- 12 కేటగిరీల సమస్యల పరిష్కారానికి కొత్త విధానం
- కొత్తగా 22ఏలో భూమిని చేర్చే పరిధి ఆర్డీవో, సబ్ కలెక్టర్‌కే
- వారంలోనే లేఅవుట్ల రిజిస్ట్రేషన్ సమస్యల పరిష్కారం
- 98 లక్షల ఎకరాలు ప్రభుత్వ, అటవీ భూములేనని వెల్లడి
- వివాదం కేవలం 3.73 లక్షల ఎకరాలే: సీఎం స్పష్టీకరణ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో పేదలు, రైతులు, మధ్యతరగతి ప్రజలు జీవితకాలం రూపాయి రూపాయి కూడబెట్టి కొనుక్కున్న స్థలాలు, ఇండ్లపై నిషేధిత భూముల జాబితా(సెక్షన్ 22ఏ) సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు ప్రజా ప్రభుత్వం సిద్ధమైందని సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ‘ఒక హై పవర్ ఆఫీసర్స్ కమిటీ వేస్తున్నాం.. మీరు ఏదైనా ఇవ్వాలన్నా, ఏదైనా తీసుకొచ్చి చెప్పాలన్నా.. దీన్ని ఇమ్మీడియట్‌గా సీసీఎల్‌ఏ కమిషనర్‌ని, లా సెక్రటరీని, స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ కమిషనర్‌ను పెట్టి ఒక ఆఫీసర్ అథారిటీని వేస్తున్నాం’ అని సీఎం చెప్పారు. బుధవారం అసెంబ్లీలో 22ఏ సమస్యలపై జరిగిన స్వల్పకాలిక చర్చలో సీఎం సుదీర్ఘంగా ప్రసంగించారు.
యూఎల్‌సీ మిగులు భూముల క్రమబద్ధీకరణకు త్వరలోనే నూతన విధానాన్ని తెచ్చి పాత, కొత్త దరఖాస్తులను పరిశీలించి ఏకకాలంలో రిజిస్ట్రేషన్లు పూర్తి చేస్తామని తెలిపారు. హెచ్ఎండీఏ, జీహెచ్ఎంసీ, డీటీసీపీ అనుమతి పొందిన లేఅవుట్లలో ఆగిన రిజిస్ట్రేషన్ల దరఖాస్తులను పరిశీలించి వారం రోజుల్లోనే పరిష్కరించే వ్యవస్థను తెస్తామన్నారు. గత బీఆర్‌ఎస్ ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాల వల్లే నేడు లక్షలాది మంది ప్రజలు రిజిస్ట్రేషన్లు కాక రోడ్డున పడ్డారని ఆయన మండిపడ్డారు. ప్రతిపక్షాలు కావాలని ప్రభుత్వంపై నెపం నెడుతూ అవాస్తవ ప్రచారం చేస్తున్నాయని, బాధ్యత గల ప్రభుత్వంగా తామే స్వయంగా చొరవ తీసుకుని ఈ చర్చను ప్రారంభించామని వెల్లడించారు. 22ఏ సమస్యల పరిష్కారానికి పారదర్శక నిబంధనలను రూపొందించడంతో పాటు, ప్రజలు ఎదుర్కొంటున్న 12 ప్రధాన కేటగిరీల సమస్యలకు పూర్తి ఉపశమనం కల్పిస్తూ నూతన విధానాలను ప్రకటిస్తున్నట్లు సీఎం స్పష్టం చేశారు.
ఇకపై కఠిన, పారదర్శకమైన నిబంధనలు..
ఇకపై 22ఏ జాబితాలో ఏ భూమినైనా చేర్చాలన్నా, తొలగించాలన్నా అత్యంత కఠినమైన, పారదర్శకమైన నిబంధనలు అమలు చేస్తామని సీఎం రేవంత్‌రెడ్డి ప్రకటించారు. భూమిని చేర్చే ప్రక్రియను ఆర్డీవో లేదా సబ్ కలెక్టర్ మాత్రమే ప్రారంభిస్తారని.. సర్వే నంబర్, సబ్ డివిజన్, పట్టణాల్లో వార్డు, ప్లాట్ నంబర్లను స్పష్టంగా గుర్తిస్తారన్నారు. వివాదాస్పద భాగాన్ని మాత్రమే సబ్ డివిజన్ చేసి నిషేధంలో పెడతామని, మిగిలిన భాగాన్ని యథాతథంగా రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తామన్నారు. భూ యజమానికి ఈ–కేవైసీ, ఈ-–మెయిల్, ఆధార్ అనుసంధాన చిరునామాకు రిజిస్టర్డ్ పోస్ట్ ద్వారా నోటీసు ఇచ్చి15 రోజుల సమయం ఇస్తామని, విచారణ తర్వాత స్పష్టమైన కారణాలతో 'స్పీకింగ్ ఆర్డర్స్' జారీ చేస్తామన్నారు. ఎకరం దాటిన వ్యవసాయ భూమి, 1000 చదరపు గజాలు దాటిన వ్యవసాయేతర భూమిని చేర్చాలంటే ప్రభుత్వ ముందస్తు అనుమతి తప్పనిసరి చేశామన్నారు. ఒకవేళ ఆర్డీవో నిర్ణయంపై అభ్యంతరం ఉంటే 60 రోజుల్లో జాయింట్ కలెక్టర్‌కు అప్పీల్ చేసుకోవచ్చని, 90 రోజుల్లో ప్రభుత్వానికి రివిజన్ పిటిషన్ వేసుకోవచ్చని సీఎం వెల్లడించారు. గతంలో ప్రభుత్వాలు జీవోలు 58, 59, 166 ద్వారా క్రమబద్ధీకరించిన భూములు పొరపాటున 22ఏ జాబితాలో ఉంటే వాటిని ఆర్డీవోలు వెంటనే తొలగిస్తారని సీఎం స్పష్టం చేశారు.
ధరణి ఒడిశాలో ఫెయిలైన ప్రాజెక్టు..
2014లో అధికారంలోకి వచ్చిన కేసీఆర్.. కాళేశ్వరం, పాలమూరు ప్రాజెక్టుల్లో రూ.1.80 లక్షల కోట్ల బిల్లులు చెల్లించాక, భూములపై కన్నేశారని ఆరోపించారు. ‘మంది ఎక్కువై మజ్జిగ పల్చబడటంతో కేసీఆర్ మెదడులో పుట్టిన విషపు పురుగే ధరణి పోర్టల్. తన మేధస్సుతో ధరణిని కనిపెట్టానని కేసీఆర్ అసెంబ్లీలో చెప్పినవన్నీ పచ్చి అబద్ధాలు. 2010లోనే ఒడిశాలో నవీన్ పట్నాయక్ ప్రభుత్వం ధరణిని తెస్తే, అవకతవకలు జరిగాయని 2014లో ‘కాగ్’ మొట్టికాయలు వేసి రద్దు చేయించింది. ఆ కాలం చెల్లిన ప్రాజెక్టును తెలంగాణకు తెచ్చి, ఐఎల్ అండ్ ఎఫ్ఎస్ అనే దివాళా తీసిన సంస్థకు కట్టబెట్టారు’ అని సీఎం మండిపడ్డారు.
2.50 కోట్ల ఎకరాల భూముల డేటా, రైతుల సమాచారాన్ని ఫిలిప్పీన్స్, సింగపూర్ మీదుగా బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, కేమన్ ఐలాండ్స్ వంటి ట్యాక్స్ హెవెన్ దేశాల్లోని మాఫియా చేతుల్లో పెట్టారు. దీని వెనుక ఉన్న ‘రాజు’ ఎవరు?’ అని సీఎం ప్రశ్నించారు. ఈ బండారం బయటపడుతుందనే కేసీఆర్‌కు ‘బబుల్ షూటర్’ హరీశ్‌రావు చెప్పి సభ నుంచి పారిపోయేలా చేశారన్నారు. 1982 నాటి ల్యాండ్ గ్రాబింగ్ చట్టాన్ని 2016లో రద్దు చేశారని విమర్శించారు. 2017లో ల్యాండ్ రికార్డ్స్ అప్‌డేషన్ (ఎల్‌ఆర్‌యూపీ) పేరుతో క్షేత్రస్థాయి విచారణ లేకుండా 21,93,050 ఎకరాలను వివాదాస్పద ‘పార్ట్- బీ’ నిషేధిత జాబితాలోకి నెట్టారన్నారు. తాము అధికారంలోకి వచ్చాక ఆ భూములను 2024 నాటికి 18.37 లక్షల ఎకరాలకు, నేటికి 17,16,736 ఎకరాలకు తగ్గించామని వివరించారు.
క్లరికల్ తప్పిదాలపైనా రాజకీయమా?
సీఎం రేవంత్ రెడ్డి ఇల్లు కూడా నిషేధిత జాబితాలో ఉందంటూ ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై సీఎం స్పందించారు. ‘ముఖ్యమంత్రి ఇల్లు కూడా 22ఏ జాబితాలో ఉందని హరీశ్‌రావే స్వయంగా బయట ప్రచారం చేశారు. మంత్రి నా ఆస్తి మీదికే వచ్చి పెడితే సదరు మంత్రి పదవిలో కొనసాగుతారా? కొంచెం రాజకీయంగా ఆలోచించండి.. మంత్రి .. సీఎంపైనే కక్ష కడతారా?.. ఇది కేవలం క్లరికల్ ఎర్రర్ మాత్రమే. 1999 నుంచి కొనసాగుతున్న పాత వివరాలను యథాతథంగా ఆన్‌లైన్‌లో అప్‌లోడ్ చేయడంతో జరిగిన పొరపాటిది. పొరపాటున నిషేధిత జాబితాలో చేరినప్పుడు దాన్ని సరిచేసి తొలగించవద్దా?’ అని సీఎం ప్రశ్నించారు. రికార్డుల్లో దొర్లిన క్లరికల్ తప్పిదాలపై కూడా ప్రతిపక్షం రాజకీయం చేస్తూ ప్రభుత్వంపై విషం చిమ్ముతోందని రేవంత్‌రెడ్డి మండిపడ్డారు.
వివాదంలో ఉన్నది 3.73 లక్షల ఎకరాలే..
రాష్ట్రంలో కోటి ఎకరాల భూములను నిషేధిత జాబితాలో చేర్చారంటూ ప్రతిపక్షాలు చేస్తున్న దుష్ప్రచారాన్ని సీఎం రేవంత్‌రెడ్డి తిప్పికొట్టారు. ప్రస్తుతం మొత్తం 1,02,05,250 ఎకరాలు 22ఏ జాబితాలో ఉండగా, అందులో 98,31,320 ఎకరాలు పూర్తిగా ప్రభుత్వ, అటవీ, ప్రజా ఆస్తులేనని తేల్చిచెప్పారు. ‘‘అటవీ భూములు 42,61,552 ఎకరాలు, ప్రభుత్వ శిఖం భూములు 29,35,554 ఎకరాలు, పేదలకిచ్చిన అసైన్డ్ భూములు 24,63,940 ఎకరాలు, దేవాదాయ-, వక్ఫ్ భూములు 5,12,792 ఎకరాలు, సీలింగ్ మిగులు భూములు 9,466 ఎకరాలు, కోర్టు అటాచ్‌మెంట్లు 4,747 ఎకరాలు ఉన్నాయి. ఈ 98.31 లక్షల ఎకరాలను నిషేధిత జాబితా నుంచి తొలగించే దమ్ము కేసీఆర్‌కు ఉందా? అటవీ, దేవాదాయ భూములను తొలగించాలని హరీశ్‌రావు ప్రభుత్వానికి లేఖ రాయగలరా?’’ అని సీఎం సవాల్ విసిరారు. వాస్తవానికి వివాదంలో ఉన్నది కేవలం 3,73,930 ఎకరాల ప్రైవేటు పట్టా భూములు మాత్రమేనని స్పష్టం చేశారు.
12 ప్రధాన భూసమస్యలు.. సీఎం చెప్పిన పరిష్కారాలు..
యూఎల్సీ భూములు, కాలనీలు: పాక్షికంగా క్రమబద్ధీకరించిన, మిగిలిపోయిన కాలనీల కోసం పాత, కొత్త దరఖాస్తుదారులకు వర్తించేలా సమగ్ర నూతన విధానం తెచ్చి ఏకకాలంలో రిజిస్ట్రేషన్, క్రమబద్ధీకరణ పూర్తి చేస్తారు.
అనుమతి పొందిన లేఅవుట్లు(హెచ్ఎండీఏ/జీహెచ్ఎంసీ/డీటీసీపీ): గతంలో ప్రభుత్వ అనుమతితో ప్లాట్లు కొనుగోలు చేసి, సర్వే నంబర్ల సమస్యల వల్ల రిజిస్ట్రేషన్లు ఆగిన బాధితులకు వారం రోజుల్లో పూర్తి మార్గదర్శకాలు విడుదల చేసి వెసులుబాటు కల్పిస్తారు.
సింగరేణి కోల్‌బెల్ట్ భూములు: సింగరేణి కార్మికులు ఇళ్లు నిర్మించుకున్న భూములకు శాశ్వత పట్టాలు ఇచ్చేందుకు సింగరేణి యాజమాన్యం, కలెక్టర్లతో కూడిన జిల్లా స్థాయి ఉన్నతాధికార కమిటీని ఏర్పాటు చేసి దరఖాస్తులను పరిష్కరిస్తారు.
ఎల్బీనగర్ జీవో 118 సమస్య: ఎల్బీనగర్ నియోజకవర్గంలో 9,500 కుటుంబాలు ఎదుర్కొంటున్న జీవో 118 సమస్యకు నిర్దిష్ట గడువులో పరిష్కారం చూపి రిజిస్ట్రేషన్లకు అనుమతిస్తారు.
ఇళ్లు కట్టుకున్న అసైన్డ్ భూములు: పేదలు ఇళ్లు నిర్మించుకున్న అసైన్డ్ స్థలాల వివాదాలను పరిష్కరిస్తారు. 1977 పీవోటీ చట్టం పరిధిలోని అసైన్డ్ భూముల్లో ఇళ్లు నిర్మించుకున్న వారి సమస్యపై సమగ్ర న్యాయ సమీక్ష (లీగల్ వెట్టింగ్) జరిపి క్లియరెన్స్ చేయిస్తారు.
ఇందిరమ్మ పథకం స్థలాలు: ప్రభుత్వం కేటాయించిన ఇళ్ల స్థలాలు 22ఏలో పడితే వాటిని విముక్తి చేస్తారు.
వేలం కొనుగోళ్లు: రుణాలు చెల్లించకపోవడంతో బ్యాంకులు, డీసీసీబీ, పీఏసీఎస్ వేలం వేసిన ఆస్తులను డాక్యుమెంట్ల ఆధారంగా 22ఏ నుంచి తొలగిస్తారు.
మార్కెట్ విలువ చెల్లించిన భూములు: ప్రభుత్వానికి మార్కెట్ రేటు చెల్లించి పొందిన అసైన్డ్ భూములను నిషేధిత జాబితా నుంచి మినహాయిస్తారు.
లేఅవుట్ పాత డాక్యుమెంట్లు: గతంలో రిజిస్టర్ అయి లేఅవుట్ అనుమతి ఉన్న ప్లాట్లకు రిజిస్ట్రేషన్ చేస్తారు.
దేవాదాయ, వక్ఫ్ వేలం భూములు: చట్టబద్ధంగా వేలంలో కొనుగోలు చేసిన భూములను క్లియర్ చేస్తారు.
పట్టా భూములు, ఈనాం భూములు: పొరపాటున చేరిన ప్రైవేట్ పట్టా భూములను సవరించి జాబితా నుంచి తొలగిస్తారు.
అప్పీలు వ్యవస్థ: ఆర్డీవో ఉత్తర్వులపై అసంతృప్తి ఉంటే 60 రోజుల్లో జాయింట్ కలెక్టర్‌కు అప్పీలు, 90 రోజుల్లో ప్రభుత్వానికి రివిజన్ చేసుకునే సౌలభ్యం కల్పిస్తారు.
ఈ సమస్యల పరిష్కార ప్రక్రియను వేగవంతం చేసేందుకు సీసీఎల్‌ఏ కమిషనర్, న్యాయశాఖ కార్యదర్శి, స్టాంపులు-రిజిస్ట్రేషన్ల కమిషనర్‌లతో త్రిసభ్య ఉన్నతస్థాయి అధికారుల అథారిటీని నియమిస్తున్నట్లు సీఎం ప్రకటించారు.
మిగిలిన సమస్యల పరిష్కారం ఇలా..
లబ్ధిదారుడి సొంత స్థలంలో ప్రభుత్వ సాయంతో నిర్మించిన ఇందిరమ్మ ఇళ్లకు 5 ఏళ్ల లాక్-ఇన్ పీరియడ్ ముగిసిన తర్వాత పూర్తి ఫ్రీ-హోల్డ్ విక్రయ హక్కులు కల్పిస్తారు.
ప్రైవేటు పట్టా భూముల్లో నాలా రుసుము చెల్లించని కేసుల్లో, రిజిస్ట్రేషన్ సమయంలోనే నామినల్ నాలా ఫీజు వసూలు చేసుకుని వెంటనే సేల్ డీడ్ చేసే వెసులుబాటు.
ప్రభుత్వ భూముల్లో ఏర్పాటైన అనధికార లేఅవుట్లు, కాలనీలను పాత జీవోల స్ఫూర్తితో కొత్త క్రమబద్ధీకరణ పథకం పరిధిలోకి తెచ్చి ఇళ్ల క్రమబద్ధీకరణ.
సికింద్రాబాద్ పరిధిలోని లీజ్‌హోల్డ్ ఆస్తులను నిబంధనల ప్రకారం ఫ్రీ-హోల్డ్ ఆస్తులుగా మారుస్తారు.
స్వాతంత్ర్య సమరయోధులు, ఎక్స్-సర్వీస్‌మెన్, భూదాన్ భూములపై ల్యాండ్ పూలింగ్ విధానం తెచ్చి సమీకరించిన నిధులను ఎస్సీ, ఎస్టీ, మైనారిటీల సంక్షేమానికి వాడతారు.
సీపీఐ పక్ష నేత కూనంనేని సాంబశివరావు కోరినట్లుగా ఏజెన్సీ ప్రాంతాల్లో 1/70 చట్టం చిక్కులు, 100 ఎకరాల్లో ఒక ఎకరం ప్రభుత్వ భూమి ఉంటే ఎదురవుతున్న సమస్యల నివారణకు పక్కాగా సబ్ డివిజన్ (పోడీ) మెకానిజం ఏర్పాటు చేస్తారు.
