల్​ చేతుల మీదుగా ముంబయిలో లాంచ్​ చేయించా.

చేతన్​ క్లిక్​ చేస్తే చాలు

క్యుఆర్​ కోడ్​ ఉన్న పెండెంట్​ కోసంప్రాజెక్ట్​ చేతన.ఇన్​(projectchetna.in/) వెబ్​సైట్​ క్లిక్​ చేయాలి. అందులో పర్సనల్​ డిటెయిల్స్​ ఫిల్​ చేస్తే క్యుఆర్​ పెండెంట్​ తయారుచేసి పంపిస్తా. క్యుఆర్​ కోడ్​ స్కాన్​ చేయగానే ... స్కాన్​ చేసిన వాళ్ల అలర్ట్​ వచ్చే టెక్నాలజీని కూడా డెవలప్​ చేస్తున్నా. ఉదాహరణకి ముంబయికి చెందిన ఒకరు తప్పిపోయి బెంగళూరుకి వెళ్లారనుకోండి. అక్కడి వాళ్లు క్యుఆర్​ కోడ్​ స్కాన్​ చేస్తే మీకు నోటిఫికేషన్​ వస్తుందన్నమాట. 

నా ప్రాజెక్ట్​కు చేతన అనే పేరు పెట్టడం వెనక ఒక కారణం ఉంది. చేతన అంటే ఇంగ్లిష్​లో కాన్షియస్​ అని కదా​. అది లేని వాళ్లకోసం తయారుచేశా కాబట్టి ఆ పేరు ఎన్నుకున్నా. ఈ క్యుఆర్​ బేస్డ్​ డిజిటల్​ ఐడెంటిఫికేషన్​ సిస్టమ్​ పెండెంట్​ తయారీకి 250 రూపాయలు ఖర్చవుతుంది. ఇప్పటివరకు ఇలాంటివి వంద పెండెంట్​లు తయారుచేసి ముంబయిలో ఉచితంగా పంచా. పోలీస్​ అధికారులు, ప్రత్యేకించి రైల్వే పోలీస్​ల్లో ఈ క్యుఆర్​ కోడ్​ గురించి అవేర్​నెస్ ఇవ్వాలి. 

ఈ ప్రొడక్ట్​ గురించి జనాల్లో ఎంత ఎక్కువ అవేర్​నెస్​ వస్తే అంత ఎక్కువమందికి ఉపయోగపడుతుంది. అప్పుడే ఎంతో కొంత సాయం చేయగలుగుతాం. సురక్షిత్​ భారత్​ (సేఫ్​ ఇండియా)ను నిర్మించాలనేదే నా మిషన్​. రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ, నిమ్​హాన్స్​(నేషనల్​ ఇనిస్టిట్యూట్​ ఆఫ్​ మెంటల్​ హెల్త్​ అండ్​ న్యూరోసైన్సెస్) లాంటి ఇనిస్టిట్యూట్స్​​, ఎన్జీవోల భాగస్వామ్యంతో క్యుఆర్ కోడ్ పెండెంట్​ను ఇండియా వ్యాప్తంగా అందుబాటులోకి తేవాలనుకుంటున్నా” అని చెప్పాడు అక్షయ్​.

దీని గురించి  కాంటాక్ట్​ చేయాలంటే:  
ఫోన్​: +91 9082532944 / 9004320426,    
ఇ- మెయిల్​:  projectchetna.in@gmail.com