పీఎస్​లో హిజ్రాల ఫైటింగ్.. తమ వర్గం హిజ్రా వేరే వర్గంలో చేరిందని లొల్లి

పీఎస్​లో హిజ్రాల ఫైటింగ్.. తమ వర్గం హిజ్రా వేరే వర్గంలో చేరిందని లొల్లి
  •     పంపకాల్లో తేడాలు మరో కారణం
  •     రెండు గంటల పాటు రాళ్లు రువ్వుకున్నరు.. 
  •     కారం చల్లుకున్నరు..  మధ్యలో వచ్చిన 
  •     లేడీ కానిస్టేబుల్​కు గాయాలు  
  •     నల్గొండ జిల్లా     మిర్యాలగూడలో ఘటన

మిర్యాలగూడ, వెలుగు: నల్గొండ జిల్లా మిర్యాలగూడ పట్టణంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో  మంగళవారం హిజ్రాలు వీరంగం సృష్టించారు. ఓ వర్గానికి చెందిన హిజ్రా మరో వర్గంలో చేరడం, పంపకాల్లో తేడాతో పీఎస్​లోనే రాళ్లు రువ్వుకుని...ఒకరిపై ఒకరు కారం చల్లుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. ఈ ఘటనలో ఓ లేడీ కానిస్టేబుల్​ గాయపడింది. మిర్యాలగూడలో నందిని, బాలమ్మలు హిజ్రాలు. వీరిద్దరు రెండు గ్రూపులను మెయింటెయిన్ ​చేస్తున్నారు. దుకాణాల్లో డబ్బుల వసూళ్ల విషయంలో వీరి మధ్య తరచూ గొడవలు జరుగుతున్నాయి. నందిని గ్రూప్ లోని గంగభవాని అనే హిజ్రా 15 రోజుల క్రితం బాలమ్మ గ్రూప్ లోకి వెళ్లింది. అప్పటి నుంచి ఆర్థిక లావాదేవీల విషయంలో ఈ రెండు గ్రూపుల మధ్య లొల్లి మరింత ముదిరింది. తన అనుమతి లేకుండా తమ సభ్యురాలిని ఎలా చేర్చుకున్నారంటూ బాలమ్మ గ్రూప్ పై నందిని గ్రూప్ ఆగ్రహం వ్యక్తం చేసింది. దీనిపై మిర్యాలగూడ వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసేందుకు మంగళవారం రెండు వర్గాలు వచ్చాయి. దీంతో అందరూ కూర్చోవాలని చెప్పి ఎస్సై బయటకి వెళ్లాడు. ఈ గ్యాప్ లోనే రెండు వర్గాల మధ్య గొడవ మొదలై ఎక్కువైంది. దీంతో పీఎస్​ ఆవరణలోనే సిగలుపట్టుకుని కొట్టుకున్నారు. ఒకరిపై ఒకరు కారం జల్లుకుని రాళ్లు విసురుకున్నారు. చెప్పులు విసురుకున్నారు. వీరి దాడితో స్టేషన్ ఆవరణ రణరంగంగా మారింది. పోలీసులు కూడా కంట్రోల్​చేయలేకపోయారు. చివరకు ఎలాగో రెండు వర్గాలను చెదరగొట్టారు. వారించబోయిన లేడీ కానిస్టేబుల్ మీనాకు స్వల్ప గాయాలయ్యాయి. ఫిర్యాదు చేసేందుకు వచ్చిన తమపై నందిని వర్గం దేవరకొండ నుంచి కొంత మంది మగవారిని తీసుకొచ్చి దాడి చేయించిందని గంగాభవాని ఆరోపించింది. ప్రత్యర్థి వర్గం తనను చంపుతానని బెదిరిస్తోందని బాలమ్మ ఆరోపించింది. ఇరువర్గాలు పై కేసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు.