పశ్చిమాసియాలో ముదురుతున్న యుద్ధ వాతావరణం కేవలం తుపాకీ గుళ్లకు, క్షిపణి దాడులకు మాత్రమే పరిమితం కాకుండా.. గల్ఫ్ దేశాల ఆర్థిక మూలాలను సైతం కదిలిస్తున్నాయి. ఇరాన్, ఇజ్రాయెల్, అమెరికా మధ్య కొనసాగుతున్న ఈ భీకర పోరు గల్ఫ్ దేశాల జీడీపీపై కోలుకోలేని దెబ్బ తీసేలా కనిపిస్తోంది. ముఖ్యంగా ప్రపంచ ఇంధన రవాణాకు వెన్నెముకైన స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి గుండా రాకపోకలు నిలిచిపోవడం ఇప్పుడు అరబ్ దేశాల గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తోంది.
ఈ ఉద్రిక్తతలు ఏప్రిల్ వరకు కొనసాగి, రవాణా వ్యవస్థ స్తంభిస్తే ఖతార్, కువైట్ వంటి దేశాల ఆర్థిక వ్యవస్థలు ఏకంగా 14 శాతం మేర కుంగిపోయే ప్రమాదం ఉందని బ్లూమ్‌బెర్గ్ నివేదిక చెబుతోంది. 1990లలో జరిగిన గల్ఫ్ యుద్ధం తర్వాత ఈ దేశాలు ఎదుర్కొంటున్న అతిపెద్ద ఆర్థిక సంక్షోభం ఇదే కానుంది. ఒకవేళ యుద్ధం ముదిరితే.. కరోనా మహమ్మారి కలిగించిన నష్టం కంటే కూడా ఈ యుద్ధం వల్ల కలిగే నష్టమే తీవ్రంగా ఉంటుందని ఆర్థిక నిపుణులు అంటున్నారు. చమురు ఎగుమతులపైనే ఆధారపడ్డ ఈ దేశాలకు ఆదాయ మార్గాలు మూసుకుపోవడం పెను సవాలుగా మారింది.
మరోవైపు సౌదీ అరేబియా, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ వంటి దేశాలు కొంత మేర ఊపిరి పీల్చుకునే అవకాశం ఉంది. ఎందుకంటే.. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్‌తో సంబంధం లేకుండా క్రూడ్ ఆయిల్ ఎగుమతి చేసే ప్రత్యామ్నాయ పైప్‌లైన్ మార్గాలు వీరికి అందుబాటులో ఉన్నాయి. అయినప్పటికీ సౌదీ జీడీపీ 3 శాతం, యూఏఈ జీడీపీ 5 శాతం వరకు తగ్గే అవకాశం ఉందని అంచనా. కేవలం చమురు రంగమే కాకుండా, పర్యాటకం, రియల్ ఎస్టేట్, విదేశీ పెట్టుబడులు కూడా ఈ భౌగోళిక రాజకీయ అనిశ్చితి వల్ల తీవ్రంగా ప్రభావితం అవుతున్నాయని తేలింది.
►ALSO READ | ఓరి దేవుడా.. ఏంటీ ఈ రేట్లు : లీటర్ పెట్రోల్ రూ.188, లీటర్ డీజిల్ రూ.196, గ్యాస్ బండ 2 వేల 126
ప్రస్తుతం యుద్ధం 3వ వారంలోకి ప్రవేశించినా శాంతి సూచనలు ఎక్కడా కనిపించడం లేదు. అమెరికా, ఇజ్రాయెల్ దాడులకు ప్రతిచర్యగా ఇరాన్ పొరుగు దేశాలపై విరుచుకుపడుతోంది. ఇప్పటికే ఖర్గ్ ఐలాండ్‌లోని ఇరాన్ చమురు ఎగుమతి కేంద్రాలపై అమెరికా గురిపెట్టింది. ఈ క్రమంలో బ్రెంట్ క్రూడ్ ధర బ్యారెల్‌కు 103 డాలర్లకు పైగా చేరింది. ఖతార్ నుంచి వెళ్లే గ్యాస్ ఎగుమతులు కూడా భారీగా పడిపోయాయి. ఒకవేళ ఈ యుద్ధం సుదీర్ఘ కాలం కొనసాగితే.. గల్ఫ్ దేశాలు సాధించిన దశాబ్దాల ఆర్థిక ప్రగతి దాదాపు 40 ఏళ్లు వెనక్కి వెళ్లే ప్రమాదం ఉందని విశ్లేషకులు అంటున్నారు.
