బోట్లు​ నడవట్లే.. లైట్లు​ వెలగట్లే

బోట్లు​ నడవట్లే.. లైట్లు​ వెలగట్లే
  • కరీంనగర్​ ఎల్​ఎండీ వద్ద కళతప్పిన టూరిజమ్
  •  1.5 కోట్లు పెట్టి తెచ్చిన  క్రూయిజ్​ను ఉత్తగనే పెట్టిన్రు
  •  ఎలగందులకు కేంద్రం ఇచ్చిన లైటింగ్​ సిస్టమ్​ మూలకు

కరీంనగర్, వెలుగు: కరీంనగర్​సమీపంలోని లోయర్​మానేరు డ్యామ్​లో విహారానికి కోట్లాది రూపాయలు ఖర్చు చేసి తెప్పించిన  క్రూయిజ్​, స్పీడ్ బోట్స్, జెట్ స్కీ లు పక్కనపడేశారు. ఎలగందుల ఖిల్లా లో ఏర్పాటు చేసిన సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం నిర్వహణ లేక మూలకుపెట్టారు. నార్త్​తెలంగాణ టూరిజానికి వన్నె తెస్తుందనుకున్న ఈ రెండు ప్రాజెక్టులు, టూరిజం కార్పొరేషన్​ నిర్లక్ష్యంతో మూణ్నాళ్ల ముచ్చటగా మిగిలాయి. దీంతో స్మార్ట్​సిటీ కరీంనగర్​వాసులతో పాటు ప్రాజెక్టు, ఖిల్లా సందర్శనకు వచ్చే పర్యాటకులు తీవ్ర నిరాశకు లోనవుతున్నారు. 
 

క్రూయిజ్​ను తిప్పేది ఎప్పుడో..?

ఎల్​ఎండీ ని పర్యాటకంగా డెవలప్​చేసేందుకు లేక్‌‌‌‌ పోలీస్‌‌‌‌ స్టేషన్‌‌‌‌ సమీపంలో బోటింగ్‌‌‌‌ కోసం గతేడాది జెట్టి పాయింట్ ఏర్పాటుచేశారు. దీన్ని డెవలప్ చేయడానికి రూ. 2 కోట్ల ఫండ్స్​ ఇచ్చారు.  ఇక్కడ క్రూయిజ్ , ఇతర బోట్లు నిలపడానికి (బోట్ పాయింట్), ఎప్పటికి నిలకడగా నీళ్లు ఉండేలా కాలువ నిర్మాణం చేపట్టారు.  ఏరియా మొత్తం చదును చేశారు. ఇంకా ఇక్కడ గ్రీనరీ.. గదుల నిర్మాణాలు చేపట్టాల్సి ఉంది. పర్యాటకంగా డెవలప్ చేయడానికి రెండు జెట్ స్కీలు, ఒక డీలక్స్ బోట్ (20 సీట్లది), ఒక స్పీడ్ బోట్   తెచ్చారు. దీంతో పాటు రూ. 1.5 కోట్లతో క్రూయిజ్ ను తెప్పించారు. ఇందులో స్పీడ్ బోట్, డీలక్స్ బోట్ అప్పుడపుడు నడుస్తున్నా.. జపాన్ నుంచి  తెచ్చిన జెట్ స్కీలు మాత్రం తిప్పడం  లేదు. ఎంతో ఆశగా చూసిన కరీంనగర్ యువతకు ఇవి నిరాశే మిగిల్చాయి. ఇక సుమారు కోటిన్నర తో  తెచ్చిన  క్రూయిజ్  ఇప్పటికే అందుబాటులోకి రావాల్సి ఉన్నా ఆ దిశగా చర్యలు తీసుకోవడం లేదు. క్రూయిజ్​ అందుబాటులోకి వస్తే ఒకే సారి 100 మందితో కలిసి ప్రయాణం చేయవచ్చు. చిన్న చిన్న పార్టీలు కూడా చేసుకోవచ్చు. కానీ సుమారు 20 నెలలు కావస్తున్నా దీన్ని పట్టించుకున్నవాళ్లు లేరు. క్రూయిజ్ ను నీటిలోకి పంపించేలా, టూరిస్టులు బోటులోకి ఎక్కడానికి వీలుగా జెట్టీ పాయింట్ నిర్మాణ పనులు కూడా నేటికీ పూర్తికాలేదు.
 

ఖిల్లాను పట్టించుకుంటలేరు.. 

కరీంనగర్ జిల్లాలోని మరో టూరింగ్​స్పాట్​ఎలగందుల ఖిల్లాను అప్పటి కేంద్ర ప్రభుత్వం రూ.10 కోట్లతో డెవలప్​చేసింది. యూపీఏ హయాంలో కరీంనగర్​ ఎంపీగా పొన్నం ప్రభాకర్​ ఉన్న టైంలో రిలీజైన ఈ ఫండ్స్​తో కోటకు రిపేర్లు చేశారు. డంగు సున్నంతో అచ్చు ఎన్కటిలాగే తీర్చిదిద్దారు. టూరిస్టులను ఆకర్షించేందుకు సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం ఏర్పాటు చేశారు. ఓసారి పిడుగుపాటుకు సౌండ్ అండ్ లైటింగ్ సిస్టం దెబ్బతినడంతో మూలనపడేశారు.  కోట్లాది  రూపాయల విలువైన పరికరాలు తుప్పు పట్టి పోతున్నా పట్టించుకోవడం లేదు. మరోవైపు మెయింటనెన్స్​ లేక కోట బురుజులకు పగుళ్లొస్తున్నాయి. నిర్వహణ బాధ్యతలు చూడాల్సిన టూరిజం కార్పొరేషన్​ పత్తా లేకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు కోటలో లైటింగ్ ను పునరుద్ధరించి.. పూర్వ వైభవం తీసుకొచ్చి.. జిల్లాకు పర్యాటక కళ తీసుకురావాలని ప్రజలు కోరుతున్నారు.