T20 Worlad Cup: మహ్మద్ నబీ స్పిన్ మాయాజాలం: కెనడాను చిత్తు చిత్తుగా ఓడించిన ఆప్ఘాన్

T20 Worlad Cup: మహ్మద్ నబీ స్పిన్ మాయాజాలం: కెనడాను చిత్తు చిత్తుగా ఓడించిన ఆప్ఘాన్

చెన్నై: టీ20 వరల్డ్ కప్‎లో భాగంగా చెన్నైలోని చిదంబరం స్డేడియం వేదికగా జరిగిన మ్యాచులో కెనడాపై ఆప్ఘానిస్తాన్ ఘన విజయం సాధించింది. బ్యాటింగ్‎లో ఇబ్రహీం జద్రాన్ (95) మెరుపులు మెరిపించి తృటిలో సెంచరీ కోల్పోగా.. బౌలింగ్‎లో మహ్మద్ నబీ నాలుగు వికెట్లతో స్పిన్ మాయాజాలం సృష్టించడంతో కెనడాను 82 పరుగుల తేడాతో ఆప్ఘాన్ చిత్తు చేసింది. ఇబ్రహీం జద్రాన్ మ్యాన్ ఆఫ్ ది మ్యా్చ్ అవార్డ్ అందుకున్నాడు. 

ఈ మ్యాచులో తొలుత బ్యాటింగ్ చేసిన ఆఫ్ఘాన్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 200 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్ ఇబ్రహీం జద్రాన్ 95 రన్స్ చేసి తృటిలో సెంచరీ చేజార్చుకున్నాడు. మరో ఓపెనర్ రహ్మనుల్లా గుర్బాజ్ (30) ఫర్వాలేదనిపించాడు. చివర్లో సెదికుల్లా అతల్ (44) మెరుపులు మెరిపించడంతో ఆప్ఘానిస్తాన్ భారీ స్కోర్ చేసింది. కెనడా బౌలర్లలో జస్కరన్ సింగ్ మూడు వికెట్లు పడగొట్టాడు. డిలాన్ హీలిగర్ ఒక సాధించాడు. 

అనంతరం 201 పరుగుల భారీ ఛేజింగ్‎కు బరిలోకి దిగిన కెనడా ఓవర్లన్నీ ఆడి 118 రన్స్ చేసింది. కెనడా బ్యాటర్లలో హర్ష్ ఠాకర్ (30), సాద్ బిన్ జాఫర్ (28) తప్ప మిగిలిన వారంతా ఘోరంగా విఫలమయ్యారు. ఆప్ఘాన్ స్పిన్నర్లు కెనడా పతనం శాసించారు. మహ్మద్ నబీ నాలుగు వికెట్లతో కెనడా నడ్డి విరచగా.. రషీద్ ఖాన్ రెండు వికెట్లు తీశాడు. ముజీబ్ ఉర్ రెహ్మాన్, ఓమర్జాయ్ చెరో వికెట్ తీశారు. దీంతో కెనడా 82 పరుగుల భారీ తేడాతో ఓటమి మూట గట్టుకుని మెగా టోర్నీ నుంచి నిష్క్రమించింది.