కాళేశ్వరం మోటార్లు బంద్..ప్రాణహితకు పోటెత్తిన వరద

కాళేశ్వరం మోటార్లు బంద్..ప్రాణహితకు పోటెత్తిన వరద
  • మేడిగడ్డకు 5.41 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లో.. 57 గేట్లు ఓపెన్ 
  •     అన్నారం బ్యారేజీకి పెరిగిన     వరద.. గేట్లు తెరిచే చాన్స్
  •     బొగత జలపాతానికి నో ఎంట్రీ
  •     పాలెంవాగు ప్రాజెక్టు  ప్రధాన కాలువకు గండి

జయశంకర్‌‌‌‌‌‌‌‌ భూపాలపల్లి, వెలుగు: రాష్ట్రంలో కురుస్తున్న వర్షాలకు తోడు ఎగువ నుంచి ప్రాణహిత, ఇంద్రావతి పరవళ్లు తొక్కుతుండడంతో గోదావరిలో వరద ఉధృతి పెరిగింది. దీంతో కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌ వద్ద కాళేశ్వరం మోటార్లను సర్కార్ బుధవారం బంద్‌‌‌‌‌‌‌‌ చేసింది. ఎన్నడూ లేనంతగా ప్రాణహిత నుంచి మేడిగడ్డ బ్యారేజీ‌‌‌‌కి 5.41 లక్షల క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తున్నది. దీంతో ప్రాజెక్టు 57 గేట్లు ఎత్తి, వరద మొత్తం కిందికి వదిలేస్తున్నారు. ఇక మేడిగడ్డ నుంచి వచ్చే నీళ్లతో పాటు ఇంద్రావతి నది ద్వారా 1.2 లక్షల క్యూసెక్కుల ఇన్ ఫ్లోతో కలిపి మొత్తం 6.49 లక్షల క్యూసెక్కుల వరద తుపాకులగూడెం (సమ్మక్క) బ్యారేజీలోకి చేరుతున్నది. ఇక్కడ 52 గేట్లు ఎత్తి, మొత్తం వరదను వదులుతున్నారు. మేడిగడ్డకు ఎగువన ఉన్న అన్నారం బ్యారేజీకి కూడా వరద పెరుగుతున్నది. మానేరు వాగు నుంచి దాదాపు 10 వేల క్యుసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తున్నదని అధికారులు ప్రకటించారు. గోదావరిలో ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో పెరిగితే బుధవారం రాత్రి వరకు బ్యారేజీ గేట్లు ఓపెన్ చేసే అవకాశం ఉందన్నారు. ఒకవేళ అన్నారం గేట్లు తెరిస్తే, గత 18 రోజులుగా కన్నెపల్లి పంప్‌‌‌‌‌‌‌‌హౌస్ నుంచి‌‌‌‌ మోటార్ల ద్వారా ఎత్తిపోసిన నీళ్లన్నీ మళ్లీ వృథాగా కిందికి వచ్చినట్లవుతుంది.

నీట మునిగిన పొలాలు..

భారీ వర్షాలతో బొగత జలపాతం ప్రమాదకరంగా ప్రవహిస్తున్నది. దీంతో ఫారెస్ట్‌‌‌‌‌‌‌‌ ఆఫీసర్లు బుధవారం నుంచి పర్యాటకులను అనుమతించడం లేదు. అలాగే వాజేడు మండలంలోని కొంగల, మహితపురం, వెంకటాపురం మండలంలోని ముత్యంధార జలపాతాల దగ్గరికి కూడా ఎవరినీ పోనివ్వడం లేదు. ములుగు జిల్లా వెంకటాపురం మండలంలోని పాలెంవాగు ప్రాజెక్టుకు 7,036 క్యూసెక్కుల ఇన్‌‌‌‌‌‌‌‌ఫ్లో వస్తుండగా, మూడు గేట్లు ఎత్తి 6,750 క్యూసెక్కులు కిందికి విడుదల చేస్తున్నారు. ఈ నేపథ్యంలో చిన్న గంగారం వద్ద ప్రాజెక్ట్ ప్రధాన కాలువకు గండి పడింది. దీంతో దాదాపు వంద ఎకరాల్లో పొలాలు నీట మునిగాయి. కాగా, భారీ వర్షాలు, వరదలతో ములుగు జిల్లా ఏటూరునాగారం మండలంలోని పలు గ్రామాలకు రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. వెంకటాపురం మండలంలోని పెంకవాగు ఉప్పొంగడంతో ఏజెన్సీలోని తిప్పాపురం, కలిపాక, పెంక వాగు, సీతారాంపురం గ్రామాలకు రాకపోకలు బంద్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కలెక్టర్ త్రిపాఠి లోతట్టు ప్రాంతాల్లో పర్యటించారు. గోదావరి ముంపు గ్రామాల ప్రజలను ముందస్తుగా షెల్టర్లకు తరలించాలని అధికారులను ఆదేశించారు.

ఉధృతంగా గోదావరి..

గోదావరిలో వరద రోజురోజుకు పెరుగుతున్నది. భూపాలపల్లి, ములుగు జిల్లాల్లో పొంగిపొర్లుతున్న వాగులు, వంకలన్నీ గోదావరిలో కలుస్తున్నాయి. అలాగే ప్రాణహిత, ఇంద్రావతి నదుల నుంచి 5.5 లక్షల క్యూసెక్కుల వరద వస్తుండడంతో ములుగు జిల్లా వాజేడు మండలం పేరూరు వద్ద గోదావరి ఉధృతంగా ప్రవహిస్తున్నది. ఇక్కడ ప్రవాహం బుధవారం ఉదయం 6 గంటలకు 12.65 మీటర్లు ఉండగా, సాయంత్రం 4 గంటలకు 14.80 మీటర్లకు పెరిగింది.