విన్జో గేమింగ్‌కు ఈడీ భారీ షాక్: రూ. 590 కోట్ల ఆస్తులు ఫ్రీజ్.. విచారణలో సంచలన నిజాలు

విన్జో గేమింగ్‌కు ఈడీ భారీ షాక్: రూ. 590 కోట్ల ఆస్తులు ఫ్రీజ్.. విచారణలో సంచలన నిజాలు

ఆన్‌లైన్ గేమింగ్ రంగంలో ప్రముఖ సంస్థ అయిన విన్జో (Winzo) కు ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) గట్టి షాక్ ఇచ్చింది. నిబంధనలకు విరుద్ధంగా విదేశీ పెట్టుబడులు పెట్టినట్లు ఆరోపిస్తూ ఆ సంస్థకు చెందిన రూ. 590 కోట్ల ఆస్తులను ఈడీ జప్తు చేసింది.

విన్జో సంస్థ  విదేశీ యూనిట్ల (అమెరికా & సింగపూర్) ద్వారా అక్రమంగా పెట్టుబడులు పెట్టిందని ఈడీ గుర్తించింది. ఫెమా (FEMA) చట్టం ప్రకారం అనుమతి లేని పనులకు నిధులు మళ్లించినట్లు ఆరోపణలు రావడంతో, విన్జోకు చెందిన బ్యాంక్ అకౌంట్లు, ఫిక్స్‌డ్ డిపాజిట్లు,  మ్యూచువల్ ఫండ్స్‌ను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.

 విన్జో అనుబంధ సంస్థలైన విన్జో యుఎస్ (USA), విన్జో ఎస్జీ (Singapore) ద్వారా సుమారు రూ. 492 కోట్ల విదేశీ పెట్టుబడులు పెట్టింది. అమెరికా విభాగం ద్వారా బ్రెజిల్, జర్మనీ, యూఎస్ దేశాల్లో బింగో, లూడో, బ్లాక్ జాక్ వంటి ఆన్‌లైన్ జూదం (Gambling) ఆటలను నిర్వహించినట్లు ఈడీ చెబుతోంది. భారతీయ నిబంధనల ప్రకారం విదేశాల్లో ఇలాంటి జూద క్రీడల్లో పెట్టుబడులు పెట్టడం నిషేధం.

 ఈ విదేశీ కంపెనీలకు అక్కడ ప్రత్యేకంగా ఉద్యోగులు కానీ, ఆఫీసులు కానీ లేవు. వాటి నిర్వహణ, అకౌంటింగ్ అంతా భారతదేశం నుండే జరుగుతోందని ఈడీ విచారణలో తేలింది. 2025లో వచ్చిన కొత్త ఆన్‌లైన్ గేమింగ్ చట్టం (PROG Act) ప్రకారం.. నిషేధించిన గేమింగ్ యాక్టివిటీస్‌లో విన్జో నిధులను కొనసాగించడం చట్టవిరుద్ధమని ఈడీ పేర్కొంది.

 విదేశీ పెట్టుబడుల పేరుతో నిధులను బయట దేశాలకు తరలించి, అక్కడ నిబంధనలకు విరుద్ధంగా రియల్-మనీ గేమింగ్  నిర్వహించడం వల్ల ఈ చర్యలు తీసుకున్నారు. ఇలా అక్రమంగా సంపాదించిన రూ. 590 కోట్లు విదేశీ బ్యాంకు ఖాతాల్లో ఉన్నట్లు అధికారులు గుర్తించారు.