పత్తి, వరి పంటలకు ఎకరానికి  రూ.45 వేల రుణం

పత్తి, వరి పంటలకు ఎకరానికి  రూ.45 వేల రుణం

హైదరాబాద్‌‌, వెలుగు : రాష్ట్రంలో పండించే 123 రకాల పంటలకు 2023–24 ఆర్థిక సంవత్సరంలో పంట రుణాలు ఎంతెంత ఇవ్వాలనేది తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్‌‌ బ్యాంక్‌‌ (టెస్కాబ్‌‌) ఖరారు చేసింది.  వచ్చే వ్యవసాయ సీజన్‌‌ నుంచి ఈమేరకు రుణ పరిమితిని అమలు చేయనున్నారు. పంట సాగు ఖర్చు, ఉత్పాదకత, నీటి వసతి ఆధారంగా రుణ పరిమితిని నిర్ధారిస్తారు. స్కేల్‌‌ ఆఫ్‌‌ ఫైనాన్స్‌‌ రిపోర్ట్‌‌ను  రాష్ట్రస్థాయి బ్యాంకర్ల సమితి (ఎస్‌‌ఎల్‌‌బీసీ)కి టెస్కాబ్​ పంపింది. ఈ నివేదిక ప్రకారం రాష్ట్రంలో ప్రధానంగా సాగయ్యే వరి, పత్తి, మొక్కజొన్న, సోయాబీన్, మిర్చి పంటలకు రుణ పరిమితి పెరిగింది. హార్టికల్చర్‌‌ క్రాప్స్‌‌కు కూడా లోన్ లిమిట్స్​పెరిగాయి. 

టమాట సాగుకు రూ.55వేలు  

పత్తి, వరి పంటలకు ఎకరానికి రూ.45వేలు చొప్పున రుణపరిమితిని టెస్కాబ్​ ఖరారు చేసింది. ఇరిగేషన్‌‌ ప్రాజెక్టులు ఉన్న ప్రాంతాల్లో వరికి గతేడాది రూ. 40 వేల వరకు క్రాప్​లోన్స్​ ఇవ్వగా.. వచ్చే సీజన్‌‌ నుంచి రూ. 42 వేల నుంచి రూ. 45 వేల దాకా ఇవ్వనున్నారు. లాస్ట్‌‌ ఇయర్‌‌ కంటే వరికి ఎకరానికి రూ. 6 వేలు దాకా లోన్​ లిమిట్​ను పెంచారు. శ్రీ పద్ధతిలో సాగు చేసే వరికి లోన్​ లిమిట్ ను ఎకరాకు రూ.36వేల నుంచి రూ.38వేలకు పెంచారు. వరి సీడ్‌‌ సాగు చేసే రైతులకు ఎకరానికి రూ.5 వేలు అదనంగా పెంచారు. 2022–23లో ఇది రూ.45 వేలుండగా, ఇప్పుడు రూ. 50 వేలుగా ఖరారు చేశారు.  నీటివసతి ఉన్న ప్రాంతాల్లో  టమాట సాగుకు రూ.50వేల నుంచి 55వేలు,  నీటి వసతి లేని ఏరియాల్లో సాగుకు రూ.37వేల నుంచి రూ.40వేలు లోన్స్​ ఇవ్వనున్నారు. మల్చింగ్​ పద్ధతిలో టమాటా సాగుకు ఎకరాకు రూ.65వేల నుంచి రూ.70వేల దాకా లోన్స్​ ఇవ్వనున్నారు. పత్తికి గతేడాది  రుణ పరిమితి రూ. 40 వేలలోపే ఉండగా, ఈసారి దాన్ని రూ. 45 వేల వరకు పెంచారు. పత్తి విత్తనాన్ని(కాటన్‌‌ సీడ్‌‌) సాగు చేసే రైతులకు కూడా రుణపరిమితిని పెంచారు.  ఇది గతంలో రూ. 1.10 లక్షల నుంచి రూ.1.40 లక్షల వరకు ఉండగా, ఇప్పుడు రూ. 1.30 లక్షల నుంచి రూ. లక్షన్నరకు ఖరారు చేశారు. ఆయిల్‌‌పామ్‌‌ సాగుకు ఇచ్చే లోన్​ లిమిట్ ను గతేడాది స్థాయిలోనే (ఎకరాకు రూ. 40 వేల నుంచి రూ. 42 వేలు) ఖరారు చేసింది.  మిర్చి పంట రుణ పరిమితిని రూ.75వేల నుంచి  రూ.80వేలకు పెంచింది.  వాటర్‌‌ సోర్స్‌‌ ఉన్న ప్రాంతాల్లో మక్కకు రుణపరిమితిని  రూ. 30వేల- నుంచి 34 వేలు చేయగా..నీటి వసతి లేని ప్రాంతాల్లో రూ. 26వేల నుంచి రూ.-28 వేలు చేశారు. 

జీవాల పెంపకానికి కూడా...

పంటలతో పాటు జీవాల పెంపకానికి కూడా స్కేల్‌‌ ఆఫ్‌‌ ఫైనాన్స్‌‌ను టెస్కాబ్‌‌ ఖరారు చేసింది. దీనిలో  భాగంగానే గొర్రెల పెంపకానికి రూ. 23 వేలు, మేకల పెంపకానికి రూ. 25 వేలు ఖరారు చేసింది. పందుల పెంపకానికి కూడా భారీగా లోన్స్​ను ఖరారు చేసింది. పందుల పెంపకానికి గతంలో రూ. 43 వేలుగా నిర్ణయించగా, ఈసారి ఏకంగా రూ. 57 వేల నుంచి రూ. 58 వేలు చేశారు. ఇక డైయిరీ నిర్వహణ కోసం ఒక్కో బర్రెకు రూ. 25 వేల నుంచి రూ. 27 వేలు ఖరారు చేసింది. చేపల పెంపకానికి హెక్టారుకు రూ. 4 లక్షల లోన్‌‌ ఇవ్వాలని టెస్కాబ్​ డిసైడ్ చేసింది.

సీడ్‌‌ లెస్‌‌  ద్రాక్షకు ఎకరాకు రూ. 1.30 లక్షలు

సోయాబీన్‌‌కు ఇచ్చే రుణ పరిమితిని ఎకరాకు రూ. 26 వేల నుంచి రూ. 28 వేల దాకా పెంచారు. సోయా విత్తనోత్పత్తి రైతులకు ఎకరాకు రూ. 34 వేల నుంచి రూ. 36 వేల దాకా లోన్స్​ ఇవ్వనున్నారు. మెడికల్, ఎరోమాటిక్‌‌ ప్లాంట్స్‌‌కు రూ. 42 వేల నుంచి రూ. 45 వరకు లోన్స్​ఇస్తారు. రూఫ్‌‌ గార్డెన్‌‌కు దశల వారీగా మొదటిసారి రూ. 28,500 నుంచి రూ. 31,500 వరకు ఇస్తారు. రెండో దశలో రూ. 19 వేల నుంచి రూ. 21 వేలు, మూడో దశలో రూ. 9,500 నుంచి రూ. 10,500 వరకు లోన్స్​ ఇవ్వాలని నిర్ణయించారు. ఈసారి  డ్రాగన్‌‌ ఫ్రూట్‌‌ సాగుకు ఎకరాకు రూ. 65 వేల నుంచి రూ. 75 వేల వరకు  రుణాలు ఇస్తారు. సీడ్‌‌ లెస్‌‌  ద్రాక్షకు రూ.1.25 లక్షల నుంచి రూ. 1.30 లక్షల వరకు లోన్​ ఇస్తారు. సాధారణ ద్రాక్షకు రూ. 95 వేల నుంచి రూ. లక్ష వరకు ఇస్తారు.