జోషిమఠ్.. ఇక ఏమాత్రం సేఫ్​ కాదు : ఉత్తరాఖండ్ ప్రభుత్వం

జోషిమఠ్.. ఇక ఏమాత్రం సేఫ్​ కాదు : ఉత్తరాఖండ్ ప్రభుత్వం
  • నేల కుంగుతున్న ప్రాంతంగా ప్రకటించిన ఉత్తరాఖండ్ ప్రభుత్వం
  • 1.5 కిలోమీటర్ల పరిధిలో కుంగిన నేల.. 610 ఇండ్లకు బీటలు   
  • 60 ఫ్యామిలీల తరలింపు.. మరో 90 ఇండ్ల ఖాళీకి చర్యలు 
  • హైదరాబాద్​లోని ఎన్ఆర్ఎస్ సీకి శాటిలైట్ సర్వే బాధ్యతలు 

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్​లోని జోషిమఠ్ పట్టణాన్ని ల్యాండ్ స్లైడ్ సబ్సీడెన్స్ జోన్ (నేల కుంగుతున్న ప్రాంతం)గా ఆ రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది. పురాతన కొండచరియపై ఉన్న ఈ టౌన్​లో ఇటీవల నేల కుంగిపోతుండటంతో 600కుపైగా ఇండ్లు, రోడ్లు బీటలువారాయి. దీంతో బాగా ధ్వంసమైన 60 ఇండ్లలోని కుటుంబాలను అధికారులు ఇదివరకే రిలీఫ్ సెంటర్లకు తరలించారు. మరో 90 ఇండ్లలోని ఫ్యామిలీలను వీలైనంత త్వరగా తరలిస్తామని చమోలి జిల్లా కలెక్టర్ హిమాంశు ఖురానా వెల్లడించారు. టౌన్​లో మొత్తం 4,500 బిల్డింగ్​లు ఉండగా.. 1.5 కిలోమీటర్ల పరిధిలోని 610 ఇండ్లు, బిల్డింగులకు బీటలు ఏర్పడ్డాయని ఆయన తెలిపారు. బాధిత కుటుంబాలకు టౌన్​లోనే సేఫ్ ప్లేస్​లలో ఉన్న కొన్ని బిల్డింగ్ లు, హోటల్స్, ఒక గురుద్వారా, రెండు ఇంటర్ కాలేజీల్లో 1,500 మందికి సరిపడేలా తాత్కాలిక షెల్టర్లు ఏర్పాటు చేశామన్నారు. బాధిత కుటుంబాలకు 6 నెలల పాటు ఇంటి అద్దె కోసం నెలకు 4 వేల ఆర్థిక సహాయం చేస్తామని కలెక్టర్ ఖురానా ప్రకటించారు. కాగా, ఉత్తరాఖండ్ సీఎం పుష్కర్ సింగ్ ధామికి ప్రధాని నరేంద్ర మోడీ ఫోన్ చేసి జోషిమఠ్​లోని ప్రస్తుత పరిస్థితిని అడిగి తెలుసుకున్నారని ఆ రాష్ట్ర సీఎంవో అధికారులు వెల్లడించారు. మరోవైపు, జోషిమఠ్ పరిస్థితిపై శాటిలైట్ ఇమేజెస్ ద్వారా సర్వే నిర్వహించి, ఫొటోలతో సహా రిపోర్టును అందజేయాలని హైదరాబాద్​లోని నేషనల్ రిమోట్ సెన్సింగ్ సెంటర్(ఎన్ఆర్ఎస్​సీ)కు, డెహ్రాడూన్ లోని ఐఐఆర్ఎస్​కు ఉత్తరాఖండ్ ప్రభుత్వం విజ్ఞప్తి చేసింది. 

పీఎంవో హైలెవల్ మీటింగ్ 

జోషిమఠ్​లో సహాయక చర్యలు చేపట్టేందుకు ఉత్తరాఖండ్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వ సంస్థలు, ఎక్స్ పర్ట్​లు సహకారం అందిస్తున్నారని ప్రధాన మంత్రి ఆఫీసు(పీఎంవో) వెల్లడించింది. స్థానికుల భద్రతకే ప్రయారిటీ ఇస్తున్నట్లు తెలిపింది. జోషిమఠ్ లో పరిస్థితిపై ప్రధాని ప్రిన్సిపల్ సెక్రటరీ పీకే మిశ్రా ఈ మేరకు ఆదివారం హైలెవల్ రివ్యూ మీటింగ్ నిర్వహించారని పీఎంవో తెలిపింది.