తెలంగాణ ప్రభుత్వ డిగ్రీ కళాశాల గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ (TGCGTA) రాష్ట్ర కార్యవర్గం ఏకగ్రీవంగా ఎన్నికైంది. ఆదివారం (ఆగస్టు 02) హైదరాబాద్‌లోని ఉస్మానియా విశ్వవిద్యాలయం ఫ్యాకల్టీ క్లబ్‌లో ఘనంగా ఎన్నికలు జరిగాయి. సంఘ రాష్ట్ర కౌన్సిల్ సమావేశం అనంతరం జరిగిన ఎన్నికల్లో డా. కడారు సురేందర్ రెడ్డి నాయకత్వంలోని ప్యానెల్ ఏకగ్రీవంగా ఎన్నికైంది.
గత పదేళ్లుగా ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధి, అధ్యాపకుల హక్కుల పరిరక్షణ, క్యాడర్ సమస్యల పరిష్కారం, కెరీర్ అడ్వాన్స్‌మెంట్ స్కీమ్ (CAS) అమలు, సేవా అంశాల పరిష్కారం, ప్రభుత్వంతో నిరంతర చర్చలు జరిపి అనేక విజయాలు సాధించడమే ఈ ఘన విజయానికి ప్రధాన కారణమని రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు అభిప్రాయపడ్డారు.
అదే రోజు నిర్వహించిన రాష్ట్ర కౌన్సిల్ సమావేశంలో సంఘ బలోపేతం, సంస్థాగత సంస్కరణలు, సభ్యుల భాగస్వామ్యం పెంపు, నూతన బై-లాస్ అమలు, మహిళలకు అధిక ప్రాతినిధ్యం కల్పించడం, జిల్లా మరియు యూనిట్ స్థాయిలో సంఘాన్ని మరింత పటిష్టం చేయడం వంటి పలు కీలక తీర్మానాలను రాష్ట్ర కౌన్సిల్ ఏకగ్రీవంగా ఆమోదించింది.
2026–2029 కాలానికి ఎన్నికైన రాష్ట్ర కార్యవర్గం:
- రాష్ట్ర అధ్యక్షుడు: డా. కడారు సురేందర్ రెడ్డి
- అసోసియేట్ అధ్యక్షుడు: డా. జె. చిన్న
- ఉపాధ్యక్షుడు: డా. కె. తిరుపతయ్య
- ప్రధాన కార్యదర్శి: డా. బెల్లి యాదయ్య
- ఆర్థిక కార్యదర్శి: శ్రీ ఎన్. రమేష్ గౌడ్
- మహిళా కార్యదర్శి: డా. సి.హెచ్. జ్యోత్న
- ఈసీ సభ్యులు: డా. డి.ఈ. పావని, డా. కె. కిరణ్ కుమార్
- మల్టీజోన్–I కార్యదర్శి: డా. యు. రవికుమార్
- మల్టీజోన్–II కార్యదర్శి: డా. పి. నరసింహులు
ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన రాష్ట్ర అధ్యక్షుడు డా. కడారు సురేందర్ రెడ్డి మాట్లాడుతూ, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల అభివృద్ధి, అధ్యాపకుల న్యాయమైన హక్కుల సాధన, విద్యా ప్రమాణాల పెంపు, ప్రభుత్వంతో సానుకూల చర్చల ద్వారా పెండింగ్ సమస్యల పరిష్కారానికి సంఘం మరింత సమర్థవంతంగా కృషి చేస్తుందని తెలిపారు. సభ్యులందరి సహకారంతో సంఘాన్ని మరింత బలోపేతం చేస్తామని, ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రతిష్ఠను ఉన్నత స్థాయికి తీసుకెళ్లేందుకు నిరంతరం పనిచేస్తామని ఆయన పేర్కొన్నారు.
