కార్మికులే ఊపిరిగా కాకా.

కార్మికులే ఊపిరిగా కాకా.

‘మన జననం అతి సాధారణమైనది కావచ్చు, కానీ మన మరణం ఒక చరిత్ర సృష్టించేదిగా ఉండాలి’ అన్నారు ఒక మహానుభావుడు. కొందరు అతి సామాన్య కుటుంబం నుంచి వస్తారు, కృషితో అందరికన్నా ఉన్నత స్థానం చేరుకుంటారు. ఆ కోవలో వ్యక్తి మాజీ కేంద్ర మంత్రి గడ్డం వెంకటస్వామి. నిత్యం ప్రజల కోసం పనిచేస్తూ ప్రేమగా ‘కాకా’ అని పిలిపించుకున్నారు. గడ్డం వెంకటస్వామి కాస్తా ‘గుడిసెల వెంకటస్వామి’ అయ్యారు. ఆర్యసమాజ్​ ప్రేరణతో, స్వామి రామానంద తీర్థ శిష్యరికంలో గొప్ప నాయకుడిగా ఎదిగారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని అర్థం చేసుకుని ప్రజా జీవితాల్లో వెలుగులు నింపారు. అందుకే ప్రజలు ఏడు సార్లు లోక్​సభకు, రెండుసార్లు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీకి ఎన్నుకున్నారు. కేంద్ర కార్మిక మంత్రిగా, రాష్ట్ర మంత్రిగా, వందకు పైగా కార్మిక సంఘాలకు నాయకుడిగా, రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా, ఏఐసీసీ శాశ్వత ఆహ్వానితుడిగా, ప్రత్యేక తెలంగాణను కాంక్షించిన రాజకీయ కోవిదుడిగా, పేదలకు ఉన్నత విద్య అందించడానికి విద్యా సంస్థలు ఏర్పాటు చేసిన విద్యా దాతగా కాకా అందరికీ గుర్తుండిపోయారు.

కార్మికులకు పెన్షన్ సదుపాయం తెచ్చారు.చిన్ననాటి నుండి కాకా జీవితం వడ్డించిన విస్తరి కాదు. చిన్నతనంలోనే తండ్రి మరణంతో కుటుంబ భారాన్ని మోయడానికి ఆయన భవన నిర్మాణ కార్మికుడిగా పనిచేశారు. కార్మికుల బాధలు కళ్ళారా చూడడంవల్ల తుది శ్వాసవరకు నిత్యం పోరాడేవారు. ఏక కాలంలో దాదాపు వందకు పైగా యూనియన్లకు నాయకత్వం వహించడం మామూలు విషయం కాదు. కార్మిక మంత్రిగా కేంద్రంలోనూ, రాష్ట్రంలోనూ కార్మికుల అభివృద్ధి కోసం అనేక పథకాలు ప్రవేశపెట్టారు.

ఎంప్లాయి ప్రావిడెంట్ ఫండ్ ఏర్పాటుకు అనుమతిచ్చారు.  పీఎస్​యూలు ప్రైవేటుపరమైనా కార్మికులకు ఇబ్బందుల్లేకుండా చర్యలు తీసుకున్నారు.  ప్రైవేట్ రంగ కార్మికులకు పెన్షన్ కల్పించడం ప్రపంచంలోనే ఫస్ట్​ టైమ్​. ఈ ఘనత కాకాకే దక్కుతుంది. వెంకటస్వామి కృషివల్ల ప్రస్తుతం 1000 రూపాయలకు తగ్గకుండా పెన్షన్ అందుతోంది.  సింగరేణి కార్మికుల బాధలు ఆయనకు స్వయంగా తెలుసు. కేంద్ర కార్మిక మంత్రిగా ఉన్నప్పుడు సింగరేణి కార్మికుల కోసం పెన్షన్ పథకం ఏర్పాటు చేశారు. దానిని ఇతర బొగ్గు గనుల్లో పనిచేసే కార్మికులకుకూడా అమలు చేయించారు.

1990ల్లో ఆర్థిక మాంద్యం కారణంగా సింగరేణి సంస్థ నష్టాలతో మూసివేత దిశగా అడుగులు వేసింది.  సింగరేణిని కాపాడడంకోసం రూ.400 కోట్లను రుణంగా ఇప్పించి సంస్థను నిలబెట్టారు. దాదాపు లక్షా 20 వేల మంది కార్మికులు రోడ్డున పడకుండా కాపాడారు. పెద్దపల్లి నియోజకవర్గంలో మూతపడిన రామగుండం ఫెర్టిలైజర్ కార్పొరేషన్ పునరుద్ధరణకు చర్యలు చేపట్టి, ఆ ప్రాంత అభివృద్ధికి కృషి చేశారు.   పేద నిమ్న జాతుల ప్రజలకు విద్యను అందించాలనే దృఢ సంకల్పంతో ‘అంబేద్కర్ ఎడ్యుకేషనల్ సొసైటీ’ ఆరంభించారు. అప్పటి రాష్ట్రపతి వి.వి.గిరి చేతుల మీదుగా మొదలైన ఈ విద్యా సంస్థల సేవలు నేటికీ కొనసాగుతున్నాయి.గడ్డం వెంకట స్వామి బాటలో నడుస్తూ దళిత సమాజం, తెలంగాణ రాష్ట్రం మరింత అభివృద్ధి పథంలో పయనించడమే నిజమైన నివాళి. – అనిల్ మేర్జ.

చేనేత రంగాన్ని ఆదుకోవడంపైనా,  ఖాయిలాపడిన మిల్లులను బతికించడంపైనా దృష్టి పెట్టారు.  తన సమకాలీకులయిన ఆచార్య కొండా లక్ష్మణ్ బాపూజీ , ప్రగడ  కోటయ్య లాంటి చేనేత నాయకులతో పలు చర్చలు జరిపి  చేనేత కార్మికులకు సాయపడేందుకు పలు చర్యలు తీసుకున్నారు.  చేనేతను ఆదుకోవడంతో పాటు,  ఖాయిలా పడి మూతపడే స్థితిలో ఉన్న మిల్లులను బతికించడం ద్వారా కొన్ని లక్షల కుటుంబాలను నిలబెట్టవచ్చన్న విషయం ఆయనకు తెలుసు. చేనేత విషయంలో కాకా చూపించిన దూరదృష్టి ఆ తర్వాత తరం నాయకుల్లో కరువైంది.

భారత దేశం ఆత్మ  ఎక్కడుందో తెలిసిన నేత వెంకటస్వామి. ఆయన  పీవీ నరసింహారావు కేబినెట్‌‌లో  కొంతకాలం  గ్రామీణాభివృద్ధి శాఖ మంత్రిగా మరికొంతకాలం  టెక్స్‌‌టైల్స్‌‌ శాఖల మంత్రిగా పనిచేశారు. ఆ సమయంలో గ్రామీణ ప్రాంతాల అభివృద్ధికీ, చేనేత రంగం పురోగతికి  తనదైన శైలిలో పలు చర్యలు తీసుకున్నారు. దేశంలో వ్యవసాయం తర్వాత అతిపెద్ద  ఉపాధి కల్పన రంగం హ్యాండ్‌‌లూమ్‌‌,  టెక్స్‌‌టైల్స్‌‌ ఇండస్ట్రీనే. కొన్ని కోట్ల మందికి జీవనాధారం కల్పిస్తున్న రంగం.  వెంకటస్వామి గారు 1993 లో  టెక్స్‌‌టైల్స్‌‌ మంత్రిగా బాధ్యతలు స్వీకరించేనాటికి ఈ రంగం తీవ్రమైన క్రైసిస్‌‌లో ఉంది. ఈ ఒక్క రంగం దశను మార్చగలిగితే కొన్ని కోట్ల మంది జీవితాలు మారిపోతాయన్న విషయం కాకాకు తెలుసు. అందుకే ఆయన బాధ్యతలు స్వీకరించిన వెంటనే  జాతీయ స్థాయిలో అనేక  సంస్కరణలను తీసుకొచ్చారు. వర్క్‌‌షెడ్‌‌ కమ్‌‌ హౌజింగ్‌‌ స్కీమ్‌‌, హెల్త్‌‌ ఇన్సూరెన్స్‌‌, నేత కార్మికుల పిల్లల చదువులకు సహాయపడేందుకు ప్రత్యేక స్కీమ్‌‌లు, థ్రిఫ్ట్‌‌ ఫండ్‌‌ ఏర్పాటు, ఇంటిగ్రేటెడ్‌‌ హ్యాండ్‌‌లూమ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ స్కీమ్‌‌, మిల్‌‌గేట్‌‌ ప్రైస్‌‌ స్కీమ్‌‌,  హ్యాండ్‌‌లూమ్‌‌ డెవలప్‌‌మెంట్‌‌ సెంటర్‌‌, క్వాలిటీ డైయింగ్‌‌ స్కీమ్‌‌… వంటివన్నీ ఆయన హయాంలోనే రూపుదిద్దుకున్నాయి. చేనేత రంగాన్ని ఆదుకునేందుకు సంక్షేమ నిధి ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఇందుకోసం మిల్లు వస్త్రాలపై ఒక శాతం సెస్‌‌ను ప్రతిపాదించారు.  అప్పట్లో కాకా చొరవతో తీసుకున్న చర్యలతో టెక్స్‌‌టైల్‌‌ ఇండస్ట్రీ  పరిస్థితి మారిపోయింది. ఐదు జాతీయ స్థాయి ట్రేడ్‌‌ యూనియన్లు, టెక్స్‌‌టైల్‌‌ మిల్లుల యజమానులను పిలిచి  త్రైపాక్షిక ఒప్పందంపై సంతకాలు చేయించారు. దేశవ్యాప్తంగా నష్టాల్లో  ఉన్న 79 మిల్లులను ఒక్క తాటిపైకి తెచ్చి నేషనల్‌‌ టెక్స్‌‌టైల్‌‌ కార్పొరేషన్‌‌ ఏర్పాటు చేయడంలో కీ రోల్‌‌ ప్లే చేశారు. బ్రిటిష్‌‌ ఇండియా కార్పొరేషన్‌‌కు చెందిన ఐదు మిల్లులు కూడా ఇందులో ఉన్నాయి. కాలం చెల్లిన టెక్నాలజీ, పాతపడ్డ డిజైన్‌‌లతో  మార్కెట్‌‌ ఆదరణ లేని  మిల్లు దుస్తులకు  మార్కెట్‌‌ కల్పించేందుకు  మోడర్నైజేషన్‌‌కు  పెద్ద పీట వేశారు.  కోట్ల రూపాయల నిధులను  ఈ రంగానికి ప్రభుత్వం  కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. మిల్లులకు సంబంధించిన మిగులు భూములను అమ్మి ఆ సొమ్ముతో   కార్మికులకు ఇవ్వాల్సిన బకాయిలు చెల్లించాలని ఆదేశించారు.  నష్టాల్లోని ప్రభుత్వ రంగ సంస్థలను డిజిన్వెస్ట్‌‌మెంట్‌‌ పేరుతో తెగనమ్ముతున్న రోజుల్లో, వాటిని బతికించేందుకు కాకా చేసిన ప్రయత్నాలు చిరకాలం నిల్చిపోతాయి. ఎన్‌‌టిసీ మిల్లుల ఉత్పత్తులను అమ్మేందుకు దేశవ్యాప్తంగా షోరూమ్‌‌లను ఏర్పాటు చేయాలన్న ఆలోచన కూడా కాకా సాబ్‌‌దే. టెక్నాలజీతో పాటు ఆకర్షణీయమైన డిజైన్లు ఉంటే తప్ప మార్కెట్‌‌ చేయడం సాధ్యం కాదని గుర్తించి నేషనల్‌‌ ఇనిస్టిట్యూట్‌‌ ఆఫ్‌‌ ఫ్యాషన్‌‌ టెక్నాలజీ (నిఫ్ట్​) సంస్థల విస్తరణకు  చర్యలు తీసుకున్నారు. ఆయన వల్లనే  హైదరాబాద్‌‌లోనూ నిఫ్ట్‌‌ ఏర్పాటైంది. దళితులు, బడుగువర్గాల్లో చైతన్యం  కోసం, వారిభవిష్యత్తును బలోపేతం చేయడానికి  తన వంతు కృషి చేశారు.

‌‌          – దాసు సురేష్, చైర్మన్- జాతీయ నేతన్నల జేఏసీ

ఎందరికో జీవితాన్నిచ్చిన  అంబేద్కర్ కాలేజీలు

అంబేద్కర్ సలహాతోనే…ుట్టింది పేద కుటుంబం… కూలిగా బతికి నాయకుడిగా ఎదిగిన జీవితం.పేదల కోసం జీవితాంతం అలుపెరుగని పోరాటం చేసిన వెంకటస్వామి పెద్దగా చదువుకోలేదు. అయితే జీవితంలో పైకి రావడానికి చదువు ఎంత ముఖ్యమో ఆయనకు తెలుసు. తాను చదువుకోకపోయినా కాలేజీలు ఏర్పాటు చేసి వేలాది మందికి చదువుకునే అవకాశం కల్పించారు కాకా.

1950లో ఆయన తొలిసారిగా రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేద్కర్​ ను కాకా కలిశారు. “వెంకటస్వామి …మీరెంతో  పాపులర్ లీడర్. మీకున్న ఈ పాపులారిటీని దళితులు, పేదలకు చదువు అందించడానికి ఎందుకు  ఉపయోగించకూడదు”అని అంబేద్కర్ అన్నారు. “తప్పకుండా సార్” అన్నారు వెంకటస్వామి. ఆరోజు అంబేద్కర్ కు ఇచ్చిన మాటను మరువలేదు కాకా. అయితే ఉండటానికి చిన్నపాటి గుడిసె కూడా లేని పేదల కోసం రాత్రింబవళ్లు  చేస్తున్న పోరాటంలో కాకాకు  తీరిక దొరికే కాదు. 23 ఏళ్ల తరువాత  అంబేడ్కర్ కు ఇచ్చిన మాటను నిజం చేశారు కాకా. ‘డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఎడ్యుకేషన్ సొసైటీ’ ని ఏర్పాటు చేశారు. ఈ సొసైటీలో  భాగంగా కార్పొరేట్ చదువులు కొనలేని పేదవారి కోసం హైదరాబాద్ నగరంలోని బాగ్ లింగంపల్లి ఏరియాలో 1973లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కాలేజీ ఏర్పాటు చేశారు. అప్పటి రాష్ట్రపతి వివి గిరి ఈ కాలేజీని ప్రారంభించారు. డొనేషన్లకు దూరంగా అచ్చంగా పేదవాళ్లకు ఉపయోగపడాలన్న ఏకైక తాపత్రయంతో ఈ కాలేజీని ఏర్పాటు చేశారు. కేవలం కాలేజి పెట్టి ఊరుకోలేదు.అవసరమైన బిల్డింగులు కట్టించారు. స్టూడెంట్ల కోసం అన్ని సదుపాయాలను కల్పించారు. విద్యారంగంలో వస్తున్న మార్పులకు తగ్గట్టు కాలేజీని అప్ డేట్ చేశారు. ఏ కార్పొరేట్ విద్యాసంస్థకు తగ్గని రీతిలో తీర్చిదిద్దారు కాకా.

బెస్ట్ కాలేజీల జాబితాలో……

1991 లో ‘ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ లా కాలేజీ’ ఏర్పాటు చేశారు. ‘ఇండియా టుడే ’ సర్వేలో అంబేడ్కర్ లా కాలేజీ, దేశంలోనే బెస్ట్ లా కాలేజీల్లో 25వ స్థానం సాధించింది. దీనిలో చదువుకున్న ఎంతో మంది  లాయర్లుగా పేరు తెచ్చుకున్నారు.మరికొంతమంది ఐఏఎస్​, ఐపీఎస్ వంటి ఆలిండియా సర్వీసులకు కూడా సెలెక్ట్ అయ్యారు.

వెంకటస్వామికి చదువంటే కొన్ని ఖచ్చితమైన అభిప్రాయాలున్నాయి. డిగ్రీలు తీసుకోవడం, బయటకు వెళ్లి ఉద్యోగాలు చేయడం ఇదే చదువుకు పరమార్థం కాదు అన్నది కాకా ఫిలాసఫీ. ఒక మంచి పౌరుడిని తయారు చేయడానికి చదవు ఉపయోగపడాలని ఆయన భావించేవారు. అంబేద్కర్ కాలేజీ చెట్టు కింద చదువుకున్న ఎంతో మంది ఆ తరువాత పెద్ద పెద్ద ఉద్యోగాల్లో సెటిలయ్యారు. వెంకటస్వామి మనసులో ఉన్న ఆలోచన వేరు. పేదవాళ్లకు చదువు అందించే  కాలేజీలు ఒక్క హైదరాబాద్ నగరంలోనే కాదు దేశం అంతా పెట్టాలన్నది ఆయన సంకల్పం. అయితే  ఆ కల నిజం కాలేదు. కల…కలగానే మిగిలిపోయింది. దేశంలోని గరీబోళ్లందరికీ  ప్రభుత్వమే పైసా ఖర్చు లేకుండా నిర్బంధ చదువు అందించాలని ఆయన కోరుకునేవారు.

      (ఈవేళ కాకా వర్ధంతి సందర్భంగా…)