హోటళ్ల 5 శాతం గ్యాస్ ఛార్జీలు : సంక్షోభం నుంచి సంపద సృష్టిస్తున్న వ్యాపారులు

హోటళ్ల 5 శాతం గ్యాస్ ఛార్జీలు : సంక్షోభం నుంచి సంపద సృష్టిస్తున్న వ్యాపారులు

సంక్షోభం నుంచి సంపద సృష్టించటం అంటే ఇదే.. జనం అంతా గ్యాస్ కొరత ఇబ్బంది పడుతుంటే.. హోటళ్లు మాత్రం సరికొత్త ఐడియాలతో సంపద సృష్టించుకుంటున్నారు. అసలు గ్యాస్ లేదురా బాబూ అంటే.. ఉన్న గ్యాస్ కు అదనపు ఛార్జీలు వేస్తూ.. కస్టమర్ల నుంచి దోచుకుంటున్నారు. ఇప్పటి వరకు సెంట్రల్ GST.. స్టేట్ GST అని మాత్రమే ఉండేవి బిల్లులో.. ఇప్పుడు కొత్తగా గ్యాస్ సర్వీస్ ఛార్జీలు అనే కాలం యాడ్ చేశారు. అసలు గ్యాస్ కొరత ఉంటే.. ఉన్న గ్యాస్ కు అదనపు ఛార్జీలు వసూలు చేయటం ఏంటనే ప్రశ్నలు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నాయి. గ్యాస్ లేకుండా ఎలా వండుతున్నారు.. గ్యాస్ ఉంటేనే కదా హోటల్ నడుపుతున్నది.. అలాంటప్పుడు గ్యాస్ ఛార్జీలు ఏంటనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. బెంగళూరు సిటీలో హోటళ్ల యజమానుల దోపిడీపై వివరాలు ఇలా ఉన్నాయి..

దేశంలో ప్రస్తుతం గ్యాస్ కొరత సామాన్యుడిని వణికిస్తుంటే.. కొందరు వ్యాపారులు మాత్రం ఈ సంక్షోభాన్ని 'క్యాష్' చేసుకోవడంలో సరికొత్త రూట్ వెతుక్కుంటున్నారు. సాధారణంగా హోటల్‌కు వెళ్లి ఏదైనా తింటే సర్వీస్ ఛార్జ్ లేదా జీఎస్‌టీ వేయడం చూస్తుంటాం. కానీ బెంగళూరులోని ఒక కేఫ్ ఏకంగా 'గ్యాస్ క్రైసిస్ ఛార్జ్' పేరుతో కస్టమర్లకు షాక్ ఇచ్చింది. వేడి చేసే అవసరం లేని చల్లని లెమనేడ్ అదేనండి బాబు నిమ్మరసం  ఆర్డర్ చేసినా.. దానిపై గ్యాస్ ఛార్జీలు వసూలు చేయడం ఇప్పుడు సోషల్ మీడియాలో నెటిజన్లను ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ALSO READ : నెతన్యాహు కొత్త వీడియో కూడా AI డీప్ ఫేక్

బెంగళూరుకు చెందిన థియో కేఫ్(Theo Cafe) అనే రెస్టారెంట్‌లో ఒక కస్టమర్ 2 మింట్ లెమనేడ్‌లు ఆర్డర్ చేశాడు. వాటి ధర రూ.358 కాగా.. బిల్లు చూసి అతను అవాక్కయ్యాడు. అందులో 5 శాతం 'గ్యాస్ క్రైసిస్ ఛార్జ్' కింద రూ.17.01 అదనంగా సంస్థ వసూలు చేసింది. విచిత్రం ఏమిటంటే.. నిమ్మరసం తయారు చేయడానికి గ్యాస్ అవసరమే ఉండదు. ఐస్ ముక్కలు, పంచదార, నిమ్మరసం కలిపి ఇచ్చే డ్రింక్‌పై కూడా గ్యాస్ సంక్షోభం పేరుతో డబ్బులు వసూలు చేయడంపై నెట్టింట విమర్శలు వినిపిస్తున్నాయి. "లెమనేడ్ తయారీలో ఎల్పీజీ గ్యాస్ వాడతారా? లేక నిమ్మకాయలు గ్యాస్ స్టవ్ మీద వేడి చేస్తారా?" అంటూ నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

ప్రస్తుతం పశ్చిమాసియాలో యుద్ధ వాతావరణం కొనసాగుతుండటంతో గ్లోబల్ గ్యాస్ సప్లై దెబ్బతిన్న మాట వాస్తవమే. స్ట్రెయిట్ ఆఫ్ హోర్ముజ్ జలసంధి మూతపడటంతో భారత్‌లో కమర్షియల్ ఎల్‌పీజీ సిలిండర్ల కొరత తీవ్రంగా ఉంది. ఢిల్లీ, బీహార్, బెంగాల్, ఒడిశా వంటి రాష్ట్రాల్లో గ్యాస్ సెంటర్ల ముందు కిలోమీటర్ల మేర క్యూలు కనిపిస్తున్నాయి. ఈ పరిస్థితిని సాకుగా చూపి కొన్ని హోటళ్లు మెనూలో ఐటమ్స్ తగ్గించగా, మరికొన్ని హోటళ్లు ఇలా వింత వింత ఛార్జీలతో కస్టమర్ల జేబులకు చిల్లు పెడుతున్నాయి.

ఒకవైపు గ్యాస్ అందక సామాన్యులు అల్లాడుతుంటే.. మరోవైపు ఇలాంటి అక్రమ వసూళ్లు ప్రజల్లో ఆగ్రహాన్ని కలిగిస్తున్నాయి. గ్యాస్ సంక్షోభం ఉంది కదా అని ప్రతి వస్తువుపై ఛార్జీలు వేయడం ఎంతవరకు సమంజసమని వినియోగదారులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆయిల్ రేట్లు, కూరగాయల ధరలతో సతమతమవుతున్న సామాన్యుడికి.. ఇలాంటి వింత ఛార్జీలు తోడవ్వడం ఆగ్రహాన్ని పెంచేస్తోంది. ప్రభుత్వాలు జోక్యం చేసుకుని ఇలాంటి అక్రమ వసూళ్లకు అడ్డుకట్ట వేయాలని జనం డిమాండ్ చేస్తున్నారు. తవ్వుతూ పోతే ఇలాంటి సంస్థలు గల్లీ గల్లీలో కనిపిస్తాయంటూ నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు.