TCS టెక్కీలకు శుభవార్త.. 2 ఏళ్ల ఆ ఉద్యోగులకు వేరియబుల్ పే పెంచిన కంపెనీ..

TCS టెక్కీలకు శుభవార్త.. 2 ఏళ్ల ఆ ఉద్యోగులకు వేరియబుల్ పే పెంచిన కంపెనీ..

ఏఐ ప్రకంపనలతో రోజురోజుకూ సర్వీస్ రంగం కొత్త భయాలతో వణికిపోతున్న వేళ టెక్కీలకు టీసీఎస్ శుభవార్త చెప్పింది. మరీ ముఖ్యంగా క్యూ3 ఫలితాల తర్వాత కంపెనీలో పనిచేస్తున్న మిడ్, సీనియర్ లెవెల్ ఉద్యోగులకు ఊరటను అందించే ఒక విషయాన్ని ప్రకటించింది. దీంతో దాదాపు 2 ఏళ్ల తర్వాత మళ్లీ మంచి రోజులు వచ్చాయా అనే ఫీలింగ్ టెక్కీల నుంచి వినిపిస్తోంది. 

టెక్ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ తన ఉద్యోగులకు తీపి కబురు అందించింది. గత రెండేళ్లుగా నిరాశగా ఉన్న మిడ్ అండ్ సీనియర్ లెవల్ ఉద్యోగుల వేరియబుల్ పే భారీగా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికానికి గాను.. ఈ విభాగాల్లోని ఉద్యోగులకు 80 శాతం వరకు వేరియబుల్ పే చెల్లించనున్నట్లు చెప్పింది. గతంలో ఇది కేవలం 20 నుండి 50 శాతానికి పరిమితం కాగా.. ఇప్పుడు ఆఫర్ లెటర్లలో పేర్కొన్న విధంగా పే చేయటం గమనార్హం. జూనియర్ స్థాయిలో ఇప్పటికే 70 శాతం టెక్కీలకు 100 శాతం వేరియబుల్ పే అందుతోంది టీసీఎస్.

కేవలం టీసీఎస్ మాత్రమే కాదు.. ఇతర ఐటీ దిగ్గజాలు కూడా ఇదే బాటలో కొనసాగుతున్నాయి. ఇన్ఫోసిస్ తన సగటు వేరియబుల్ పేను 85 శాతానికి పెంచగా.. కాగ్నిజెంట్ 2025 సంవత్సరానికి గాను 100 శాతం బోనస్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఏఐ వల్ల ఐటీ రంగం సంక్షోభంలో పడుతుందనే ఆందోళనల మధ్య, కంపెనీలు ఇలా భారీగా వేతనాలు పెంచడం అనేది ఐటీ రంగం పటిష్టతకు నిదర్శనంగా నిలుస్తోంది. టీసీఎస్ తన ఏఐ వ్యాపారం ద్వారా 1.8 బిలియన్ డాలర్ల వార్షిక ఆదాయాన్ని సాధించడమే కాకుండా,.. 5వేలకు పైగా ఏఐ ప్రాజెక్టులను పూర్తి చేయడం తాజా పే ట్రెండ్‌కి కారణంగా తెలుస్తోంది. 

మరోవైపు టీసీఎస్ తన పనితీరును మరింత మెరుగుపరచుకునేందుకు వీలుగా మానవ వనరుల రీస్ట్రక్చరింగ్ చేపట్టింది. సుమారు 12వేల మంది ఉద్యోగులను, ముఖ్యంగా సాంప్రదాయ నైపుణ్యాలకే పరిమితమైన మిడ్, సీనియర్ లెవల్ సిబ్బందిని తొలగిస్తూ.. భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా ఏఐ నైపుణ్యం కలిగిన ఫ్రెషర్లను నియమించుకుంటోంది. ప్రస్తుతం కంపెనీ తీసుకుంటున్న అనుభవజ్ఞులైన ఉద్యోగుల్లో 50 శాతం మందికి పైగా నెక్స్ట్ జనరేషన్ టెక్నాలజీలపై పట్టు ఉండటం విశేషం. సైబర్ సెక్యూరిటీ, క్లౌడ్, ఎంటర్‌ప్రైజ్ సొల్యూషన్స్ వంటి విభాగాల్లో నియామకాలకు ప్రాధాన్యత ఇస్తోంది టీసీఎస్ మారుతున్న అవసరాలకు అనుగుణంగా.

వ్యాపార పరంగా కూడా టీసీఎస్ దూసుకుపోతోంది. మూడవ త్రైమాసికంలో 9.3 బిలియన్ డాలర్ల విలువైన డీల్స్ కుదుర్చుకుని అంచనాలను మించిపోయింది. సీఈఓ కృతివాసన్ ప్రకారం, ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే సమయానికి కంపెనీ ఆదాయం 38 నుండి 39 బిలియన్ డాలర్ల మార్కును చేరుకునే అవకాశం ఉంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు మరియు అమెరికా వీసా విధానాల వంటి సవాళ్లు ఉన్నప్పటికీ, కంపెనీ వద్ద ఉన్న భారీ ఆర్డర్ బుక్ రాబోయే 2027 ఆర్థిక సంవత్సరంలో కూడా స్థిరమైన వృద్ధిని అందిస్తుందని యాజమాన్యం ధీమా వ్యక్తం చేస్తోంది.