లింగాయత్​లు ఎటువైపు? కర్నాటక రాజకీయాల్లో కీ రోల్ వాళ్లదే

లింగాయత్​లు ఎటువైపు? కర్నాటక రాజకీయాల్లో కీ రోల్ వాళ్లదే
  •    బీజేపీని వీడుతున్న లింగాయత్ లీడర్లు
  •     వారంతా తమవెంటే ఉన్నారంటూ కాంగ్రెస్ క్యాంపెయిన్
  •     యడియూరప్పను రంగంలోకి దించిన బీజేపీ హైకమాండ్

బెంగళూరు: అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో కర్నాటక రాజకీయాలు రసవత్తరంగా మారాయి. ప్రతీసారి లింగాయత్​లు పార్టీల గెలుపోటముల్లో కీలకంగా వ్యవహరిస్తారు. ఇలాంటి పరిస్థితుల్లో లింగాయత్ లీడర్లు బీజేపీని వదిలి కాంగ్రెస్ బాటపట్టారు. ఇద్దరు కీలక నేతలు కాంగ్రెస్​లో చేరారు. లింగాయత్ నేతలపై ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా కుట్రలు చేస్తున్నారని లింగాయత్​లకు బీజేపీ ద్రోహం చేస్తోందని కాంగ్రెస్ పార్టీ విమర్శిస్తున్నది. రాష్ట్ర జనాభాలో దాదాపు 17% ఉన్న లింగాయత్​లు.. ఎక్కువగా ఉత్తరాది జిల్లాల్లో ఉన్నారు. ఇక్కడ బీజేపీకి క్యాడర్​ బలం ఎక్కువగా ఉంది.

ఓట్లు చీల్చేందుకు కాంగ్రెస్ కుట్ర

బీజేపీకి అనుకూలంగా ఉన్న లింగాయత్ ఓట్లను చీల్చేందుకు కొంతకాలంగా కాంగ్రెస్ ప్రయత్నిస్తోంది. మాజీ సీఎం, లింగాయత్ లీడర్ అయిన బీఎస్ యడియూరప్పను బీజేపీ వాడుకుని వదిలేసిందని కాంగ్రెస్ ప్రచారం చేస్తోంది. లింగాయత్ లీడర్లను అవమానిస్తోందని ఆరోపిస్తోంది. వారిని చిన్నచూపు చూస్తోందని ప్రచారం చేస్తూ లింగాయత్​లను తమవైపు తిప్పుకునే ప్రయత్నం చేస్తోంది. ఆ పార్టీలో అవమానాలను భరించలేకే శెట్టర్, లక్ష్మణ్ సవాదిలు బయటకు వచ్చారని కాంగ్రెస్ ​శ్రేణులు చెబుతున్నాయి.

పక్కా వ్యూహంతో ముందుకెళ్తున్న బీజేపీ

లింగాయత్ ఓటర్లను తమతోనే ఉంచుకునేందుకు బీజేపీ లీడర్లు కూడా పక్కా వ్యూహంతో ముందుకు వెళ్తున్నారు. శెట్టర్, సవాది కాంగ్రెస్​లో చేరాక.. బీజేపీ హైకమాండ్ అదే సామాజిక వర్గానికి చెందిన యడియూరప్పను రంగంలోకి దించింది. శెట్టర్, సవాది కలిసి పార్టీకి చేసిన ద్రోహాన్ని యడియూరప్ప ఓటర్లకు వివరిస్తున్నారు. స్వప్రయోజనాల కోసమే పార్టీ మారారని, ప్రజాసేవ చేయాలనే ఉద్దేశం వారికి లేదని ప్రచారం చేస్తున్నారు. మరోవైపు, అప్పర్ కృష్ణా ప్రాజెక్టు అంశాన్ని బీజేపీ తెరపైకి తీసుకొచ్చింది. నార్త్ కర్నాటకలోని రైతులకు కాంగ్రెస్ అన్యాయం చేసిందని ఆరోపిస్తున్నది. లింగాయత్​లు ఎక్కువ సంఖ్యలో ఉన్న ఈ ఏరియాలో సాగు నీరు ఇవ్వకుండా దశాబ్దాల పాటు కాలయాపన చేసిందని బీజేపీ విమర్శిస్తున్నది. లింగాయత్ సామాజిక వర్గానికి చెందిన వీరేంద్ర పాటిల్​ను అవమానించిందని బీజేపీ గుర్తుచేస్తున్నది. ఆరోగ్యం బాగాలేక మంచంపై ఉంటే కాంగ్రెస్​ హైకమాండ్ ఆయన్ని సీఎం పోస్టు నుంచి దించేసిందని చెబుతోంది. ఏ ముఖం పెట్టుకుని లింగాయత్​లు తమవైపు ఉన్నారని కాంగ్రెస్​ ప్రచారం చేస్తున్నదని బీజేపీ లీడర్లు మండిపడుతున్నారు. లింగాయత్​లను కాంగ్రెస్​ ఘోరంగా అవమానించిందని, దీనికి పెద్ద చరిత్రే ఉందని బీజేపీ ప్రచారం చేస్తోంది.

‘‘ఒకరిద్దరు రాజీనామా చేసినంత మాత్రాన బీజేపికి ఎలాంటి నష్టంలేదు. గతంలో కంటే ఎక్కువ సీట్లు గెలుచుకుంటాం. బీజేపీని వీడి కాంగ్రెస్​లో చేరిన నేతల సెగ్మెంట్లలో మా అభ్యర్థులే గెలుస్తారు. కర్నాటక రాజకీయాలపై లింగాయత్​లకు అవగాహన ఉంది. ఎప్పుడు.. ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో వారికి తెలుసు’’

‘‘మా అంచనా ప్రకారం 141 సీట్లు గెలుస్తామనుకున్నాం. జగదీశ్ శెట్టర్, సవాది పార్టీ​లో చేరాక 2% నుంచి 3% వీరశైవ- లింగాయత్​లు కాంగ్రెస్​కు అనుకూలంగా మారారు. దీంతో 150 స్థానాల్లో విజయం సాధిస్తామనే నమ్మకం వచ్చింది. శెట్టర్, సవాది అనుచరులతో పాటు బీజేపీకి మద్దతిస్తున్న వారంతా  కాంగ్రెస్ పార్టీ​లో చేరాలి’’