ఊ..అంటే రైళ్ల రద్దు!.. ఇబ్బందులు పడ్తున్న ప్రయాణికులు

ఊ..అంటే రైళ్ల రద్దు!.. ఇబ్బందులు పడ్తున్న ప్రయాణికులు
  • 2 నెలలుగా కాజీపేట-బల్లార్షా మధ్య ఆటంకాలు
  • ట్రాక్​ రిపేర్లు, టెక్నికల్ ఇష్యూలతో తరచూ క్యాన్సిల్​
  • కొత్తగూడెం  వెళ్లేందుకు సింగరేణి కార్మికులకు కష్టాలు
  • ఎక్కువ హాల్టింగ్​లు ఉన్న ప్యాసింజర్​, పుష్​ఫుల్​ రైళ్ల నిలిపివేత

కోల్​బెల్ట్, వెలుగు:  సికింద్రాబాద్ డివిజన్​ పరిధిలోని కాజీపేట–-బల్లార్షా, విజయవాడ– సికింద్రాబాద్​మార్గంలో మూడో రైల్వే లైన్​ట్రాక్​రిపేర్లతో తరచూ రైళ్లను రద్దు చేయడంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్తున్నారు. ఇటీవల రైల్వే శాఖ ట్రాక్​ పునరుద్ధరణ, టెక్నికల్​ఇష్యూలతో కాజీపేట–-బల్లార్షా సెక్షన్ల మధ్య నడిచే  పలు ప్యాసింజర్​రైళ్లను ఈనెల 20వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది.  రెండు నెలలుగా తరచూ రైళ్ల రద్దుతో మంచిర్యాల,  ఆసిఫాబాద్, పెద్దపల్లి, కరీంనగర్​జిల్లాల పరిధిలో రైల్వే స్టేషన్ల మీదుగా రాకపోకలు సాగించే ప్రయాణికులు అవస్థలు పడ్తున్నారు.

అసలే తక్కువ.. అపై రద్దు

వ్యాపార, ఉద్యోగం, చదువుల కోసం  సింగరేణి ఏరియా,  మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లా కేంద్రాలు, చుట్టు పక్కల ప్రాంతాల నుంచి హైదరాబాద్, వరంగల్​, కొత్తగూడెం తదితర ప్రాంతాలకు  డెయిలీ దాదాపు 12వేల మంది రైళ్ల ద్వారా రాకపోకలు సాగిస్తుంటారు.  ఇందులో అత్యధికులు సింగరేణి కార్మికులు, వ్యాపారులు, విద్యార్థులు, రైతులు, పాలవ్యాపారులు. వీరికి కాజీపేట, భద్రాచలం రోడ్​, కాగజ్​నగర్​, బల్లార్షా, కరీంనగర్​ మధ్య  నడిచే  సింగరేణి, రామగిరి,  పుష్​ఫుల్​మెమూ రైళ్లు మాత్రమే అందుబాటులో ఉంటున్నాయి.  ఇందులో చార్జీలు కూడా తక్కువ కావడం,  ఎక్కువ స్టేషన్లలో స్టాపింగ్ ​కల్పించడంతో ఈ మూడు  రైళ్లు ప్రయాణికులతో కిటకిటలాడుతుంటాయి.  ఏండ్లుగా ఈ మార్గంలో మరికొన్ని కొత్త రైళ్లను నడపాలని డిమాండ్​ చేస్తున్నప్పటికీ  రైల్వే శాఖ పట్టించుకోవడం లేదు.  హైదరాబాద్–​ -బల్లార్షా మధ్య భాగ్యనగర్, ఇంటర్​సిటీ, కాగజ్​నగర్​ సూపర్​ఫాస్ట్​​ ట్రైన్లు నడుస్తున్నాయి. ఇవి కొన్ని స్టేషన్లలో ఆగడం, చార్జీలు ఎక్కువగా ఉండడంతో కొందరికే  అనుకూలంగా ఉన్నాయి.  

జంక్షన్లతో సంబంధం లేకున్నా ..

కాజీపేట–-బల్లర్షా  మూడో  రైల్వేలైన్​ దాదాపు పూర్తికాగా.. ఆర్వోబీ, కొన్ని చోట్ల కల్వర్టులు, రిపేర్ల పేరుతో అడపాదడపా రైళ్లు నిలిపివేస్తున్నారు. మరోవైపు ఈ సెక్షన్​ మధ్య సంబంధం లేని చోట జరిగే  రిపేర్లను సాకుగా చూపుతూ రైళ్లను రద్దు చేస్తున్నారు.  బల్లార్షా-చంద్రాపూర్​, విజయవాడ, -డోర్నకల్​ జంక్షన మధ్య రిపేర్లు జరిగినా కాజీపేట-–కాగజ్​నగర్​ మధ్య రైళ్లను కూడా నిలిపివేయడంపై  ప్రయాణికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. సిర్పూర్​–-కరీంనగర్​ పుష్​పుల్​ కూడా ఆపుతున్నారు.  రైల్వే లైను రిపేర్ల కారణంగా 19 నుంచి వారం రోజులు పాటు పలు రైళ్లను రద్దు చేశారు.

 సికింద్రాబాద్​డివిజన్​ పరిధిలో ఇన్​ఫ్రాస్ర్టక్చర్​ పునరుద్ధరణ పనుల నేపథ్యంలో జులై 3 నుంచి 9 తేదీ వరకు సిర్పూర్​ టౌన్–​-కరీంనగర్​ ఇరువైపులా, కాజీపేట–-సిర్పూర్​టౌన్, బల్లార్షా–-కాజీపేట, భద్రాచలంరోడ్–​-బల్లార్షా ఇరువైపులా రైళ్లను రద్దు చేశారు.  జులై 17 నుంచి 24 వరకు కాజీపేట–-సిర్పూర్​ కాగజ్​నగర్​, బల్లార్షా-–కాజీపేట(రామగిరి), భద్రాచలంరోడ్​–-బల్లార్షా(సింగరేణి), సిర్పూర్​–-కరీంనగర్​(పుష్​పుల్)​రైళ్లు రద్దు చేశారు.  భారీ వర్షాలతో  కాజీపేట–-బల్లార్షా మధ్య నడిచే ప్యాసింజర్​ రైళ్లను మళ్లీ జులై 31 వరకు రద్దు చేసింది. మళ్లీ 6 తేదీ నుంచి  మూడో రైల్వే ట్రాక్​ పనులు, ఇతరత్రా కారణాలతో సింగరేణి, రామగిరి, కరీంనగర్​ పుష్​పుల్​ రైళ్లను రద్దు చేస్తూ.. పొడిగిస్తూ.. ఈనెల 20 వరకు రద్దు చేస్తున్నట్లు ప్రకటించింది. దీంతో మంచిర్యాల, ఆసిఫాబాద్​ జిల్లాలోని ప్రయాణికులు దూరభారం.. చార్జీలు ఎక్కువైనా బస్సులు, ప్రైవేట్ ​వెహికల్స్​పై రాకపోకలు సాగిస్తున్నారు.

కొత్తగూడెం వెళ్లడం కష్టమవుతోంది

ఉద్యోగరీత్యా కొత్తగూడెంలోని సింగరేణి హెడ్డాఫీస్​కు వివిధ  పనుల కోసం వెళ్తాం.  అక్కడికి వెళ్లడానికి నలభై ఏండ్లుగా   సింగరేణి రైలుపై ఆధారపడ్తున్నం. ట్రాక్​ రిపేర్ల పేరుతో నెలలో పదిహేను రోజులు రైలును రద్దు చేస్తున్నరు. వందల కి.మీ దూరం బస్సులో వెళ్లడం ఇబ్బందికరంగా మారింది.

అల్లి రాజేందర్, సింగరేణి ఉద్యోగి 

అధిక చార్జీలతో భారం

కాజీపేట–-బల్లార్షా మధ్య  అన్ని స్టేషన్లలో స్టాఫ్​ ఉండే సింగరేణి, రామగిరి రైళ్ల రద్దుతో  ఎక్కువ చార్జీలు పెట్టుకొని ఎక్స్​ప్రెస్, సూపర్​ ఫాస్ట్​ రైళ్లలో వెళ్లాల్సి వస్తోంది. పేద, మిడిల్​క్లాస్​ ప్రయాణికులకు చార్జీలు భారమవుతున్నాయి. అలాగే భాగ్యనగర్​ ఎక్స్​ప్రెస్​ రెండు మూడు గంటల ఆలస్యంగా నడుస్తున్నది. దీంతో ప్రయాణికులు ఇబ్బందులు పడ్తున్నారు. 

ఎండి.పాషా, రామకృష్ణాపూర్