అమెరికా Vs ఇరాన్ : సైన్యంలో ఎవరి బలం ఎంత.. ఇరాన్‌కు యుద్ధం చేసే సత్తా ఉందా..?

అమెరికా Vs ఇరాన్ : సైన్యంలో ఎవరి బలం ఎంత.. ఇరాన్‌కు యుద్ధం చేసే సత్తా ఉందా..?

అమెరికా ఇరాన్ మధ్య ముదురుతున్న ఉద్రిక్తతలు ప్రపంచాన్ని మరో మహా యుద్ధం అంచున నిలబెట్టాయి. ఒకవేళ పూర్తిస్థాయి యుద్ధం గనుక సంభవిస్తే.. ఇరాన్ తనను తాను ఎలా కాపాడుకుంటుంది? అగ్రరాజ్యం అమెరికా భారీ ఆధునిక సైనిక శక్తిని ఇరాన్ ఎదుర్కోగలదా? అనే ప్రశ్నలు ఇప్పుడు అందరినీ తొలిచేస్తున్నాయి. యుద్ధం చేయటానికి అసలు ఎవరి దగ్గర ఏం ఉన్నాయి అనే వివరాలను ఒక్కసారి తెలుసుకుందాం..

సైనికపరంగా చూస్తే.. ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన దేశం అమెరికా అని గ్లోబల్ ఫైర్ పవర్ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. ఇరాన్ 14వ స్థానంలో ఉన్నప్పటికీ.. అమెరికాతో పోలిస్తే దాని శక్తి చాలా స్వల్పం. అమెరికా వద్ద ఉన్న అత్యాధునిక ఆయుధ సంపత్తి, అణుబాంబులు ఇరాన్‌ను కేవలం నిమిషాల్లోనే తుడిచిపెట్టగల సామర్థ్యాన్ని కలిగి ఉన్నాయి. ప్రపంచంలోని అణు ఆయుధాల్లో 90 శాతానికి పైగా అమెరికా, రష్యాల వద్దే ఉండగా.. ఇరాన్ వద్ద కనీసం ఒక్క అణుబాంబు కూడా లేవు.

సైనిక బలాబలాల విషయానికి వస్తే.. అమెరికా వద్ద దాదాపు 21 లక్షల మంది సుశిక్షితులైన సైనికులు సిద్ధంగా ఉండగా, ఇరాన్ వద్ద అందులో మూడో వంతు అంటే 8లక్షలు మాత్రమే ఉన్నారు. శిక్షణ, పరికరాల పరంగా కూడా అమెరికా సైనికులు ఇరాన్ సైనికుల కంటే ఎంతో ముందున్నారు. ఇక రక్షణ బడ్జెట్ విషయానికి వస్తే.. అమెరికా ఏటా సుమారు 547 బిలియన్ యూరోలు ఖర్చు చేస్తోంది. ఇది చైనా, రష్యా, భారత్, సౌదీ అరేబియా, ఫ్రాన్స్, యూకే, జపాన్ దేశాల మొత్తం రక్షణ బడ్జెట్ కంటే ఎక్కువ. దీనికి భిన్నంగా ఇరాన్ రక్షణ బడ్జెట్ కేవలం 4.8 బిలియన్ యూరోలు మాత్రమే. యుద్ధ ట్యాంకులు, విమానాల విషయంలోనూ అమెరికాకు ఎదురే లేదు. అమెరికా వద్ద 6,200 అత్యాధునిక అబ్రమ్స్ ట్యాంకులు ఉండగా.. ఇరాన్ వద్ద ఉన్న 1,650 ట్యాంకులు కోల్డ్ వార్ కాలం నాటివే.

గగనతలం, సముద్ర మార్గాల్లో అమెరికా తిరుగులేని శక్తిగా ఉంది. అమెరికా వైమానిక దళం వద్ద 13వేలకు పైగా యుద్ధ విమానాలు ఉండగా.. నౌకాదళం వద్ద 24 భారీ విమాన వాహక నౌకలు ఉన్నాయి. కానీ జస్ట్ లెక్కల ఆధారంగానే విజేతను నిర్ణయించలేమని గత అనుభవాలు చెబుతున్నాయి. వియత్నాం, అఫ్గానిస్తాన్ వంటి యుద్ధాల్లో అమెరికా ఎదుర్కొన్న చేదు అనుభవాలు.. ఆయుధ సంపత్తి ఎంత ఉన్నా క్షేత్రస్థాయిలో గెలుపు అంత సులభం కాదని నిరూపించాయి. అమెరికా నేరుగా యుద్ధానికి దిగితే ఆధిపత్యం చలాయించవచ్చు. కానీ ఇరాన్ అనుసరించే గెరిల్లా యుద్ధ తంత్రాలు, క్షిపణి దాడులు అమెరికాకు భారీ నష్టాన్ని కలిగించే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ ఇద్దరి మధ్య యుద్ధం జరిగితే అది కేవలం ఈ రెండు దేశాలకే కాకుండా ప్రపంచ ఆర్థిక వ్యవస్థకు కోలుకోలేని దెబ్బ తీస్తుంది.