దేశ రాజకీయాల్లో విషాదం: ఫుట్‎బాల్ ఆడుతూ ఎంపీ రికీ సింగ్కాన్ మృతి

దేశ రాజకీయాల్లో విషాదం: ఫుట్‎బాల్ ఆడుతూ ఎంపీ రికీ సింగ్కాన్ మృతి

షిల్లాంగ్: మేఘాలయ రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర విషాదం నెలకొంది. షిల్లాంగ్ ఎంపీ, వాయిస్ ఆఫ్ ది పీపుల్ పార్టీ (VPP) నాయకుడు రికీ ఆండ్రూ జె సింగ్కాన్ మరణించారు. గురువారం (ఫిబ్రవరి 19) సాయంత్రం షిల్లాంగ్‌లో ఫుట్‌బాల్ ఆడుతూ ఒక్కసారిగా కుప్పకూలి ఆయన హఠాన్మరణం చెందారు.

నేషనల్ మీడియా వివరాల ప్రకారం.. సింగ్కాన్ గురువారం (ఫిబ్రవరి 19) సాయంత్రం షిల్లాంగ్ సమీపంలోని మావ్లై మావియోంగ్‌లోని స్నేహితులతో ఫుట్‌బాల్ ఆడటానికి వెళ్ళాడు. మ్యాచ్ జరుగుతుండగా ఆకస్మాత్తుగా మైదానంలో కుప్పకూలిపోయినట్లు సమాచారం. వెంటనే అతన్ని వైద్య సహాయం కోసం మావియోంగ్ కమ్యూనిటీ హెల్త్ సెంటర్ (CHC)కి తరలించారు. 

పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్య చిక్సిత కోసం అక్కడి నుంచి జైవ్‌లోని డాక్టర్ హెచ్ గోర్డాన్ రాబర్ట్స్ ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో రికీ ఆండ్రూ జె సింగ్కాన్ మరణించినట్లు వైద్యులు ప్రకటించారు. సింగ్కాన్ ఆకస్మిక మరణంపై పలువురు రాజకీయ నాయకులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో షిల్లాంగ్ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసి రికీ ఆండ్రూ జె సింగ్కాన్ అఖండ విజయం సాధించారు. మూడుసార్లు కాంగ్రెస్ ఎంపీగా గెలిచిన విన్సెంట్ హెచ్ పాలాను 3.7 లక్షల ఓట్ల భారీ తేడాతో ఓడించారు.

సింగ్కాన్‌ను మృతి పట్ల మేఘాలయ ముఖ్యమంత్రి కాన్రాడ్ సంగ్మా సంతాపం తెలిపారు. సింగ్కాన్‌ అకాల మరణం బాధ కలిగించిందని అన్నారు. రికీ అంకితభావం గల నాయకుడని.. ఎప్పుడూ ప్రజల కోసం పరితపించే నేత అని కొనియాడారు. ఈ క్లిష్ట సమయంలో ఆయన కుటుంబం, స్నేహితులు, శ్రేయోభిలాషులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానని అన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని దేవున్ని ప్రార్థిస్తున్నానని పేర్కొన్నారు. పార్టీలకు అతీతంగా ఆయనను నిబద్ధత కలిగిన ప్రజా ప్రతినిధిగా గుర్తుచేసుకుంటూ నాయకులు సంతాపం వ్యక్తం చేశారు.