ఎస్సారెస్పీ గేట్లు పనితనంపై అనుమానాలు

ఎస్సారెస్పీ గేట్లు పనితనంపై అనుమానాలు

నిజామాబాద్, వెలుగు: తెలంగాణ రాష్ట్రంలో అతి పెద్ద ప్రాజెక్టు అయిన ఎస్సారెస్పీకి ఈసారి కూడా భారీగా జలాలు వచ్చే అవకాశం ఉంది. అయితే ప్రాజెక్టు గేట్లు గతేడాది మొరాయించి నీరు వృథా పోయింది. మరి ఈసారైనా గేట్లు సరిగా పనిచేస్తాయా అనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి.  

మూడేళ్లుగా మస్తు నీళ్లు

2015లో మాత్రమే ప్రాజెక్ట్‌‌‌‌లో నీటి మట్టం డెడ్ స్టోరేజ్‌‌‌‌‌‌‌‌కి చేరింది. తర్వాత మళ్లీ ఆ పరిస్థితి రాలేదు. మూడేళ్లుగా ఎస్సారెస్పీ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో భారీగా వరదనీరు చేరడంతో ఆయకట్టుకు సాగునీటి కొరత ఏర్పడలేదు. 2020 జూన్ 30 వరకు ఎస్సారెస్పీలో‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌30 టీఎంసీల నీరు ఉండగా.. గతేడాది 2021లో జూన్ 14 నాటికి 26.94 టీఎంసీల నీరు ఉంది. ఈ సారి కూడా సరైన సమయానికి నైరుతి రుతు పవనాలు రాష్ట్రంలో ప్రవేశించాయి. దీంతో వర్షాలు కురిసే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఈ సీజన్‌‌‌‌‌‌‌‌లో 6.70 లక్షల ఎకరాలకు సాగు నీరందించేందుకు ఆఫీసర్లు ప్రణాళికలు రెడీ చేశారు.  

గత ఏడాది గేట్ల కు సాంకేతిక కష్టాలు  

ఎస్సారెస్సీలో మొత్తం 42 వరద గేట్లు ఉన్నాయి. 90 టీఎంసీల నీటి సామర్థ్యానికి చేరగానే గేట్లు ఎత్తి నీటిని కిందకు వదులుతారు. గతేడాది 610 టీఎంసీల ఇన్ ఫ్లో వచ్చింది. ఆఫీసర్ల సమన్వయ లోపం వల్ల నీటి విడుదలలో ఇబ్బందులు తలెత్తాయి. 42 గేట్లలో 11 గేట్లు మొరాయించడంతో నీటి విడుదలలో జాప్యం ఏర్పడింది. ఈ క్రమంలో ఎక్కువగా నీరు విడుదల చేయడంతో పెద్ద ఎత్తున నీరు వృథా అయింది. దీంతో రెగ్యులర్ రిపేర్స్‌‌‌‌‌‌‌‌లో వరద గేట్లకు సాంకేతిక లోపాలు తలెత్తకుండా చర్యలు చేపట్టారు.  ఇప్పటి వరకు 37 గేట్లు పనిచేసేలా రిపేర్లు పూర్తి చేశారు. మరో 5 గేట్ల రిపేర్లకు ఆఫీసర్లు టెండర్లు పూర్తి చేశారు. కానీ పనులు మొదలు కాలేదు. ప్రస్తుతం వర్షాలు షురూ కావడంతో వాటి రిపేర్లు కష్ట సాధ్యమే అని తెలుస్తోంది.  

మహారాష్ట్ర ప్రాజెక్టుల్లో పుష్కలంగా వరద నీరు 

గతేడాది ఎస్సారెస్పీ ఎగువన మహారాష్ట్రలో వర్షాలు విస్తృతంగా కురవడంతో ప్రధాన జైక్వాడ్ విష్ణుపురి, మజల్గావ్ ప్రాజెక్టుల్లో నీరు సమృద్ధిగా ఉంది. తాజాగా నిన్నటి నుంచి మహారాష్ట్రలో వర్షాలు కురుస్తున్నాయి. నాందేడ్‌‌‌‌‌‌‌‌లోని విష్ణుపురి ప్రాజెక్ట్ పూర్తి నీటి మట్టం 2.9 టీఎంసీలు కాగా ప్రస్తుతం 2.7 టీఎంసీల నీరు ఉంది. జైక్వాడ్ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌లో ప్రస్తుతం 52.26 టీఎంసీల నీరు ఉంది. మహారాష్ట్రలో వర్షాలు కురిస్తే త్వరగా ఆ ప్రాజెక్టులు నిండే అవకాశాలు ఉన్నాయి. ఈ ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి సామర్థ్యం చేరితే గోదావరి నదిలోకి వరద జలాలను విడుదల చేస్తారు.