లక్నో ప్లే ఆఫ్స్​​​కు... కేకేఆర్​ ఇంటికి

లక్నో  ప్లే ఆఫ్స్​​​కు... కేకేఆర్​ ఇంటికి
  • డికాక్​ భారీ సెంచరీ
  • పోరాడి ఓడిన కోల్​కతా
  • 2 పరుగుల తేడాతో లక్నో విజయం

నవీ ముంబై: ఆఖరి బాల్‌‌‌‌ వరకు లక్నో సూపర్‌‌‌‌జెయింట్స్‌‌‌‌ను వణికించిన కోల్‌‌‌‌కతా నైట్‌‌‌‌రైడర్స్‌‌‌‌.. తమ చివరి లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో పోరాడి ఓడి ప్లే ఆఫ్స్​కు దూరమైంది. భారీ టార్గెట్‌‌‌‌ ఛేజింగ్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (29 బాల్స్‌‌‌‌లో 4 ఫోర్లు, 3 సిక్సర్లతో 50), నితీశ్‌‌‌‌ రాణా (22 బాల్స్‌‌‌‌లో 9 ఫోర్లతో 42), రింకూ సింగ్‌‌‌‌ (15 బాల్స్‌‌‌‌లో 2 ఫోర్లు, 4 సిక్సర్లతో 40) దంచికొట్టినా.. లాస్ట్‌‌‌‌ బాల్‌‌‌‌కు మూడు రన్స్‌‌‌‌ చేయలేకపోయింది. ఫలితంగా బుధవారం జరిగిన లీగ్‌‌‌‌ మ్యాచ్‌‌‌‌లో 2 రన్స్‌‌‌‌ స్వల్ప తేడాతో లక్నో చేతిలో ఓడింది. ఈ విజయంతో లక్నో అధికారికంగా ప్లే ఆఫ్స్‌‌‌‌ చేరింది.  టాస్‌‌‌‌ గెలిచి బ్యాటింగ్‌‌‌‌కు దిగిన లక్నో 20 ఓవర్లలో 210/0 స్కోరు చేసింది. డికాక్‌‌‌‌ (70 బాల్స్‌‌‌‌లో 10 ఫోర్లు, 10 సిక్సర్లతో 140 నాటౌట్‌‌‌‌) సెంచరీ చేయగా,  కేఎల్‌‌‌‌ రాహుల్‌‌‌‌ (51 బాల్స్‌‌‌‌లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 68 నాటౌట్‌‌‌‌) రాణించాడు. తర్వాత కోల్‌‌‌‌కతా 20 ఓవర్లలో 208/8 స్కోరుకు పరిమితమైంది. మోసిన్​ (3/20), స్టోయినిస్​ (3/23) మూడేసి వికెట్లు తీశారు. డికాక్‌‌‌‌కు ‘ప్లేయర్‌‌‌‌ ఆఫ్‌‌‌‌ ద మ్యాచ్‌‌‌‌’ అవార్డు లభించింది. 

సిక్సర్ల షో.. 
ముందుగా బ్యాటింగ్‌‌‌‌కు వచ్చిన లక్నో ఓపెనర్లు రాహుల్‌‌‌‌, డికాక్‌‌‌‌.. సిక్సర్ల షో చూపెట్టారు. ఫస్ట్‌‌‌‌ ఓవర్‌‌‌‌ నుంచే కోల్‌‌‌‌కతా బౌలర్లను ఊచకోత కోస్తూ పరుగుల సునామీ సృష్టించారు. మూడో ఓవర్‌‌‌‌లో క్యాచ్‌‌‌‌ ఔట్‌‌‌‌ నుంచి తప్పించుకున్న డికాక్‌‌‌‌.. సిక్సర్‌‌‌‌తో జోష్‌‌‌‌ పెంచాడు. రసెల్‌‌‌‌ వేసిన 9వ ఓవర్‌‌‌‌లో డికాక్‌‌‌‌ సిక్సర్‌‌‌‌, తర్వాతి ఓవర్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ వరుస సిక్సర్లతో మోత మోగించడంతో సగం ఓవర్లకు  లక్నో 83/0తో నిలిచింది. ఈ క్రమంలో డికాక్‌‌‌‌ 36 బాల్స్‌‌‌‌లో ఫిఫ్టీ కంప్లీట్‌‌‌‌ చేశాడు. అదే జోష్‌‌‌‌లో 16వ ఓవర్లో 6, 6, 4తో 18 రన్స్‌‌‌‌ పిండుకున్నాడు. తర్వాతి ఓవర్‌‌‌‌లో రాహుల్‌‌‌‌ ఓ ఫోర్‌‌‌‌ కొట్టినా, 18వ ఓవర్‌‌‌‌లో డికాక్‌‌‌‌ 6, 4తో సెంచరీ పూర్తి చేశాడు. చివరి రెండు ఓవర్లలో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు బాదిన డికాక్​ స్కోరు 200 దాటించాడు.  

వణికించిన రింకూ...
ఛేజింగ్‌‌‌‌లో కేకేఆర్​ ఓపెనర్లు వెంకటేశ్‌‌‌‌ అయ్యర్‌‌‌‌ (0), అభిజిత్‌‌‌‌ తొమర్‌‌‌‌ (4) విఫలమైనా.. రాణా, శ్రేయస్‌‌‌‌ దంచికొట్టారు. మూడో ఓవర్‌‌‌‌లో ఐదు ఫోర్లు, ఆ తర్వాతి ఓవర్‌‌‌‌లో 4, 6, 4, ఆరో ఓవర్‌‌‌‌లో మూడు ఫోర్లు బాదడంతో పవర్‌‌‌‌ప్లేలో కేకేఆర్‌‌‌‌ 60/2 స్కోరు చేసింది. 8వ ఓవర్లో  రాణా ఔటైనా.. బిల్లింగ్స్‌‌‌‌ (36) ఉన్నంతసేపు అల్లాడించాడు. అయితే, సాఫీగా సాగుతున్న ఇన్నింగ్స్‌‌‌‌కు 14వ ఓవర్‌‌‌‌లో శ్రేయస్‌‌‌‌ ఔట్‌‌‌‌తో ఝలక్‌‌‌‌ తగిలింది. ఈ దశలో వచ్చిన రసెల్‌‌‌‌ (5) విఫలమైనా.. లాస్ట్‌‌‌‌లో రింకూ సింగ్‌‌‌‌, నరైన్‌‌‌‌ (21 నాటౌట్​) గెలిపించినంత పని చేశారు. చివరి  ఐదు ఓవర్లలో 77 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో ఈ ఇద్దరూ భారీ సిక్సర్లతో వణికించారు. లాస్ట్‌‌‌‌ ఓవర్లో 21 రన్స్‌‌‌‌ కావాల్సిన దశలో రింకూ 4, 6, 6 కొట్టినా, లూయిస్‌‌‌‌ పట్టిన సింగిల్‌‌‌‌ హ్యాండ్‌‌‌‌ క్యాచ్‌‌‌‌కు వెనుదిరిగడంతో కేకేఆర్‌‌‌‌కు ఓటమి తప్పలేదు. 

ఐపీఎల్ లో అత్యధిక భాగస్వామ్యం..

 ఐపీఎల్​ చరిత్రలో తొలి వికెట్​కు అత్యధికంగా 210 రన్స్​ జోడించిన ఓపెనర్లుగా డికాక్​, రాహుల్​ నిలిచారు. అలాగే, వరుసగా ఐదు సీజన్లలో 500 పైచిలుకు రన్స్​ చేసిన తొలి ఇండియన్​ ప్లేయర్​గా రాహుల్​ రికార్డు సృష్టించాడు.