స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం

స్వాతి మలివాల్ కేసు.. కేజ్రీవాల్ ఇంటికి ఫోరెన్సిక్ బృందం

న్యూఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీ స్వాతి మలివాల్ పై దాడి వివాదం ముదురుతోంది. ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ పీఏ బిభవ్ కుమార్ దాడి చేశారంటూ స్వాతి మలివాల్ కేసు పెట్టిన విషయం తెలిసిందే. ఈ కేసుకు సంబంధించి సీన్ రీకన్స్ట్రక్ట్ చేసేందుకుశుక్రవారం (మే 17) మధ్యాహ్నం స్వాతిని సీఎం కేజ్రీవాల్ ఇంటికి తీసుకెళ్లారు పోలీసులు. అంతకుముందు ఢిల్లీ పోలీసులు, అదనపు డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్ (నార్త్) అజింత చెప్యాల నేతృత్వంలో నలుగురు ఫోరెన్సిక్ నిపుణులు కేజ్రీవాల్ ఇంటికి వెళ్లారు. 

లివింగ్ రూం నుంచి CCTV పుటేజీని సేకరించారు పోలీసులు. తనను ఏడుసార్లు చెప్పుతో కొట్టారని, ఛాతిపై తన్నారని స్వాతి మలివాల్ ఇచ్చిన స్టేట్మెంట్ ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు అరవింద్ కేజ్రీవాల్ భద్రతా సిబ్బందిని కూడా విచారించారు పోలీసులు.  

గురువారం (మే 16) రాత్రి స్వాతి మలివాల్ ఇచ్చిన స్టేట్ మెంట్ ఆధారంగా  బిభవ్ కుమార్ పై పోలీసులు కేసు నమోదు చేశారు. బిభవ్ కుమార్ పై దాడి, నేరపూరిత బెదిరింపుల అభియోగాలు న్నాయి. 

మరోవైపు బిభవ్ కుమర్ ను విచారణ హాజరు కావాలని జాతీయ మహిళా కమిషన్ శుక్రవారం ఉదయం నోటీసులు జారీ చేసింది. అతను హాజరు కాకపోవడంతో మరోసారి సమన్లు జారీ చేసింది. 

స్వాతి మలివాల్ కేసులో బీజేపీ.. ఆమ్ ఆద్మీ పార్టీనేతలు, అరవింద్ కేజ్రీవాల్ పై బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. ఆందోళనకు దిగారు. అయితే ఎన్నికల వేళ ఇది  బీజేపీ చేసిన కుట్ర అని అరవింద్ కేజ్రీవాల్, ఆప్ నేతలు ఆరోపిస్తున్నారు.