బాబు కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులతో దాడి

బాబు కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులతో దాడి

బాబు అమరావతి టూర్‌‌లో టెన్షన్

రాజధాని రైతులు, వైసీపీ నిరసన

తప్పులు ఎత్తి చూపేందుకు వస్తే దాడులా?: మండిపడ్డ బాబు

శంకుస్థాపన ప్రాంతంలో సాష్టాంగ నమస్కారం

అమరావతి, వెలుగు: మాజీ సీఎం, టీడీపీ చీఫ్ చంద్రబాబు అమరావతి పర్యటనలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. గురువారం చంద్రబాబు పర్యటన మొదలైన అరగంటలోనే రాజధాని గ్రామాల రైతులు రోడ్ల మీదకు వచ్చి నిరసన తెలిపారు. చంద్రబాబు కాన్వాయ్ ఉండవల్లి సెంటర్ కు రాగానే రైతులు, వైసీపీ కార్యకర్తలు ఆందోళనకు దిగారు. అమరావతి పేరుతో గ్రాఫిక్స్ చూపించి మోసం చేశారని ప్లకార్డులు ప్రదర్శించారు. ఈక్రమంలో టీడీపీ శ్రేణులు, రైతుల మధ్య తోపులాట జరిగింది. ఆందోళనకారులు చంద్రబాబు ప్రయాణిస్తున్న బస్సుపై రాళ్లు, చెప్పులు విసిరారు. వెంటనే అప్రమత్తమైన పోలీసులు వారిని చెదరగొట్టారు. కృష్ణా నది పక్కన ఉన్న ఇంటి నుంచి మొదలైన చంద్రబాబు పర్యటన అమరావతికి శంకుస్థాపన చేసిన ఉద్దండరాయునిపాలెం వరకు సాగింది. రాజధాని శంకుస్థాపన ప్రాంతంలో నేలతల్లికి చంద్రబాబు సాష్టాంగ నమస్కారం చేశారు.

రాజధానికి  కులం అంటగడతారా?

‘అమరావతి విషయంలో ప్రభుత్వం తప్పులను ఎత్తి చూపడానికి వస్తే చెప్పులు, రాళ్లతో దాడి చేయిస్తారా..’ అని జగన్ సర్కారును చంద్రబాబు ప్రశ్నించారు. డీఎస్పీ సమక్షంలోనే తనపై రాళ్లు, చెప్పులు విసిరారని వాపోయారు. అమరావతిలో పర్యటన తర్వాత సాయంత్రం మీడియా సమావేశంలో చంద్రబాబు మాట్లాడారు. “ఏపీ రాజధాని అమరావతికి వైసీపీ ప్రభుత్వం కులాన్ని అంటగడుతోంది. అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా కట్టాలనుకుంటే జగన్ ప్రభుత్వం శ్మశానంగా మార్చేస్తోంది. టీడీపీ ప్రభుత్వంలో రాజధానికి 32 వేల ఎకరాలు ఇచ్చిన రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. తెలంగాణకు ప్రధాన ఆదాయ వనరుగా ఉన్న హైదరాబాద్ అంటే నేను గుర్తుకు వస్తా. ఏ ఒక్కరి కోసమో, పార్టీ కోసమో హైదరాబాద్ ను అభివృద్ధి చేయలేదు. తెలుగు జాతి కోసం నిర్మించా. హైదరాబాద్ అభివృద్ధితో ఒక కులం వాళ్లే బాగుపడ్డారా” అని ప్రశ్నించారు. ఏపీ రాజధానిగా అమరావతి కంటే సెంటర్ ప్లేస్ ఎక్కడుందన్నారు. అమరావతి నిర్మాణం కొనసాగించేలా ప్రభుత్వంపై ఒత్తిడి పెంచడానికే పర్యటన చేపట్టానన్నారు. 15 ఏళ్లలో అమరావతిని ప్రపంచ స్థాయికి తీసుకెళ్లాలని తాను భావిస్తే జగన్ ప్రభుత్వం రివర్స్ గేర్ లో వెళుతోందని విమర్శించారు. చంద్రబాబు కాన్వాయ్ పై రాళ్లు, చెప్పులతో దాడి చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీజీపీ గౌతమ్ సవాంగ్ తెలిపారు.

రైతులకు ధన్యవాదాలు: కొడాలి

చంద్రబాబుకు చెప్పులతో స్వాగతం పలికిన రైతులకు ధన్యవాదాలు తెలుపుతున్నానని ఏపీ మంత్రి కొడాలి నాని వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. రైతుల భూములు లాక్కొని నమ్మకద్రోహం చేసిన చంద్రబాబుకు బాగా బుద్ధి చెప్పారన్నారు.