బీఆర్​ఎస్, బీజేపీతో రాష్ట్రానికి నష్టం.. విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు: భట్టి 

బీఆర్​ఎస్, బీజేపీతో రాష్ట్రానికి నష్టం.. విభజన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు: భట్టి 

హైదరాబాద్, వెలుగు: ప్రత్యేక రాష్ట్రం వచ్చి పట్టుమని పదేండ్లు కూడా కాలే బీఆర్ఎస్ సర్కారు రూ.5 లక్షల కోట్ల అప్పుల్లో ముంచిందని సీఎల్పీ నేత మల్లు భట్టి విక్రమార్క విమర్శించారు. రాష్ట్రంలో ఆ పార్టీ చేసిన అభివృద్ధి ఏమీ లేదన్నారు. నాగార్జున సాగర్ నుంచి దేవాదుల వరకు అన్ని భారీ సాగునీటి ప్రాజెక్టులు కాంగ్రెస్​హయాంలో నిర్మించినవేనని పేర్కొన్నారు. బీఆర్ఎస్ సర్కారు ఇన్నేండ్లలో గోదావరిపై ఒక్క కాళేశ్వరం తప్ప.. కృష్ణానదిపై ఒక్క ప్రాజెక్టును కూడా కట్టలేదని మండిపడ్డారు. శనివారం మాజీ సీఎం వైఎస్ రాజశేఖర్​రెడ్డి జయంతి సందర్భంగా  పంజాగుట్టలోని వైఎస్​ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అక్కడి నుంచి గాంధీభవన్, సీఎల్పీకి వెళ్లి వైఎస్ ఫొటోలకు నివాళి అర్పించారు. తర్వాత ఆయన మీడియాతో మాట్లాడారు. మంత్రి కేటీఆర్​కు తెలంగాణ మీద, తెలంగాణ సమాజం మీద అవగాహన లేదన్నారు. బీఆర్​ఎస్​ నేతలు రాబందుల్లా రాష్ట్రాన్ని పీక్కుతింటున్నారని ఆరోపించారు. కాం గ్రెస్ హయాంలో ఇలాంటి అరాచకం లేదన్నారు.

కేటీఆర్ డీల్ మాట్లాడాకే.. బీజేపీ స్టేట్​చీఫ్​ మార్పు

తెలంగాణపై కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం ప్రేమ లేదని భట్టి ఆరోపించారు. రాష్ట్ర విభజన చట్టంలో పేర్కొన్న బయ్యారం స్టీల్ ఫ్యాక్టరీ, ఐటీఐఆర్, కాజేపేట రైల్వే కోచ్ ఫ్యాక్టరీ, ఓ భారీ ఇరిగేషన్ ప్రాజెక్టుకు జాతీయ హోదా తదితర వాటిలో ఒక్క హామీ కూడా బీజేపీ నెరవేర్చలేదని విమర్శించారు. తొమ్మిదేండ్లుగా బీఆర్ఎస్ ప్రభుత్వం ఈ విషయంలో ఏం చేసిందని ప్రశ్నించారు. బీఆర్ఎస్, బీజేపీతో రాష్ట్రానికి తీవ్ర నష్టం జరిగిందన్నారు. ఆ రెండు పార్టీలూ ఒక్కటేనన్నారు. కేటీఆర్ ఢిల్లీ వెళ్లి డీల్ మాట్లాడుకున్నాకే.. కిషన్​రెడ్డిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించారని ఆరోపించారు. అవసరం, అవకాశం వచ్చిన ప్రతిసారీ బీజేపీకి కేసీఆర్​ మద్దతిచ్చారన్నారు. బీఆర్ఎస్ నాయకత్వం తమ కుటుంబ ఆర్థిక లాభం కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెట్టిందని ఫైర్ అయ్యారు.

వైఎస్సార్​ దార్శనికుడు

వైఎస్ రాజశేఖర్ రెడ్డి గొప్ప దార్శనికుడని భట్టి అన్నారు. ఉమ్మడి ఏపీ అభివృద్ధి చెందాలని తపించిన గొప్ప లీడర్ అన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కండ్లుగా పాలన సాగించారన్నారు. పేదలకూ చదువు అందించాలన్న ఉద్దేశంతో ఫీజు రీయింబర్స్​మెంట్ వంటి గొప్ప స్కీమ్​ను తీసుకొచ్చారన్నారు. రాజకీయాలు, కులమతాలకతీతంగా ఉమ్మడి రాష్ట్రంలో అర్హులందరికి సంక్షేమ పథకాలు అందించారన్నారు.