చైనా ఏఐ టూల్ సంచలనం.. నెలకు జస్ట్ రూ.240కే ఏఐ ఆఫీస్ అసిస్టెంట్

చైనా ఏఐ టూల్ సంచలనం.. నెలకు జస్ట్ రూ.240కే ఏఐ ఆఫీస్ అసిస్టెంట్

ప్రముఖ చైనా టెక్ దిగ్గజం 'బైదూ' రొటీన్ ఆఫీస్ వర్క్స్ సులభతరం చేసేందుకు ఒక కొత్త ఏఐ టూల్ అందుబాటులోకి తీసుకొచ్చింది. కంపెనీల్లో రోజూవారీగా జరిగే సాధారణ పనులను ఆటోమేట్ చేసేందుకు 'డూక్లా' అనే సరికొత్త ఏఐ సర్వీస్‌ను పరిచయం చేసింది. ఇది కేవలం చాట్‌బాట్ లాగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడమే కాకుండా.. ఒక మనిషిలాగా వివిధ దశల్లో పనులను పూర్తి చేయగలదు. ఉదాహరణకు.. సమాచారాన్ని వెతకడం, రిపోర్ట్స్ తయారు చేయటం, కోడింగ్ చేయడం, కస్టమర్ సపోర్ట్ వంటి పనులను ఇది స్వయంగా చక్కబెడుతుందట.

ఈ ఏఐ సర్వీస్ ప్రధాన ఆకర్షణ దీని ధర. బైదూ ఈ ప్లాట్‌ఫారమ్‌ను నెలకు కేవలం 17.8 యువాన్లకే.. అంటే మన భారత కరెన్సీలో రూ.240 చెల్లింస్తే సరిపోతుందట. ఒక సాఫ్ట్‌వేర్ సబ్‌స్క్రిప్షన్ కంటే తక్కువ ధరకు లభిస్తుండటంతో.. చిన్న, మధ్యతరహా పరిశ్రమలు కూడా ఏఐ టెక్నాలజీని ప్రయోగాత్మకంగా వాడేందుకు ఇది మంచి అవకాశం కల్పిస్తోంది. కంపెనీలు ప్రత్యేకమైన సాఫ్ట్‌వేర్‌లను ఇన్‌స్టాల్ చేయాల్సిన అవసరం లేకుండానే నేరుగా క్లౌడ్ ద్వారా ఈ ఏఐ ఏజెంట్లను వినియోగించుకోవచ్చు.

సాధారణ చాట్‌బాట్‌లకు, ఈ ఏఐ ఏజెంట్లకు మధ్య ఉన్న ప్రధాన తేడా పనితీరే. ఏఐ ఏజెంట్లు ఒక పనిని అప్పగిస్తే.. దానికి కావాల్సిన డేటాను సేకరించి, విశ్లేషించి, చివరికి ఒక డాక్యుమెంట్ రూపంలో రిపోర్ట్ సిద్ధం చేస్తాయి. దీనివల్ల ఆపరేషన్స్, కస్టమర్ సర్వీస్ విభాగాల్లో పని భారం తగ్గుతుంది. బైదూ ఇప్పటికే 'ఎర్నీ' వంటి శక్తివంతమైన ఏఐ మోడళ్లను అభివృద్ధి చేసి ఈ రంగంలో అగ్రగామిగా ఉంది. ఇప్పుడు 'డూక్లా' ద్వారా తన ఆధిపత్యాన్ని మరింత పెంచుకోవాలని భావిస్తోంది.

ALSO READ : భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. 

అయితే ఈ ఏఐ సాంకేతికత ఇంకా అభివృద్ధి దశలోనే ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇది మళ్లీమళ్లీ చేసే రొటీన్ పనులను సమర్థవంతంగా చేసినప్పటికీ, క్లిష్టమైన నిర్ణయాలు తీసుకోవడంలో మనుషుల పర్యవేక్షణ తప్పనిసరని వారు హెచ్చరిస్తున్నారు. ఏదేమైనా ఇంత తక్కువ ధరకే ఏఐ సేవలు లభించడం వల్ల భవిష్యత్తులో ఆఫీసు పనులు పూర్తిగా మారిపోయే అవకాశం ఉంది. డాక్యుమెంట్ల డ్రాఫ్టింగ్ నుంచి డేటా అనలిటిక్స్ వరకు ప్రతిదీ ఏఐ సాయంతో వేగంగా పూర్తయ్యే రోజులు దగ్గర్లోనే ఉన్నాయి. తక్కువ రేటుకే ఏఐ టూల్స్ అందుబాటులోకి రావటం చాలా మంది ఉద్యోగులను కూడా ఆందోళనకు గురిచేస్తోంది.