కస్టమర్ కేర్ అంటూ ఫోన్ చేసి కుచ్చుటోపి..

కస్టమర్ కేర్ అంటూ ఫోన్ చేసి కుచ్చుటోపి..

హైదరాబాద్ లో సైబర్ క్రైం రోజురోజుకు పెరుగుతున్నాయి. ఎస్ బీఐ ఎగ్జిక్యూటివ్ లుగా అవతారమెత్తి ఆన్ లైన్లో డబ్బులు కాజేస్తున్న ఐదుగురు వ్యక్తులను సైబరాబాద్ పోలీసులు అరెస్ట్ చేశారు. 2022 ఏప్రిల్ 4న ఓ వ్యక్తి క్రెడిట్ కార్డ్ కస్టమర్  కేర్ నంబర్ కోసం గూగుల్ లో  సెర్చ్ చేసి ఒక నంబర్ కు డైల్ చేశాడు. తర్వాత ఎస్బీఐ కస్టమర్ కేర్ డిపార్ట్ మెంట్ అని  మరొక నంబర్ నుంచి బాధితుడికి కాల్ వచ్చింది.

కాలర్ బాధితుడిని ఎనీ డెస్క్ యాప్ ఇన్ స్టాల్ చేయమని చెప్పాడు. దీంతో అతను యాప్ ఇన్ స్టాల్ చేశాడు. ఓటీపీ వచ్చిన తర్వాత అన్ని వివరాలు ఎంట్రీ చేశాడు. తర్వాత కాసేపటికే బాధితుడి అకౌంట్ నుంచి  రూ.13 వేలకు పైగా డెబిట్ అయినట్లు మెసేజ్ వచ్చింది. దీంతో బాధితుడు సైబరాబాద్ లోని కొత్తూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు.   ఈ ముఠా ఢిల్లీ కేంద్రంగా కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు సైబర్ క్రైం పోలీసులు గుర్తించారు. ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. అమన్ పర్వేజ్ ఖాన్, ఆషిక్అలీ,అష్రఫ్ జావేద్ ఒక టీం.. శుభమ్ కుమార్, అభిషేక్ భరద్వాజ్ మరో టీం ఏర్పాటు చేసి ఎస్బీఐ కస్టమర్ కేర్, క్రెడిట్ కార్డ్ లకు సంబంధించిన  నేరాలకు పాల్పడుతున్నట్లు గుర్తించారు.

దబ్రీకి చెందిన నిహాల్ అనే మరో నిందితుడు కస్టమర్ల పేర్లు, మొబైల్ నంబర్లు, పాన్ కార్డ్, జాబ్ ప్రొఫైల్స్, బ్యాంక్ అకౌండ్ డేటాను ట్రాన్స్ ఫర్ చేస్తున్నట్లు విచారణలో తేలింది. ప్రస్తుతం నిహాల్ పరారీలో ఉన్నాడు.