డబుల్ స్పీడ్‎తో ఏపీ అభివృద్ధి.. రాష్ట్రాన్ని ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతం: ప్రధాని మోడీ

డబుల్ స్పీడ్‎తో ఏపీ అభివృద్ధి.. రాష్ట్రాన్ని ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ హబ్‌‌‌‌‌‌‌‌గా తీర్చిదిద్దుతం: ప్రధాని మోడీ
  • భోగాపురంలో అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభం
  • ఏపీలో రూ.18 వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం
  • ఉత్తరాంధ్రకు వలస వచ్చే రోజులు వస్తాయి: సీఎం చంద్రబాబు 
  • మోదీ ప్రపంచంలోనే అత్యంత గొప్ప నాయకుడు
  • ఏ దేశానికి వెళ్లినా ఆయన్ను ఎంతగానో గౌరవిస్తున్నారు
  • మన ప్రధాని ఇండియాకే గర్వకారణమని ప్రశంసలు

హైదరాబాద్, వెలుగు: ఆంధ్రప్రదేశ్‌‌‌‌‌‌‌‌ను ఫార్మా, టెక్నాలజీ, మాన్యుఫాక్చరింగ్ హబ్​గా తీర్చిదిద్దుతామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ కంపెనీలు ఇప్పటికే ఏపీలో పెట్టుబడుల అవకాశాలను పరిశీలిస్తున్నాయని, దీనివల్ల రాష్ట్ర యువతకు భారీగా ఉపాధి అవకాశాలు లభిస్తాయని తెలిపారు. విజయనగరం జిల్లా భోగాపురంలో రూ.5,700 కోట్ల వ్యయంతో నిర్మించిన అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని శనివారం ఆయన ప్రారంభించారు. అదే వేదిక నుంచి రూ.18 వేల కోట్ల విలువైన వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. ఈ విమానాశ్రయం ఉత్తరాంధ్ర అభివృద్ధికి రన్‌‌‌‌‌‌‌‌వేగా, లాంచ్‌‌‌‌‌‌‌‌ప్యాడ్‌‌‌‌‌‌‌‌లా పనిచేస్తుందని, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇది కీలకంగా ఉంటుందని పేర్కొన్నారు. 

అలాగే 13 వేల మందికి పైగా గిరిజన యువతులు, మహిళలు పాల్గొన్న థింసా నృత్యం గిన్నిస్ రికార్డు సాధించడం సంతోషకరమన్నారు. కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్​కల్యాణ్, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో మోదీ మాట్లాడుతూ ఏపీ అభివృద్ధికి, స్వర్ణాంధ్ర విజన్ సాకారానికి ఇది చాలా ముఖ్యమైన రోజని  అన్నారు. మూడేళ్లలో ఏపీలో సుమారు రూ.2 లక్షల కోట్ల విలువైన అభివృద్ధి పనులు ప్రారంభించినట్లు గుర్తుచేశారు.

74 నుంచి 166 ఎయిర్‌‌‌‌పోర్టులు

అల్లూరి సీతారామరాజు గిరిజన హక్కుల కోసం తన ప్రాణాలను అర్పించిన మహనీయుడని మోదీ కొనియాడారు. అలాంటి మహానుభావుడి పేరుతో భోగాపురం విమానాశ్రయాన్ని ప్రారంభించడం గర్వంగా ఉందన్నారు. దేశ విమానయాన రంగం 12 ఏళ్లలో అసాధారణంగా అభివృద్ధి చెందిందని తెలిపారు. 74 విమానాశ్రయాలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 166కు పెరిగిందన్నారు. ఉడాన్ పథకం ద్వారా చిన్న పట్టణాల ప్రజలకు కూడా విమాన ప్రయాణం చేసే అవకాశం వచ్చిందన్నారు. చిన్న నగరాల నుంచి దేశవ్యాప్తంగా, విదేశాలకు కూడా కనెక్టివిటీ పెరిగిందన్నారు.

విశాఖలో త్వరలో గూగుల్​ ఏఐ, క్లౌడ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్​క్యాంపస్

సాఫ్ట్‌‌‌‌వేర్, ఐటీ, టెక్నాలజీ రంగాల్లో ఏపీ యువతకు విశేష ప్రతిభ ఉందని మోదీ పేర్కొన్నారు. విశాఖలో సెమీకండక్టర్ రంగానికి సంబంధించిన ఆధునిక యూనిట్‌‌‌‌కు శంకుస్థాపన చేశామని, అదే సమయంలో తయారీ రంగాన్ని కూడా బలోపేతం చేసే దిశగా రాష్ట్ర ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కృషితో పెద్ద ఎత్తున పరిశ్రమలు రాష్ట్రానికి వస్తున్నాయని ప్రశంసించారు. విశాఖలో గూగుల్ 15 బిలియన్ డాలర్ల విలువైన ఏఐ, క్లౌడ్ ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్ క్యాంపస్ ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించిందని మోదీ చెప్పారు. దీనితో పాటు మరెన్నో అంతర్జాతీయ కంపెనీలు కూడా రాష్ట్రంలో పెట్టుబడులపై ఆసక్తి చూపుతున్నాయని తెలిపారు. 

ఫార్మా, బ్లూ ఎకానమీపై దృష్టి

నక్కపల్లిలో దేశంలోనే అతిపెద్ద ఫార్మా పార్క్ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం పూర్తి సహకారం అందిస్తోందని ప్రధాని వెల్లడించారు. భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ప్రముఖ ఫార్మా హబ్‌‌‌‌గా ఎదుగుతుందని చెప్పారు. మరోవైపు కోస్టల్ ఎకానమిక్ కారిడార్ అభివృద్ధితో బ్లూ ఎకానమీ బలోపేతం అవుతోందన్నారు. విశాఖ నుంచి కృష్ణపట్నం వరకు ఉన్న పోర్టులను ఆధునీకరిస్తున్నామని, మూలపేట, రామాయపట్నం కొత్త పోర్టులను అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. 

విశాఖ–రాయపూర్ ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే, జాతీయ రహదారులు రాష్ట్ర ఆర్థికాభివృద్ధికి మరింత ఊతమిస్తాయని చెప్పారు. ఉత్తరాంధ్ర కోస్టల్ ఎకానమిక్ కారిడార్‌‌‌‌గా ఎదిగి దేశ ఆర్థికాభివృద్ధిలో కీలక పాత్ర పోషిస్తుందని అన్నారు. ఏపీలో ప్రజలు డబుల్ ఇంజన్ ప్రభుత్వానికి ఆశీర్వాదం ఇచ్చారని అన్నారు. చంద్రబాబు, పవన్ కల్యాణ్ సారథ్యంలో ఎన్డీఏ ప్రభుత్వం రెండింతల వేగంతో పనిచేస్తోందని ప్రశంసించారు. కేంద్రం–రాష్ట్రం సమన్వయంతో అభివృద్ధి కార్యక్రమాలు వేగంగా అమలవుతున్నాయని చెప్పారు.

ఉత్తరాంధ్రలో రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు

చంద్రబాబు మాట్లాడుతూ భోగాపురం విమానాశ్రయం ఉత్తరాంధ్ర చరిత్రను మార్చే ప్రాజెక్టు అని పేర్కొన్నారు. ఉత్తరాంధ్ర అభివృద్ధి చరిత్రలో ఇది కొత్త అధ్యాయమని చెప్పారు. భోగాపురం విమానాశ్రయం ఈ ప్రాంతానికి మణిహారంగా మారుతుందని, సముద్రం–కొండల నడుమ నిర్మితమైన ఈ ఎయిర్‌‌‌‌పోర్ట్ దేశంలోనే ప్రత్యేక గుర్తింపు పొందుతుందని అన్నారు. విశాఖ నుంచి భోగాపురం వరకు బీచ్ కారిడార్ నిర్మిస్తున్నామని చెప్పారు. 

రెండేళ్లలో ఉత్తరాంధ్రలో 189 ప్రాజెక్టుల ద్వారా రూ.6.13 లక్షల కోట్ల పెట్టుబడులు సమీకరించామని వెల్లడించారు. వీటి ద్వారా 5.57 లక్షల ఉద్యోగాలు లభిస్తాయని తెలిపారు. ఉపాధి కోసం ఉత్తరాంధ్ర ప్రజలు ఇతర ప్రాంతాలకు వెళ్లే పరిస్థితి మారి, భవిష్యత్తులో ఇతర ప్రాంతాల నుంచే ఉత్తరాంధ్రకు వలసలు వచ్చే పరిస్థితి ఏర్పడుతుందన్నారు. ఈ వేదిక ద్వారా భారత జాతి మొత్తానికి చెప్తున్నాను.. నరేంద్ర మోదీ లేకుండా మనం 2047(భవిష్యత్తు) ఊహించలేం అన్నారు. 

మోదీ ప్రపంచంలోనే గొప్ప నాయకుడని.. ప్రపంచంలో ఏ దేశానికి వెళ్లినా ఆయన్ను అందరూ ఎంతగానో గౌరవిస్తున్నారు. మన ప్రధాని దేశానికి గర్వకారణమని వెల్లడించారు. పోలవరం ప్రాజెక్టు పూర్తి చేసి, 2028నాటికి అమరావతి ఫస్ట్​ ఫేజ్​ పనులు కంప్లీట్​ చేసి మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామన్నారు. విశాఖ ఉక్కు పరిశ్రమ పరిరక్షణ, విశాఖ రైల్వే జోన్, పోలవరం, అమరావతి నిర్మాణాలకు కేంద్ర ప్రభుత్వం అండగా నిలిచిందని పేర్కొన్నారు. 

ప్రారంభమైన ప్రధాన ప్రాజెక్టులు 

ఈ పర్యటనలో ప్రధాని మోదీ విశాఖపట్నం తర్లువాడలో ఏఎస్‌‌‌‌ఐపీ టెక్నాలజీస్ సెమీకండక్టర్ ప్యాకేజింగ్–టెస్టింగ్ యూనిట్‌‌‌‌కు శంకుస్థాపన చేశారు. కర్నూలు విండ్, సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌‌‌‌మిషన్ వ్యవస్థను ప్రారంభించారు. అనంతపురం (2,500 మెగావాట్లు), కర్నూలు (1,000 మెగావాట్లు) సోలార్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌‌‌‌మిషన్ పథకాలను జాతికి అంకితం చేశారు. కర్నూలు–IV రిన్యూవబుల్ ఎనర్జీ జోన్ ట్రాన్స్‌‌‌‌మిషన్ ప్రాజెక్టు, పెంచలకొన–యరపాడు వంతెనకు శంకుస్థాపన చేశారు. ఖమ్మం–దేవరపల్లి గ్రీన్‌‌‌‌ఫీల్డ్ నాలుగు లేన్ల ఎక్స్‌‌‌‌ప్రెస్‌‌‌‌వే, సంబంధిత ప్యాకేజీలు, తాడిపత్రి నాలుగు లేన్ల బైపాస్ రహదారులను కూడా ప్రారంభించారు.