తెలంగాణ నీటి హక్కులను ఏపీ కాలరాస్తోందన్నారు మాజీ మంత్రి హరీశ్ రావు. 775 టీఎంసీల నీళ్లు గోదావరిలో తీసుకోవాలని ఏపీ కుట్రపన్నుతోందని విమర్శించారు. తెలంగాణ నీళ్లను ఏపీ దోచుకుపోతున్నా సీఎం రేవంత్ రెడ్డి ఎందుకు మాట్లాడం లేదని ప్రశ్నించారు. రేవంత్ రెడ్డి అండ చూసుకుని ఏపీ ప్రభుత్వం రెచ్చిపోతుందన్నారు. రేవంత్ రెడ్డిని ఏపీ ప్రభుత్వం తమ ఏజెంట్ గా భావిస్తోందని.. రేవంత్ రెడ్డి చర్యలతో తెలంగాణకు అన్యాయం జరుగుతోందన్నారు హరీశ్ రావు.
గోదావరి నల్లమల సాగర్ పై వ్యతిరేకంగా గవర్నర్ ప్రసంగంలో ఎందుకు ప్రభుత్వం చెప్పలేదని ప్రశ్నించారు హరీశ్. ఏపీ గవర్నర్ ప్రసంగంలో నల్లమల సాగర్ కు అనుకూలంగా ఏపీ ప్రభుత్వం పెట్టిందన్నారు. గోదావరిలో ఏడు ప్రాజెక్టులకు 400 టీఎంసీల నీళ్లకు అనుమతులు బీఆర్ఎస్ తీసుకొచ్చిందన్నారు. కాలేశ్వరంను చంద్రబాబు అనేక సార్లు అడ్డుకున్నారని చెప్పారు. ఇచ్చిన అనుమతులు రద్దు చేయాలని చంద్రబాబు ఉత్తరాలు రాశారని అన్నారు. క్రిష్ణా,గోదావరి నదీ జలాలపై చర్చకు తాము చర్చకు సిద్ధమన్నారు హరీశ్.
గోదావరిలో తెలంగాణకు 968 టీఎంసీలు,ఏపీకి 531 టీఎంసీలు వచ్చాయన్నారు హరీశ్. కేసీఆర్ సీఎం అయ్యాక గోదావరిపై ప్రాజెక్టులు స్టార్ట్ చేశారని చెప్పారు. కేంద్రంలో బీజేపీ, రాష్ట్రంలో కాంగ్రెస్ నీళ్ల విషయంలో తెలంగాణకు అన్యాయం చేస్తోందన్నారు. రాష్ట్రంలో బడే భాయ్ చోటే భాయ్ బంధం నడుస్తోందని ఆరోపించారు హరీశ్. బీజేపీ,కాంగ్రెస్ పార్టీలది అవిభక్త బంధమని విమర్శించారు. మున్సిపల్ ఎన్నికల్లో సీట్లు పంచుకున్నారని ఆరోపించారు.
