ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ చార్జీలు ఎందుకంత ఎక్కువ? ఆదాయంలో పాత్ర ఏంటి?

ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ చార్జీలు ఎందుకంత ఎక్కువ? ఆదాయంలో పాత్ర ఏంటి?

ఎయిర్‌పోర్ట్‌కు వెళ్లడం అంటే కేవలం విమానం ఎక్కడం మాత్రమే కాదు. బంధువులు, స్నేహితులను రిసీవ్ చేసుకోవడానికి వెళ్లేవారికి, సాగనంపడానికి వెళ్లేవారికి పార్కింగ్ బిల్లు పెద్ద తలనొప్పిగా మారుతుంది. కేవలం అరగంట సేపు ఆగితేనే వందల రూపాయల బిల్లు కట్టాల్సి వస్తుంది. ఉదాహరణకు ఢిల్లీ విమానాశ్రయంలో ప్రైవేట్ కార్లకు 30 నిమిషాలకు రూ.160, గంట వరకు రూ.250 వసూలు చేస్తుండగా.. ముంబైలోనూ దాదాపు ఇదే పరిస్థితి ఉంది. 4 నుంచి 24 గంటలకు ఈ చార్జీలు ఏకంగా రూ.600 నుంచి రూ.900 వరకు ఉంటున్నాయి. ఈ భారీ ధరలు చూసి డ్రైవర్లు ఆశ్చర్యపోతుంటారు. మరి ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ చార్జీలు ఎందుకంత ఎక్కువగా ఉంటాయి? దీని వెనుక ఉన్న అసలు కారణాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం.

ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ అనేది కేవలం కారు నిలపడానికి ఏర్పాటు చేసిన స్థలం మాత్రమే కాదని నిపుణులు అంటున్నారు. ఇది సాధారణ సిటీ పార్కింగ్‌కు పూర్తిగా భిన్నమైనది. ఎయిర్‌పోర్ట్‌లు అత్యంత కట్టుదిట్టమైన భద్రత, నిరంతరం నిఘా కెమెరాలు, అత్యాధునిక టెక్నాలజీతో కూడిన వాతావరణంలో నడుస్తాయి. టెర్మినల్ కనెక్టివిటీ, లైటింగ్, నిర్వహణ, రౌండ్-ది-క్లాక్ మ్యాన్‌పవర్, భారీ భద్రతా ఖర్చులు దీని వెనుక ఉంటాయి. టెర్మినల్స్‌కు అతి సమీపంలో ల్యాండ్ దొరకడం చాలా అరుదు కాబట్టి.. ఆ కొరతను బట్టి కూడా ఈ టారిఫ్‌లు మారుతుంటాయి. ప్రయాణికులు తమ కార్లను పార్క్ చేసి వెళ్లడం, రిసీవ్ చేసుకోవడానికి వచ్చేవాళ్ళు పోటీ పడటం వల్ల ఈ ఇబ్బంది తలెత్తుతుంది.

వివిధ విమానాశ్రయాల్లో ఈ పార్కింగ్ ధరలు ఒకేలా ఉండవు. ఆపరేటింగ్ ఖర్చులు, ప్రయాణీకుల రద్దీ, అందుబాటులో ఉన్న స్థలం ఆధారంగా పార్కింగ్ ఛార్జీలను నిర్ణయిస్తారు. ఎయిర్‌పోర్ట్ రూల్స్ ప్రకారం పార్కింగ్‌ను 'నాన్-ఏరోనాటికల్ సర్వీస్' గా పరిగణిస్తారు. దీనివల్ల విమాన సర్వీసుల మాదిరిగా కాకుండా.. పూర్తిగా వాణిజ్యపరమైన కోణంలోనే పార్కింగ్ చార్జీలను నిర్ణయిస్తారు. రద్దీగా ఉండే టెర్మినల్స్ దగ్గర ట్రాఫిక్ జామ్ కాకుండా.. త్వరగా వాహనాలు వెళ్లిపోయేలా చేయడానికి కూడా ఈ టారిఫ్‌లు ఉపయోగపడతాయని నిపుణులు అంటున్నారు.

ఎయిర్‌పోర్ట్ ఆపరేటర్లకు పార్కింగ్ అనేది కేవలం సేవ మాత్రమే కాదు, ఆపరేటర్లకు పెద్ద బిజినెస్ ఇన్కం రిసోర్స్. ప్రయాణికుల సంఖ్య పెరుగుతున్న కొద్దీ నాన్-ఏరోనాటికల్ రెవెన్యూలో పార్కింగ్ కీలక పాత్ర పోషిస్తుంది. అయితే కేవలం చార్జీలు పెంచడం ద్వారానే ఆదాయం పెంచుకోవాలని చూస్తే ప్రయాణికులకు భారమవుతుంది. దీనికి బదులుగా వాలెట్ పార్కింగ్, ఎలక్ట్రిక్ వెహికల్ చార్జింగ్ స్టేషన్లు, ముందస్తు డిజిటల్ బుకింగ్ వంటి రకరకాల సేవలను అందించడంపై విమానాశ్రయాలు దృష్టి పెట్టాలని నిపుణులు సూచిస్తున్నారు.

ALSO READ : SBI కస్టమర్లకు బిగ్ రిలీఫ్..

ఎయిర్‌పోర్ట్ పార్కింగ్ ఖరీదైనది కావడానికి ల్యాండ్ కొరత, భద్రతా ప్రమాణాలు, భారీ నిర్వహణ ఖర్చులే ప్రధాన కారణంగా తెలుస్తోంది. భవిష్యత్తులో కేవలం ధరలు పెంచడమే కాకుండా, టెక్నాలజీని ఉపయోగించి ప్రయాణికులకు మెరుగైన, సౌకర్యవంతమైన సేవలను అందించడం ద్వారా మాత్రమే ఈ రంగాన్ని మరింత అభివృద్ధి చేయవచ్చు. ప్రయాణికుల సౌకర్యం, వ్యాపార లాభాల మధ్య సరైన బ్యాలెన్స్ ఉంటేనే ఇది సాధ్యమవుతుంది. ఇప్పటికే జనరల్ పార్కింగ్, ప్రీమియం పార్కింగ్ అంటూ వివిధ కేటగిరీలుగా ఈ పార్కింగ్ ఫెసిలిటీలను డివైడ్ చేసి దానికి అనుగుణంగా ఛార్జీలు వసూలు చేస్తున్నారు ఎయిర్‌పోర్ట్స్‌లో.