ట్యాక్సీ సేవల్లోకి ఇ-యానా వాహనాలు

 ట్యాక్సీ సేవల్లోకి ఇ-యానా వాహనాలు

ప్రజల సౌకర్యం కోసం మరిన్ని రవాణ సేవలను కల్పించేందుకు చర్యలు చేపట్టింది రాష్ట్ర ప్రభుత్వం. ఇందులో భాగంగా విద్యుత్‌ ఆటోలు, ద్విచక్ర వాహనాలతో ట్యాక్సీ సేవలను అందుబాటులోకి తెచ్చింది. హైదరాబాద్‌ అంకురం ఈ-యానా వరంగల్‌, కరీంనగర్‌లలో ఈ ట్యాక్సీలను  ప్రారంభించింది. హైదరాబాద్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖ ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ యాప్‌ను ఆవిష్కరించి, సేవలను ప్రారంభించారు. కాలుష్య నివారణతోపాటు, స్థానిక యువతకు ఉపాధి కల్పించే లక్ష్యంతో తమ సంస్థ పనిచేస్తుందన్నారు. ప్రస్తుతం రెండు నగరాలకు కలిపి 50 ఆటోలు, 50 స్కూటర్లను కొనుగోలు చేశామని కంపెనీ డైరెక్టర్‌ సందీప్‌ వంగపల్లి తెలిపారు. ‘2020 మార్చినాటికి మరో 200 స్కూటర్లు, 200 ఆటోలు కొనుగోలు చేయనున్నట్లు తెలిపారు డైరెక్టర్లు విజయ్‌ కుమార్, నవనీత్‌ రావు, శశికాంత్‌ రెడ్డి. ఆరు నెలల్లో రూ.50 కోట్ల నిధులు సమకూర్చుకుంటామన్నారు. ఇప్పటికే రూ.4.5 కోట్లు ఖర్చు చేశామని తెలిపారు. దశలవారీగా ఖమ్మం, నిజామాబాద్, చెన్నై, భువనేశ్వర్‌లో ఈ ట్యాక్సీలను ప్రారంభించనున్నట్లు తెలిపారు.