అసంఘటిత కార్మికులకు బీమా ఫ్రీ

అసంఘటిత కార్మికులకు బీమా ఫ్రీ
  • ఈ-శ్రమ్​తో అసంఘటిత కార్మికులకు బీమా ఫ్రీ
  • జంట నగరాల లేబర్ జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి 

సికింద్రాబాద్, వెలుగు: అసంఘటిత కార్మికులకు సామాజిక భద్రతతోపాటు వివిధ సంక్షేమ పథకాలు ఈ– శ్రమ్ పోర్టల్ ద్వారా అందుతాయని జంటనగరాల లేబర్ జాయింట్ కమిషనర్ శ్యాంసుందర్ రెడ్డి అన్నారు. ఈ పోర్టల్ లో నమోదు చేసుకున్న ప్రతి కార్మికుడికి సంవత్సరం పాటు ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన ఉచితంగా వర్తింపజేస్తారన్నారు. పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. ఇండియన్​ఫెడరేషన్​ఆఫ్​ట్రేడ్​యూనియన్స్​(ఐఎఫ్​టీయూ) స్టేట్ సెక్రటరీ ఎం. శ్రీనివాస్ అభ్యర్థన మేరకు కార్మిక శాఖ ఆధ్వర్యంలో బుధవారం సికింద్రాబాద్ నల్లగుట్ట రాంగోపాల్ పేట్ పరిధిలో ఈ శ్రమ్​కౌంటర్​ను శ్యామ్ సుందర్ రెడ్డి, డిప్యూటీ కమిషనర్ శ్రీనివాస్ గౌడ్​ప్రారంభించారు. 300 మంది హమాలీలు ఈ శ్రమ్​పోర్టల్​లో రిజిస్ట్రేషన్​చేసుకునేందుకు ఈ ప్రత్యేక కౌంటర్​ను అసిస్టెంట్ లేబర్ ఆఫీసర్ పీవీ రమణమూర్తి ఆధ్వర్యంలో ఏర్పాటు చేశారు. పోర్టల్ లో రిజిస్ట్రేషన్ చేసుకున్న అసంఘటిత కార్మికులకు  వెంటనే గుర్తింపు కార్డులను అందజేశారు. అనంతరం శ్యాంసుందర్ రెడ్డి మాట్లాడుతూ 16 సంవత్సరాల నుంచి 59 సంవత్సరాల వారు ఆధార్ కార్డు ద్వారా ఈ పోర్టల్ లో  ఉచితంగా రిజిస్టర్ చేసుకోవచ్చని, దీని ద్వారా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సామాజిక భద్రత సంక్షేమ పథకాలు అందుతాయన్నారు. రిజిస్టర్ అయిన కార్మికుడు ఏదైనా ప్రమాదంలో మరణిస్తే కార్మికుని కుటుంబానికి రూ. రెండు లక్షలు, దివ్యాంగులైతే రూ. లక్ష పరిహారాన్ని ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన కింద అందజేస్తారన్నారు. అసంఘటిత కార్మిక కేటగిరిలో పని చేస్తూ ఈపీఎఫ్, ఈఎస్ఐ సదుపాయం లేని కార్మికులకు వర్తిస్తుందన్నారు. ఇక్కడే కాకుండా ఇంటర్నెట్ సెంటర్, మీసేవ ద్వారా ఎక్కడైనా ఈ శ్రమ్ పోర్టల్ లో నమోదు చేసుకోవచ్చని చెప్పారు.