సంక్రాంతికి సగం మందైనా పోలె

సంక్రాంతికి సగం మందైనా పోలె

సొంతూర్లకు వెళ్లడానికి ఇంట్రస్ట్‌‌ చూపని సిటీ జనం

ఏటా 30 లక్షల మందికి పైగా పయనం
ఈ సారి 15 లక్షలు కూడా దాటలె!
కరోనా ఎఫెక్ట్‌ , అరకొర రైళ్లు, ఎక్కువ చార్జీల వల్లే
ఆర్టీసీ కలెక్షన్ కూడా పెరగలె

హైదరాబాద్‌‌, వెలుగు: ఈసారి సంక్రాంతికి సొంతూర్లకు వెళ్లడానికి జనం పెద్దగా ఇంట్రస్ట్‌‌ చూపలేదు. ఏటా వెళ్లే జనంలో సగం మంది కూడా పట్నం దాటలేదు. కరోనా సెకండ్‌‌ వేవ్‌‌ భయం, అరకొర రైళ్లు, ప్రైవేట్‌‌బస్సుల్లో విపరీతమైన చార్జీలతో ఎక్కువ మంది ప్రయాణం వద్దనుకున్నారు. సొంతూర్లకు వెళ్లిన సగం మందిలో ఎక్కువగా సొంత వెహికల్స్‌‌కే ప్రాధాన్యమిచ్చారు. ఆర్టీసీకి కూడా ఈసారి అనుకున్నంత కలెక్షన్‌‌ రాలేదు. స్పెషల్‌‌ బస్సులేసినా ఆక్యుపెన్సీ పెరగలేదు.

సిటీలో రోజూలాగే ట్రాఫిక్‌‌

సంక్రాంతి వచ్చిందంటే హైదరాబాద్‌‌ సిటీ దాదాపు ఖాళీ అయిపోయేది. రోడ్లన్నీ ఖాళీగా కనబడేవి. పండుగకు వారం ముందు నుంచే బస్సులు, రైళ్లు కిటకిటలాడేవి. కానీ ఈసారి సీన్‌‌ రివర్సయింది. సగం మంది కూడా పండుగకు పోలేదు. ఏటా 30 లక్షల మందికిపైగా సొంతూర్లకు పోతే ఈసారి ఇప్పటివరకు 15 లక్షల మంది కూడా పోలేదని అధికారులు అంచనా వేస్తున్నారు. సిటీలో రోజూలాగే ట్రాఫిక్‌‌ ఉందని, జనం సందడి కనిపిస్తోందని చెబుతున్నారు.

కరోనా ఎఫెక్ట్‌‌తో..

కరోనా వచ్చాక దాదాపు అన్ని పండుగలు అంతంతే జరుపుకున్నారు. ఈమధ్య వైరస్‌‌ ప్రభావం కాస్త తగ్గినట్లు కనిపించినా మళ్లీ సెకండ్‌‌ వేవ్‌‌, బ్రిటన్‌‌ స్ట్రెయిన్‌‌ వార్తలు జనంలో ఆందోళన పెంచాయి. పైగా కరోనా తర్వాత రైళ్లు బందయ్యాయి. ప్రస్తుతం అరకొరగా స్పెషల్‌‌ ట్రైన్స్‌‌ నడుపుతున్నారు. ప్రైవేట్‌‌ ట్రావెల్స్‌‌లోనైతే ట్రైన్‌‌ చార్జీలకు ఐదారు రెట్లు ఎక్కువ వసూలు చేస్తున్నారు. కరోనా ప్రభావం, రైళ్లు అరకొరగా ఉండటం, ప్రైవేటు చార్జీలు భరించలేనంతగా ఉండటంతో ఊర్లకు పోయి పండుగ చేసుకునే బదులు ఇక్కడే ఉండి జరుపుకోవడం బెటరని చాలా మంది ఇక్కడే ఉండిపోయారు.

బస్సులున్నా జనం లేరు

కరోనా వల్ల ఆర్టీసీకి రూ. 2 వేల కోట్ల దాకా నష్టం వాటిల్లింది. ఇప్పుడిప్పుడే సంస్థ గాడిన పడుతోంది. సంక్రాంతితో ఆదాయం సమకూర్చుకోవచ్చని సంస్థ అధికారులు భావించారు. కానీ అనుకున్న స్థాయిలో ప్రయాణికులు రాలేదు. సంక్రాంతికి 4,981 స్పెషల్‌‌ బస్సులు నడుపుతామని అధికారులు ప్రకటించి ఏర్పాట్లు చేశారు. కానీ రెండు వేల బస్సులు కూడా నడపలేదు. ప్రయాణికుల్లేక బస్టాండ్లు బోసిపోయాయి. వెయిటింగ్‌‌ లిస్టు, అడ్వాన్స్‌‌ ఊసే లేదు. గత రెండు, మూడు రోజులుగా ఆక్యుపెన్సీ రేషియో 60 శాతం నుంచి 63 శాతం వరకే ఉంది. కలెక్షన్‌‌ కూడా పండుగకు ముందు సాధారణ రోజుల్లో రోజుకు రూ. 11.5 కోట్లు రాగా ఈ పండుగ టైమ్‌‌లోనూ రూ. 11 కోట్ల వరకే ఆదాయం వచ్చింది.

సొంత వాహనాల్లోనే ప్రయాణం

పండుగకు చాలా వరకు సొంత వెహికల్స్‌‌లోనే ఊర్లకు వెళ్లారు. నేషనల్‌‌ హైవేల్లో కార్ల రద్దీ పెరిగింది. టోల్‌‌ గేట్ల వద్ద ఫాస్టాగ్‌‌ స్కానర్లు మొరాయిస్తుండటం, పెద్ద మొత్తంలో వెహికల్స్‌‌ రావడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్‌‌ జామై బండ్లు నిలిచిపోయాయి.

ఇవీ చదవండి..

జేఈఈ స్టూడెంట్ల కోసం అమెజాన్ అకాడమీ

పతంగులు ఎందుకు ఎగరేస్తరో తెలుసా?

జాక్‌మా కంపెనీలను జాతీయం చేసే యోచనలో చైనా

సంక్రాంతి వేడుకంతా రైతుదే