పుల్వామా దాడి యాక్సిడెంట్  అంటూ డిగ్గీ సంచలనం : బీజేపీ ఫైర్

పుల్వామా దాడి యాక్సిడెంట్  అంటూ డిగ్గీ సంచలనం : బీజేపీ ఫైర్

ఢిల్లీ : పుల్వామాలో ఫిబ్రవరి 14న జరిగింది ఉగ్రదాడి కాదనీ.. అది ఒక ప్రమాదం(యాక్సిడెంట్) అంటూ మధ్యప్రదేశ్ మాజీ సీఎం, కాంగ్రెస్ సీనియర్ నేత దిగ్విజయ్ సింగ్ చేసిన కామెంట్స్ రాజకీయ ప్రకంపనలు రేపుతున్నాయి. పుల్వామా ఉగ్రదాడికి ప్రతీకారంగా తీసుకుంటున్న చర్యలను రాజకీయంగా బీజేపీ ఉపయోగించుకుంటోందంటూ విమర్శలు చేస్తున్న కాంగ్రెస్, విపక్షాలు.. ఇపుడు తమ మాటల దాడిని పెంచాయి. పుల్వామా యాక్సిడెంట్  తర్వాత ఎయిర్ స్ట్రైక్ చేయడంపై విదేశీ మీడియాలో సందేహాస్పద కథనాలు వస్తున్నాయని.. ఇది కేంద్రప్రభుత్వ విశ్వసనీయతను ప్రశ్నార్థకం చేస్తోందని అన్నారు దిగ్విజయ్ సింగ్.

దిగ్విజయ్ తర్వాత.. కాంగ్రెస్ సీనియర్ నేత కపిల్ సిబల్ కూడా అలాంటి వ్యాఖ్యానాలు చేశారు. న్యూయార్క్ టైమ్స్, వాషింగ్టన్ పోస్ట్, లండన్ బేస్డ్ జేన్ ఇన్ఫర్మేషన్ గ్రూప్, డెయిలీ టెలిగ్రాఫ్, ద గార్డియన్, రాయిటర్స్ లాంటి అంతర్జాతీయ మీడియా సంస్థలు… పాకిస్థాన్ లోని బాలాకోట్ లో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదని అంటున్నాయనీ.. వీటికి ప్రధానమంత్రి మోడీ వివరణ ఇవ్వాలని కపిల్ సిబాల్ డిమాండ్ చేశారు.

దిగ్విజయ్ సహా.. కాంగ్రెస్ నేతల విమర్శలపై బీజేపీ తీవ్రస్థాయిలో మండిపడుతోంది. పుల్వామా ఉగ్రదాడిని దిగ్విజయ్ సింగ్ యాక్సిడెంట్ గా చెప్పడాన్ని  తప్పుపట్టిన విదేశాంగ శాఖ సహాయ మంత్రి వీకే సింగ్.. రాజీవ్ గాంధీ హత్య ఉగ్రవాదుల ఘాతుకమా.. లేక యాక్సిడెంటా చెప్పాలని అడిగారు.

కేంద్రమంత్రి ప్రకాశ్ జవదేకర్ కూడా దిగ్విజయ్ కామెంట్స్ ను తీవ్రంగా ఖండించారు. కీలక సమయంలో సైన్యానికి మద్దతుగా ఉండాల్సింది పోయి ఆధారాలు అడగడం, వారి నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయడమే అన్నారు. సైన్యం సమర్థతపై విశ్వాసం ఉంచాలన్నారు.

కపిల్ సిబల్ ఆరోపణలకు కౌంటర్ ఇచ్చారు కేంద్రమంత్రి రాజ్యవర్థన్ సింగ్ రాథోడ్. దాడులు జరిగాయో లేదో తెలుసుకోవాలంటే.. బాలకోట్ వెళ్లండని ఘాటుగా రిప్లై ఇచ్చారు. ఈవీఎంలను ట్యాంపరింగ్ చేశారని లండన్ లో ఆరోపణలు చేశారని… అదేవిధంగా బాలాకోట్ వెళ్లి పరిశీలించాలని సిబల్ పై సెటైర్ వేశారు కేంద్రమంత్రి.