పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సమ్మె

పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ సమ్మె

హైదరాబాద్, వెలుగు: పెండింగ్ బిల్లులు చెల్లించాలంటూ జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్లు సమ్మెకు దిగారు. గురువారం నుంచి గ్రేటర్ లో అన్ని పనులు బంజేశారు. ఈ ఏడాది మార్చి నుంచి ఇప్పటి వరకు చేసిన పనులకు గాను కాంట్రాక్టర్లకు జీహెచ్ఎంసీ రూ.800 కోట్లు చెల్లించాల్సి ఉంది. ఈ బిల్లులన్నీ చెల్లించాలని లేదంటే సమ్మెకు దిగుతామని ఈ నెల 13న గ్రేటర్ కమిషనర్ కు 3 వేల మంది కాంట్రాక్టర్లు నోటీస్ ఇచ్చారు. అయినా స్పందన రాకపోవడంతో గురువారం నుంచి సమ్మె మొదలుపెట్టారు. సర్కిల్, జోనల్​కమిషనర్ ఆఫీసుల ఎదుట బిల్లులు చెల్లించాలంటూ నిరసన తెలిపారు. కాంట్రాక్టర్ల సమ్మెతో గ్రేటర్ లో మెయింటెనెన్స్ పనులన్నీ ఎక్కడికక్కడ నిలిచిపోయాయి. రోడ్ల రిపేర్లు, సీసీ రోడ్ల పనులు, నాలాల పూడికతీత, టాయిలెట్ల నిర్వహణ తదితర పనులకు బ్రేక్ పడింది. ఇప్పటికే నగరవాసులు అనేక సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారు. మొన్నటి వరకు మెయింటెనెన్స్ పనులు ఎంతో కొంత జరిగినప్పటికీ ఇప్పుడు పూర్తిగా నిలిచిపోయాయి. ప్రస్తుతం సిటీలో రోడ్లు పూర్తిగా ఖరాబయ్యాయి. మొన్నటి వరకు వానలు కురవగా తగ్గినంక రిపేర్లు చేస్తామని అధికారులు చెబుతూ వచ్చారు. ఇప్పుడు వర్షాలు తగ్గడంతో రోడ్ల మరమ్మతులు చేపట్టాల్సి ఉంది. కానీ కాంట్రాక్టర్లు సమ్మెలో ఉండడంతో రోడ్ల రిపేర్ల పనులు జరిగేలా కనిపించడం లేదు. కాగా, పెండింగ్ బిల్లులు చెల్లించాలని నెలల సంది అడుగుతున్నా, చివరికి సమ్మె నోటీస్ ఇచ్చినా అధికారులు స్పందించలేదని జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్ పేర్కొంది. వేరే గత్యంతరం లేకనే పనులు బంజేసి సమ్మెకు దిగినట్లు తెలిపింది. కాంట్రాక్టర్లు అప్పులు చేసి పనులు చేస్తున్నారని, బిల్లులు ఆలస్యంగా ఇస్తే వడ్డీలు చెల్లించేందుకే సగం డబ్బులు పోతున్నాయని ఆవేదన వ్యక్తం చేసింది. 

బిల్లులు ఇచ్చేదాకా సమ్మె చేస్తం.. 

బిల్లులు ఇచ్చేదాకా సమ్మె విరమించం.రూ.800 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఇందులో ఒక్క మార్చికి సంబంధించినవే రూ.300 కోట్లు ఉన్నాయి. కనీసం ఈ ఒక్క నెల బిల్లులు ఇచ్చినా సమ్మె విరమిస్తాం. ఇప్పటికే చాలా మంది కాంట్రాక్టర్లు డబ్బుల్లేక పనులు చేయలేకపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి బిల్లులు ఇవ్వాలి. లేదంటే ఆందోళన ఉధృతం చేస్తం. 

- రామకృష్ణ, ప్రెసిడెంట్, జీహెచ్ఎంసీ కాంట్రాక్టర్స్ అసోసియేషన్