భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఆ రెండు కారణాలే ర్యాలీని ప్రేరేపించాయ్

భారీ లాభాల్లో ముగిసిన స్టాక్ మార్కెట్లు.. ఆ రెండు కారణాలే ర్యాలీని ప్రేరేపించాయ్

గడిచిన కొన్ని రోజులుగా యుద్ధ భయాలతో వణికిపోయిన భారత స్టాక్ మార్కెట్లు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నాయి. మార్చి 16న ట్రేడింగ్ ముగిసే సమయానికి సెన్సెక్స్, నిఫ్టీలు భారీ లాభాలతో కళకళలాడాయి. అమెరికా-ఇరాన్ మధ్య యుద్ధం ముదురుతున్న నేపథ్యంలో ఇన్వెస్టర్లు అప్రమత్తంగా ఉన్నప్పటికీ.. కనిష్ట స్థాయిల వద్ద కొనుగోలుదారులు ఎగబడటంతో మార్కెట్లు 'గ్రీన్' జోన్‌లోకి దూసుకెళ్లాయి. సెన్సెక్స్ 938 పాయింట్లు లాభపడి 75,502 వద్ద ముగియగా, నిఫ్టీ 257 పాయింట్ల లాభంతో తన ప్రయాణాన్ని ముగించింది.

వరుసగా 4 రోజుల పాటు నష్టపోయిన మార్కెట్లు నేడు పుంజుకోవడానికి ప్రధాన కారణం వాల్యూ బయింగ్. మెటల్, ఆటో, బ్యాంకింగ్, ఎఫ్ఎంసీజీ రంగాల షేర్లలో భారీగా కొనుగోళ్లు జరిగాయి. హిందాల్కో, అల్ట్రాటెక్ సిమెంట్, గ్రాసిమ్, జేఎస్‌డబ్ల్యూ స్టీల్ వంటి సంస్థలు టాప్ గెయినర్లుగా నిలిచాయి. మరోవైపు.. మార్కెట్ ఒడిదుడుకులను సూచించే ఇండియా విక్స్ దాదాపు 5 శాతం తగ్గి 22 స్థాయికి చేరడం ఇన్వెస్టర్లలో అమ్మకాల ఒత్తిడి తగ్గుతుందనే నమ్మకాన్ని కలిగించింది. అయినప్పటికీ విక్స్ ఇంకా 18 పైన ఉండటంతో స్వల్పకాలికంగా మార్కెట్‌లో ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు.

అంతర్జాతీయంగా అందుతున్న సానుకూల వార్తలు కూడా ఇన్వెస్టర్ల సెంటిమెంట్‌ను బలపరిచాయి. ప్రపంచ చమురు సరఫరాకు కీలకమైన 'స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్' జలసంధి గుండా వెళ్లే నౌకలకు రక్షణ కల్పించేందుకు అమెరికా నేతృత్వంలో ఒక కూటమి ఏర్పడనున్నట్లు వాల్ స్ట్రీట్ జర్నల్ రిపోర్ట్ చేసింది. దీనికి తోడు సుమారు 92,712 మెట్రిక్ టన్నుల గ్యాస్‌తో వస్తున్న భారతీయ నౌకలు 'శివాలిక్', 'నందాదేవి' క్షేమంగా జలసంధిని దాటినట్లు వార్తలు రావడం దేశీయంగా ఇంధన కొరత భయాలను తగ్గించింది. శివాలిక్ నౌక ఇవాళ సాయంత్రం 5 గంటలకు భారత్‌కు చేరుకుంటుందని, దానికి ప్రాధాన్యత ప్రాతిపదికన బెర్తింగ్ ఏర్పాట్లు చేసినట్లు షిప్పింగ్ మంత్రిత్వ శాఖ తెలిపింది.

భారత విదేశాంగ మంత్రి ఎస్. జైశంకర్ ఇరాన్‌తో జరిపిన చర్చలు సత్ఫలితాలను ఇస్తున్నాయని పేర్కొనడం దౌత్యపరంగా శాంతి దిశగా అడుగులు పడుతున్నాయనే సంకేతాలను ఇచ్చింది. ఈ సానుకూల పరిణామాలతో అమెరికా ఫ్యూచర్లు కూడా లాభాల్లో ట్రేడవ్వడం గ్లోబల్ మార్కెట్లలో ఉత్సాహాన్ని నింపింది. యుద్ధ మేఘాల మధ్య కూడా భారత ఆర్థిక వ్యవస్థ తన పటిష్టతను చాటుకుంటూ రికవరీ బాట పట్టడం విశేషం. మెుత్తానికి వాల్యూ బైయింగ్, తగ్గిన ఆందోళనలు ఇవాళ మార్కెట్లను నష్టాల నుంచి భారీ లాభాల దిశగా నడిపించాయి.