కేజ్రీవాల్‌ను ఇరికించే కుట్రే: ఆతిశీ

కేజ్రీవాల్‌ను ఇరికించే కుట్రే: ఆతిశీ

న్యూఢిల్లీ : ఢిల్లీ సీఎం కేజ్రీవాల్‌‌‌‌ను ఇరికించేందుకు బీజేపీ కుట్ర చేస్తున్నదని ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్)​ ఆరోపించింది. కేజ్రీవాల్‌‌‌‌ సహాయకుడు బిభవ్‌‌‌‌ కుమార్‌‌‌‌ దాడి చేశాడనే స్వాతి మలివాల్‌‌‌‌ ఆరోపణలపై రాజకీయ దుమారం చెలరేగుతున్న నేపథ్యంలో శుక్రవారం ఆప్​ నాయకురాలు ఆతిశీ స్పందించారు. దాడికి సంబంధించి మలివాల్ చేస్తున్న ఆరోపణలు నిరాధారమని ఆతిశీ తోసిపుచ్చారు. ఇదంతా ఢిల్లీ సీఎం, ఆమ్ ఆద్మీ పార్టీ చీఫ్​ అర్వింద్​ కేజ్రీవాల్‌‌‌‌ను ఇరికించేందుకు బీజేపీ పన్నిన కుట్రగా పేర్కొంది. ‘‘తనపై క్రూరమైన దాడి జరిగిందని మలివాల్ ఆరోపించారు. కానీ ఈ రోజు వెలువడిన 52 సెకండ్ల వీడియోలో అందుకు పూర్తిగా భిన్నమైన దృశ్యాలు కనిపిస్తున్నాయి” అని ఆతిశీ అన్నారు. అందులో బిభవ్ కుమార్‌‌‌‌ను, సెక్యూరిటీ సిబ్బందిని మలివాల్ బెదిరిస్తున్న దృశ్యాలు ఉన్నాయని చెప్పారు.

సందర్భం లేకుండా వీడియోలు షేర్ అవుతున్నయి:  స్వాతి మలివాల్

సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియోలపై స్వాతి మలివాల్ స్పందించారు. ‘‘ఎప్పటి లాగానే, ఈసారి కూడా ఈ పొలిటికల్ హిట్‌‌‌‌మ్యాన్ తనను తాను రక్షించుకోవడానికి ప్రయత్నాలు ప్రారంభించాడు. తన వ్యక్తులలో ఎలాంటి సందర్భం లేకుండా ట్వీట్లు చేయించడం, వీడియోలను షేర్ చేయించడం ద్వారా అతను ఈ నేరం నుంచి తనను తాను రక్షించుకోగలనని భావిస్తున్నాడు. ఒకరిని కొట్టడాన్ని ఎవరు వీడియో తీస్తారు? ఆ ఇంట్లోని సీసీటీవీ ఫుటేజీలు బయటకు తీస్తే నిజం అందరికీ తెలుస్తుంది” అని ఆమె ఎక్స్​లో పోస్ట్ చేశారు.