ఇన్సూరెన్స్ కోసం కేసునే మార్చిన్రు

ఇన్సూరెన్స్ కోసం కేసునే మార్చిన్రు

మహబూబ్ న‌గర్ జిల్లాలో టీఆర్ఎస్ నేత ప్లాన్

మహబూబ్ న‌గర్, వెలుగు: చనిపోయిన తన తమ్ముడికి పెద్దమొత్తంలో ఇన్సూరెన్స్ ఇప్పించుకోవాలని ఓ అధికార పార్టీనేత కక్కుర్తిపడితే , ఓ ఎస్ఐ అన్నివిధాలా సహకరించాడు. వరి కుప్పకు బైకు తగిలి పడి మరణించిన వ్యక్తిని కారుగుద్ది చనిపోయినట్లు క్రియేట్ చేశారు. ఆర్టీఐ కింద ఆధారాలు సంపాదించిన 20మంది గ్రామస్థులు మహబూబ్నగర్ ఎస్పీకి తాజాగా ఫిర్యాదు చేశారు. మహబూబ్నగర్ జిల్లా చిన్నచింతకుంట మండలం అమ్మాపూర్కి చెందిన కృష్ణయ్య అలియాస్ గోపికృష్ణ వనపర్తి జిల్లా కొత్తకోట కు 2018 డిసెంబర్4న బైక్ (టీఎస్ 06 ఈసీ 9409)పై వెళ్తుండగా, వనపర్తి జిల్లా మదనాపురం పీఎస్ పరిధిలోని దుప్పల్లి శివారులో రాత్రి పూట రోడ్డుమీద వేసిన వరి కుప్పకు తగిలి పడ్డాడు. గాంధీ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ డిసెంబర్6న మరణించాడు. చనిపోయిన వ్యక్తికిగానీ, బైకుకుగానీ ఎలాంటి ఇన్సూరెన్స్ లేకపోవడంతో కొత్త డ్రామాకు తెరతీశారు.

ప్రమాద స్థలాన్ని మార్చి…

ప్రమాదంలో చనిపోయింది సొంత తమ్ముడే కావడంతో టీఆర్ఎస్ లీడర్ చక్రం తిప్పాడు. ప్రమాదం జరిగింది మదనాపురం పీఎస్ పరిధిలో అయితే సీసీ కుంట పీఎస్లో ఫిర్యాదు ఇప్పించాడు. 2018 డిసెంబర్5న సీసీ కుంట పీఎస్లో క్రైం నెం. 65/18న ఎఫ్ఐఆర్ నమోదైంది. సెక్షన్ 337 కింద కేసు నమోదు చేశారు. ఎస్ఐ ప్రమాదం జరిగిన ప్రదేశాన్నే మార్చి సీన్ఆఫ్ అఫెన్స్ సృష్టించారు. కారు గుద్దితే చనిపోయాడని క్రియేట్ చేశారు. చార్జ్షీట్లో సెక్షన్ను 304/ఏగా పేర్కొన్నారు. తమకు అనుకూలంగా ఉన్నవారిని పంచులుగా,సాక్షులుగా పెట్టి కేసు నడిపించారు. ఈలోగా అధికార పార్టీకి వ్యతిరేకంగా ధర్నా చేశారని కొందరు రైతులను సదరు ఎస్ఐ ఆంజనేయులు 4రోజులు పీఎస్లో ఉంచి, థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఉన్నతాధికారులు విచారణ జరిపి 2019 లో సస్పెండ్ చేశారు. తాజాగా అమరచింత పీఎస్కుబదిలీచేసి పోస్టింగ్ఇచ్చారు. నెల క్రితం మృతుడి కుటుంబీకులకు రూ.20లక్షల ఇన్సూరెన్స్ డబ్బు రావడంతో గ్రామానికి చెందిన కొందరు ఆర్టీఐ కింద కూపీలాగారు. ఎఫ్ఐఆర్, ఇన్సూరెన్స్ కాపీలు సంపాదించి ఎస్పీకి ఫిర్యాదు చేశారు. దీంతో ఈ ఘటనపై త్వరలోనే పూర్తి స్థాయి దర్యాప్తుకు ఆదేశించవచ్చని పోలీస్ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

మ‌రిన్ని ఇక్క‌డ క్లిక్ చేయండి