నేను కాఫీ కోసం చనిపోయా: వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని.. డెత్ రూమర్స్‎పై క్లారిటీ

నేను కాఫీ కోసం చనిపోయా: వీడియో రిలీజ్ చేసిన ఇజ్రాయెల్ ప్రధాని.. డెత్ రూమర్స్‎పై క్లారిటీ

టెల్ అవీవ్: ఇజ్రాయెల్ ప్రధాని బెంజమిన్ నెతన్యాహు మరణించినట్లు పెద్ద ఎత్తున పుకార్లు వినిపిస్తున్నాయి. ఇరాన్ దాడుల్లో ఆయన చనిపోయినట్లు జోరుగా ప్రచారం జరుగుతోంది. గత కొద్ది రోజులుగా ఆయన బయట ఎక్కడ కనిపించకపోవడం, మీడియాకు దూరంగా ఉండటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరింది. మరోవైపు నెతన్యాహు మరణించినట్లు వస్తోన్న డెత్ రూమర్స్ అన్ని అవాస్తమని ఆ దేశ ప్రభుత్వం క్లారిటీ ఇచ్చినప్పటికీ పుకార్లు మాత్రం ఆగడం లేదు. 

ఈ తరుణంలో స్వయంగా ప్రధాని నెతన్యాహు ఆదివారం (మార్చి 15) తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో ఓ వీడియో రిలీజ్ చేశారు. ఓ కేఫ్‎లో కూర్చొని రిలాక్స్‎గా కాఫీ తాగుతూ తన మరణ వార్తలను ఖండించారు. తాను కాఫీ కోసం చనిపోయానని తన డెత్ రూమర్స్‎పై సర్కాస్టిక్‎గా రియాక్ట్ అయ్యారు. తాను క్షేమంగా ఉన్నానని.. దేశం కోసం తన విధులను నిర్వర్తిస్తున్నట్లు స్పష్టం చేశారు. అంతేకాకుండా తనకు చేతికి 11 వేళ్లు లేవని.. 10 వేళ్లు మాత్రమే ఉన్నాయని తన రెండు చేతులను కెమెరాలో స్పష్టంగా చూయించారు. స్వయంగా నెతన్యాహు వీడియో విడుదల చేయడంతో ఆయన మరణ పుకార్లకు తెర పడింది. 

2026, ఫిబ్రవరి 28న అమెరికా, ఇజ్రాయెల్ సంయుక్తంగా ఇరాన్‎పై దాడి చేసిన విషయం తెలిసిందే. ఇరాన్ సుప్రీం లీడర్ అయతొల్లా అలీ ఖమేనీని హతం చేశాయి. ఈ దాడులకు ఇరాన్ ప్రతీ దాడులు చేసింది. ఈ దాడుల్లోనే నెతన్యాహు మరణించినట్లు ఊహాగానాలు మొదలయ్యాయి. ఇదే సమయంలో నెతన్యాహు ఎక్స్ హ్యాండిల్‎లో వీడియో పోస్ట్ చేసిన వీడియో కూడా ఒకటి వైరల్‎గా మారింది. ఆ వీడియోలో నెతన్యాహు చేతికి ఆరు వేళ్లు ఉన్నట్లు చూపిస్తోంది. 

దీంతో అది ఏఐ జనరేటేడ్ వీడియో అనే ప్రచారం జరిగింది. నెతన్యాహుకి ఏదో జరిగిందని.. అందుకే ఏఐ వీడియో పోస్ట్ చేశారని పుకార్ల వినిపించాయి. ఈ క్రమంలో ఆయనే స్వయంగా మరో వీడియో పోస్ట్ చేయడం.. అందులో తనకు 10 చేతి వేళ్లే ఉన్నాయని స్పష్టంగా చూయించడంతో మరణ వార్తల ప్రచారానికి ఎండ్ కార్డ్ పడింది. ఇదిలా ఉంటే.. నెతన్యాహు బతికి ఉంటే మాత్రం వెంటాడి మరీ చంపుతామని ఇరాన్ హెచ్చరించింది.