ఇళ్ల సైజు తగ్గుతోంది…

ఇళ్ల సైజు తగ్గుతోంది…

రాను రాను ఇళ్ల సైజు తగ్గిపోతోంది. అపార్ట్​మెంట్లలో అయితే మరీ ఎక్కువగా ఉంది. గత ఐదేళ్లలో ఫ్లాట్ల సైజు 27 శాతం తగ్గిపోయింది. హైదరాబాద్​, ముంబై, ఢిల్లీ, బెంగళూరు, చెన్నై, కోల్​కతా వంటి నగరాల్లో ఇంటి సైజులు బాగా తగ్గిపోయాయి. అనరాక్​ అనే రియల్​ ఎస్టేట్​ కన్సల్టెన్సీ ఈ విషయాలు వెల్లడించింది. 2014లో ఆ సిటీల్లో ఫ్లాట్​ సగటు విస్తీర్ణం 1400 చదరపుటడుగులు కాగా, 2019కి అది 1,020కి తగ్గిపోయింది. ఒక్కొక్క సిటీలో ఒక్కోలా ఫ్లాట్ల సైజులు తగ్గిపోతున్నాయి. దాని ఎఫెక్ట్​ ఎక్కువగా ముంబైలోనే ఉంది. 2014లో 960 చదరపుటడుగులుగా ఉన్న ఫ్లాట్ల సైజులు, ఈ ఏడాది 530 చదరపుటడుగులకు తగ్గింది. పుణెలో 38 శాతం తగ్గిపోయింది. ప్రస్తుతం సగటున 600 చదరపుటడుగుల ఫ్లాట్లను ఎక్కువగా అమ్ముతున్నారు.

హైదరాబాద్​లో ఒకప్పుడు సగటు ఫ్లాట్​ విస్తీర్ణం 1,570 చదరపుటడుగులు ఉండగా ఇప్పుడు 12 శాతం కోత పడింది. చెన్నై (1,190) 8 శాతం, బెంగళూరు (1,300) 9 శాతం మేర ఫ్లాట్ల సైజులు తగ్గాయి. కోల్​కతాలో 2014లో 1,230 చదరపుటడుగులుగా ఉన్న అపార్ట్​మెంట్లు ఇప్పుడు 9 శాతం తగ్గి 1,120 చదరపుటడుగుల్లోనే ఉంటున్నాయి. ప్రస్తుతం దేశంలో ఆర్థిక మాంద్యం పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఈ ఏడాదే ఆ పరిస్థితులున్నా రెండేళ్లుగా రియల్​ఎస్టేట్​కు డిమాండ్​ లేకపోవడంతో ధరల్లో ఎలాంటి మార్పులు ఉండట్లేదు. దీంతో ధరలు తగ్గించలేక రియల్​ వ్యాపారులు, డెవలపర్లు ఫ్లాట్ల సైజులు తగ్గిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. ప్రభుత్వం 45 లక్షల లోపు ఇళ్లకు జీఎస్​టీ, సబ్సిడీలు ఇస్తుండడమూ ఫ్లాట్ల సైజులు తగ్గించడానికి కారణమవుతోందంటున్నారు.  ఫ్లాట్ల సైజు 28 శాతం తగ్గడం వల్ల అపార్ట్​మెంట్ల ధరలు 40 లక్షల లోపు ఉంటున్నాయన్నారు. 17 శాతం తగ్గించిన ఫ్లాట్ల ధరలు ₹40 లక్షల నుంచి ₹80 లక్షల దాకా ఉంటున్నాయని చెబుతున్నారు.

…………………….