- పెరుగుతున్న క్రూడాయిల్ ధర
- కొనుగోలుదారులుగా మారిన విదేశీ ఇన్వెస్టర్లు
న్యూఢిల్లీ: పశ్చిమాసియాలో పెరుగుతున్న భౌగోళిక ఉద్రిక్తతలు, ముడిచమురు ధరల పెరుగుదల, త్వరలో విడుదల కానున్న రిటైల్, హోల్‌సేల్ ద్రవ్యోల్బణం.. ఈ వారం మార్కెట్ డైరెక్షన్‌ను నిర్ణయిస్తాయని ఎనలిస్టులు భావిస్తున్నారు. హార్మూజ్ జలసంధి పరిణామాలు, విదేశీ ఇన్వెస్టర్ల (ఎఫ్‌ఐఐల) కొనుగోళ్లు, కంపెనీల క్యూ1 ఫలితాలు మార్కెట్‌కు అత్యంత కీలకం కానున్నాయి.
కాగా, భారత్‌లో జులై నెలకు సంబంధించిన అన్‌ఎంప్లాయ్‌మెంట్, సర్వీసెస్ , రిటైల్ ద్రవ్యోల్బణం (సీపీఐ) డేటా ఆగస్టు 12న, హోల్‌సేల్ దవ్యోల్బణం (డబ్ల్యూపీఐ) ఆగస్టు 14న విడుదల కానున్నాయి.
అలాగే అమెరికా సీపీఐ, పీపీఐ డేటా కూడా విడుదల కానున్నాయి. మరోవైపు హెచ్‌ఏఎల్, భారత్ ఫోర్జ్, గ్రాసిమ్ ఇండస్ట్రీస్, టాటా మోటార్స్ వంటి ప్రముఖ కంపెనీలు తమ మొదటి క్వార్టర్ ఆర్థిక ఫలితాలను వెల్లడించనున్నాయి. ఎఫ్ అండ్ ఓ షేర్లలో సెబీ ప్రవేశపెట్టిన కొత్త 'క్లోజింగ్ ఆక్షన్ సెషన్ ' విధానానికి మార్కెట్ సర్దుబాటు అవుతుండటంతో షార్ట్ టర్మ్‌లో తీవ్ర హెచ్చుతగ్గులు నమోదు కావచ్చని ఎనలిస్టులు తెలిపారు. గత వారం సెన్సెక్స్ 404.53 పాయింట్లు (0.51శాతం), నిఫ్టీ 187.05 పాయింట్లు (0.76శాతం) లాభపడ్డాయి. బ్యారెల్ బ్రెంట్ క్రూడాయిల్ ధర 83.55 డాలర్ల దగ్గర ఉంది.
ఈ నెల రూ.12,921 కోట్ల విదేశీ పెట్టుబడులు
ఈ నెల మొదటి వారంలో విదేశీ ఇన్‌స్టిట్యూషనల్ ఇన్వెస్టర్లు (ఎఫ్‌ఐఐలు) భారత ఈక్విటీలలో నికరంగా రూ.12,921 కోట్ల విలువైన కొనుగోళ్లు జరిపారు. జులైలో రూ.20,200 కోట్లు ఇన్వెస్ట్ చేశారు.
అంతకుముందు నాలుగు నెలల్లో భారీగా అమ్మకాలు జరిపారు. ఎఫ్‌ఐఐలు ఈ ఏడాది జూన్‌లో నికరంగా రూ.49,340 కోట్లు, మే లో రూ. 32,963 కోట్లు, ఏప్రిల్‌లో రూ.60,847 కోట్లు, మార్చిలో ఏకంగా రూ.1.17 కోట్లను విత్‌డ్రా చేసుకున్నారు. ఫిబ్రవరిలో మాత్రం నికరంగా రూ. 22,615 కోట్ల విలువైన షేర్లు కొన్నారు.
