ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.. 61% పోలింగ్

ప్రశాంతంగా ముగిసిన ఎన్నికలు.. 61% పోలింగ్

రాష్ట్రంలోని 17 లోక్ సభ నియోజకవర్గాల్లో పోలింగ్ ప్రశాంతంగా ముగిసింది. నక్సల్స్ ప్రభావిత ప్రాంతాల్లో 4 గంటలవరకు, రాష్ట్రవ్యాప్తంగా 5 గంటల వరకు పోలింగ్ జరగగా.. నిజామాబాద్ నియోజకవర్గంలో 6 గంటల వరకు ఓట్లేసే అవకాశం కల్పించారు ఎన్నికల అధికారులు. రాష్ట్ర వ్యాప్తంగా 61 శాతం పోలింగ్ జరిగినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రజత్ కుమార్ తెలిపారు.

నియోజకవర్గాల వారీగా చూస్తే.. ఆదిలాబాద్ లో 66.67 శాతం పోలింగ్ నమోదైందని చెప్పారు సీఈఓ రజత్ కుమార్. పెద్దపల్లిలో 59.24 శాతం, కరీంనగర్ 68, నిజామాబాద్ 54.2, జహీరాబాద్ 67.8, మెదక్ 68.6, మల్కాజ్ గిరి 42.75, సికింద్రాబాద్ 39.2, హైదరాబాద్ 39.49, చేవెళ్ల 53.8 శాతం పోలింగ్ నమోదైంది. ఇక మహబైబ్ నగర్ లో 64.99, నాగర్ కర్నూల్లో 57.12, నల్లగొండ 66.11, భువనగిరి 68.25, వరంగల్ 60, మహబూబాబాద్ 59.99, ఖమ్మంలో 67.96 శాతం పోలింగ్ నమోదైనట్లు తెలిపారు రజత్ కుమార్.

రాష్ట్రంలో 17 లోక్ సభ నియోజకవర్గాలకు 443 మంది అభ్యర్థులు పోటీ చేశారు. నిజామాబాద్ లోక్ సభ సెగ్మెంట్లో 185 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. మెదక్ లోక్ సభకు అత్యల్పంగా 10 మంది పోటీలో ఉన్నారు. టీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ నుంచి 17 మంది చొప్పున పోటీ చేయగా.. బీఎస్పీ 5, సీపీఐ2, సీపీఎం 2 స్థానాల్లో అభ్యర్థులను నిలిపింది. ఎంఐఎం ఒక్క హైదరాబాద్ లోనే పోటీ చేసింది. రికార్డుస్థాయిలో ఈసారి 299 మంది ఇండిపెండెంట్లు బరిలో నిలిచారు. 17 నియోజకవర్గాల్లో 25 మంది మహిళలు లోక్ సభకు పోటీ చేశారు.

ఉదయం అన్ని పోలింగ్ సెంటర్ల లలో మాక్ పోలింగ్ తర్వాత పోలింగ్ ప్రారంభించారు అధికారులు. ఉదయం నుంచే పోలింగ్ చాలా కూల్ గా సాగింది. ప్రారంభంలో కొన్నిచోట్ల ఈవీఎంలు మొరాయించాయి. ఎండాకాలం కావటంతో ఉదయం సమయంలో భారీగా పోలింగ్ జరుగుతుందని ఆశించినా.. అలా జరగలేదు. ఇంతకుముందులా పోలింగ్ సెంటర్ల దగ్గర భారీ క్యూలైన్లు కనిపించలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఓటింగ్ శాతం ఎక్కువగా నమోదు కాగా.. పట్టణ ప్రజలు మాత్రం ఓటేసేందుకు పెద్దగా ఆసక్తి చూపలేదు. దీంతో పట్టణ ప్రాంతాల్లో ఈసారి ఓటింగ్ శాతం తక్కువగా నమోదైంది.

పోలింగ్ ముగియటంతో అన్ని ఈవీఎంలను పటిష్ట భద్రత నడుమ రిసెప్షన్ సెంటర్లకు తరలించారు అధికారులు. ప్రస్తుత పోలింగ్ వివరాలు ఫైనల్ కాదన్న రజత్ కుమార్.. పోలింగ్ శాతం ఇంకా పెరిగే అవకాశం ఉందన్నారు. అన్ని వివరాలు రేపు చెబుతామన్నారు. చిన్నచిన్న గొడవలు జరిగినా.. ఎక్కడా బూత్ క్యాప్చరింగ్ జరగలేదని.. ఎక్కడా రీపోలింగ్ అవసరం లేదన్నారు సీఈఓ.

నిజామాబాద్ లోనూ ఎన్నికలు ప్రశాంతంగా ముగియటంపై ఆనందం వ్యక్తం చేశారు సీఈఓ. నిజామాబాద్ లో 27వేలకు పైగా బ్యాలెట్లు వాడామని చెప్పారు. అధికారులు ఛాలెంజ్ గా తీసుకొని పని చేశారన్నారు.