బెంగాల్ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. మమతాను ఢీకొట్టేందుకు బరిలోకి సువేందు అధికారి

బెంగాల్ బీజేపీ అభ్యర్థుల ఫస్ట్ లిస్ట్ రిలీజ్.. మమతాను ఢీకొట్టేందుకు బరిలోకి సువేందు అధికారి

కోల్‎కతా:  పశ్చిమ బెంగాల్‎లో అసెంబ్లీ ఎన్నికల వేడి రాజుకుంది. ఎన్నికల షెడ్యూల్ విడుదల కావడంతో బీజేపీ దూకుడు పెంచింది. ఈ నేపథ్యంలోనే సోమవారం (మార్చి 15) తమ పార్టీ అభ్యర్థుల తొలి జాబితాను బీజేపీ విడుదల చేసింది. ఫస్ట్ లిస్ట్‎లో భాగంగా144 మంది అభ్యర్థుల పేర్లను ప్రకటించింది. తొలి జాబితాలో కీలక నేత సువేందు అధికారితో పాటు పలువురి ప్రముఖులు పేర్లు ఉన్నాయి. 

నందిగ్రామ్‎తో పాటు ముఖ్యమంత్రి మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తున్న భబానీపూర్ స్థానం నుంచి సువేందు అధికారిని బరిలోకి దింపింది బీజేపీ. 2021 అసెంబ్లీ ఎన్నికలలో నందిగ్రామ్‌‎లో సువేందు అధికారి మమతా బెనర్జీని ఓడించిన విషయం తెలిసిందే. దీంతో మమతా బెనర్జీ భబానీపూర్ ఉప ఎన్నికలో పోటీ చేసి మళ్లీ ఎమ్మెల్యేగా గెలిచారు. ఈ సారి మమతాను ఢీకొట్టేందుకు బీజేపీ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. 

నందిగ్రామ్‎తో పాటు మమతా బెనర్జీ ప్రాతినిధ్యం వహిస్తోన్న భబానీపూర్ నుంచి కూడా సువేందు అధికారిని పోటీకి దించి టీఎంసీకి సవాల్ విసిరింది. ఈసారి నందిగ్రామ్, భబానీపూర్ రెండు స్థానాల్లో మమతా బెనర్జీ ఎక్కడి నుంచి పోటీ చేసిన మరోసారి సువేందు అధికారి వర్సెస్ దీదీ మధ్య పోరు ఉండనుంది. 

సువేందు అధికారితో తలపడి గత పరాజయానికి ప్రతీకారం తీర్చుకుంటారో లేక మరో నియోజకవర్గం నుంచి మమతా బెనర్జీ బరిలోకి దిగుతారో చూడాలీ. కాగా, 294 సీట్లు ఉన్న బెంగాల్ అసెంబ్లీకి ఏప్రిల్ 23, ఏప్రిల్ 29 తేదీలలో రెండు దశల్లో ఎన్నికలు జరగనున్నాయి. ఫలితాలు మే 4న ప్రకటించబడతాయి.