మోడీ మీద మాట పడితే.. మా మీద పడ్డట్టే: పవన్కల్యాణ్

మోడీ మీద మాట పడితే.. మా మీద పడ్డట్టే: పవన్కల్యాణ్
  • మోడీని తిడితే.. నాకు కన్నీళ్లొచ్చాయి
  • తిట్టిన వారిని కూడా క్షమించే గొప్ప మనసున్న మీ పాదాలకు నమస్కారం
  • ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా దేశం కోసం పనిచేస్తున్నరు
  • మిమ్మల్ని కొట్టే నాయకుడు లేడు.. రాబోడు అంటూ పొగడ్తలు

హైదరాబాద్, వెలుగు: ప్రధాని నరేంద్ర మోదీ గురించి ఎవరైనా అనుచితంగా మాట్లాడితే తన గుండె కదిలిపోతుందని, కన్నీళ్లు ఆగవని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. మోదీ దేశం కోసం నిరంతరం శ్రమిస్తూ ఒక్క రోజు కూడా సెలవు తీసుకోరని.. ఆయనలాంటి నాయకుడికి అండగా నిలవడం దేశ ప్రజలందరి బాధ్యతని చెప్పారు. శనివారం విజయనగరం జిల్లా భోగాపురంలో అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయాన్ని ప్రధాని చేతుల మీదుగా జాతికి అంకితం చేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో పవన్ మోదీపై ప్రశంసల వర్షం కురిపిస్తూ ఎమోషనల్ అయ్యారు. 

“ప్రధానమంత్రి నరేంద్ర మోదీని చాలామంది అనకూడని మాటలు అంటుంటే నా గుండె కదిలింది.. నాకు కన్నీళ్లు వచ్చాయి. దేశం కోసం కష్టపడే వారికి చివరికి మనం ఇచ్చేది ఇదేనా? ఒక్క రోజు కూడా సెలవు తీసుకోకుండా ఆయన దేశం కోసం పనిచేస్తున్నారు. అలాంటి వ్యక్తికి మనం ఇవ్వగలిగేది ఒక్కటే.. మేమున్నాం మీ వెంట అనే భరోసా. మీ మీద మాట పడితే అది మా మీద పడ్డట్టే’ అని పవన్ అన్నారు. విదేశాల్లోని శత్రువులతో పాటు దేశంలో అభివృద్ధిని అడ్డుకునే అంతర్గత శక్తులను ఎదుర్కొంటూనే మోదీ భారత్‌‌‌‌ను ముందుకు తీసుకెళ్తున్నారని చెప్పారు. 

మీరు అనుకున్నంత కాలం మీదే అధికారం

ప్రసంగం చివర్లో కూడా పవన్ మోదీని ప్రశంసిస్తూ భావోద్వేగానికి గురయ్యారు. “ఈరోజు ఉదయం ప్రధానమంత్రి గారి సందేశం చూశాను. ఎన్ని తిట్టినా, ఎన్ని దూషించినా వారిని పెద్ద మనసుతో క్షమించారు. అలాంటి ప్రధానమంత్రి గారికి పాదాలకు నేను నమస్కారం చేస్తున్నాను. మీ ఉన్నతి, మీ ఔన్నత్యం స్ఫూర్తిదాయకం” అని అన్నారు. 

అలాగే “మిమ్మల్ని కొట్టే నాయకుడు ఈ భారతదేశంలో లేడు.. రాబోడు. మీరు పడ్డ శ్రమ, మీరు పడ్డ కష్టం ఎవ్వరూ తీసుకోలేరు. మీరు అనుకున్నంత కాలం అధికారం మీ చేతుల్లోనే ఉంటుంది. దానికి మేమందరం నిరంతర కృషి చేస్తాం” అని అన్నారు. దేశాన్ని నడిపించడం ‘రామకార్యం’తో సమానమని, మోదీ వంటి నాయకుడి కష్టాన్ని ప్రతి భారతీయుడు గుర్తించాలని పిలుపునిచ్చారు.