మందు గోలీలపై నజర్‌‌ ఏది?ఆగని జ్వరం, దగ్గు, గొంతునొప్పి ట్యాబ్లెట్ల సేల్స్

మందు గోలీలపై నజర్‌‌ ఏది?ఆగని జ్వరం, దగ్గు, గొంతునొప్పి ట్యాబ్లెట్ల సేల్స్
  •     అమ్మకాలపై ఆంక్షలతో
  •     మార్గదర్శకాలు జారీ చేసిన ప్రభుత్వం
  •     ఇంకా కాపీలు అందలేదంటున్న మెడికల్‌‌ షాపుల నిర్వాహకులు
  •     ప్రిస్క్రిప్షన్‌‌ లేకుండా కొనుగోలు
  •     చేసే వారి వివరాల సేకరణ తక్కువే

హైదరాబాద్, వెలుగుకరోనా కారణంగా జ్వరం, దగ్గు, జలుబు, గొంతు నొప్పి కి  సంబంధించిన ట్యాబ్లెట్లు అమ్మొద్దని ఆంక్షలు విధిస్తూ ప్రభుత్వం మార్గదర్శకాలను జారీ చేసింది. డాక్టర్ ప్రిస్క్రిప్షన్ లేకుండా ట్యాబ్లెట్లు, సిరప్‌‌లు కొనుగోలు చేసే  వారి వివరాలను మస్ట్​గా నమోదు చేయాలని కూడా ఆదేశించింది. అయినా అమ్మకాలు జరుగుతూనే ఉన్నాయి. కొనుగోలుదారుల వివరాల నమోదు కూడా సరిగా చేయడం లేదు. రాష్ట్రవ్యాప్తంగా రోజురోజుకు పాజిటివ్‌‌ కేసుల సంఖ్య పెరుగుతుండగా,  ప్రభుత్వం ప్రత్యేక మార్గదర్శకాలు ఇచ్చింది. డాక్టర్ల చీటి లేకుండా మెడిసిన్‌‌  కొనుగోలు చేసేవారి పేరు, అడ్రస్, ఫోన్ నెంబర్‌‌ తదితర అంశాలను మెడికల్​ షాపులు సేకరించి సంబంధిత డ్రగ్ కంట్రోల్ విభాగానికి వాట్సాప్ ద్వారా చేరవేయాలని సూచించింది.

నామమాత్రంగానే నమోదు

హైదరాబాద్‌‌లో 4,800 మెడికల్ షాపులు ఉండగా, హాస్పిటళ్లకు అనుబంధంగా మరో 1,200 షాపుల వరకు ఉన్నాయి. జ్వరం, జలుబు, గొంతు సమస్యలకు వెంటనే సాధారణ రోజుల మాదిరిగానే డోలో 650, పారాసిప్, కోల్డ్ యాక్ట్, ఏవిల్ 25, క్లోరోక్వినైన్, గొంతు ఇన్‌‌ఫెక్షన్లకు అంత్రామైసిన్ వంటి ట్యాబ్లెట్లను డాక్టర్ల సూచనలు లేకుండా వాడేవారే ఎక్కువ.  కరోనా ప్రాథమిక లక్షణాలు ఇవే కావడంతో, బయటపడకుండా, ఇంటి వైద్యం పేరిట తాత్కాలిక ఉపశమనం కోసం  ట్యాబ్లెట్లను వాడుతున్నారని  తెలుస్తోంది. లాక్ డౌన్ తొలివారంలో  మెడిసిన అమ్మకాలు జోరుగా సాగాయి. కఠిన ఆంక్షల నేపథ్యంలో గైడ్​లైన్స్​ ఫాలో కాకుండా అమ్మకాలు చేస్తున్నారనే ఆరోపణలున్నాయి. ప్రధానంగా బాలానగర్, కూకట్ పల్లి, ఎస్ఆర్ నగర్, సికింద్రా బాద్ ఏరియాల్లో ఎక్కువగా అమ్మకాలు కొనసాగుతున్నాయి. అయితే కొనుగోలు చేసేవారి వివరాలు మస్ట్​గా తీసుకోవాల్సి ఉండగా, ఒకరిద్దరికి మించి ఉండడం లేదు. మెడికల్ షాపుల నిర్వాహకులు చూసిచూడనట్లుగా వ్యవహరిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.

వాట్సాప్‌‌ గ్రూప్‌‌లు క్రియేట్‌‌ చేసినా..

డ్రగ్ కంట్రోలింగ్ డిపార్ట్‌‌మెంట్‌‌ జారీ చేసిన గైడ్‌‌లైన్స్‌‌ ఆర్డర్స్‌‌ చాలా మెడికల్ షాప్‌‌ల నిర్వాహకులకు చేరలేదు. ఏసీ గార్డెన్, మాసాబ్ ట్యాంక్, మహావీర్ హాస్పిటల్ ఏరియాలోని మెడికల్ షాపుల నిర్వాహకులు తమకు గైడ్‌‌లైన్స్‌‌ అందలేదని చెబుతున్నారు. ఆయా మందులపై ఏమైనా ఆంక్షలు ఉన్నాయా అంటే అలాంటిదేమి లేదని అంటున్నారు. ఒకవేళ అందినా క్రియేట్ చేసిన వాట్సాప్ గ్రూపుల్లో ఒక్కో ఏరియాలో అన్ని మెడికల్ షాపులు లేవని తెలుస్తోంది. ముషీరాబాద్ సెగ్మెంట్‌‌ పరిధిలో దాదాపు 120 మెడికల్ షాపులు ఉండగా, డీసీ, ఏసీ, మెంబర్లుగా ఉండే జీహెచ్ఎంసీ వాట్సాప్ గ్రూపులో 50 షాపులకు మించి లేవు. ఈ ట్యాబ్లెట్లు విక్రయించే నిర్వాహకులపై కూడా ఎలాంటి కఠినమైన చర్యలు లేకపోవడం కూడా అమ్మకాలకు కారణమని స్పష్టమవుతుంది.