క్రాకర్స్‎తో పీక్స్​కు చేరిన సిటీ పొల్యూషన్

క్రాకర్స్‎తో పీక్స్​కు చేరిన సిటీ పొల్యూషన్
  • హైదరాబాద్​లో భారీగా పెరిగిన పొల్యూషన్
  • దీపావళి వేళ సిటీలో.. పొల్యూషన్ పీక్స్​కు
  • పటాకుల దెబ్బకు మూడు రెట్లు ఎక్కువైంది
  • క్రాకర్స్​లో కెమికల్​ కలిపి పేల్చడంతో ఇద్దరి మృతి..
  • వేర్వేరు ఘటనల్లో చూపు పోగొట్టుకున్న పలువురు

హైదరాబాద్‌, వెలుగు: దీపావళి పూట రాజధానిలో పొల్యూషన్ భారీగా పెరిగింది. లాస్టియర్ దీపావళి వేళ కరోనా ఆంక్షలతో పెద్దగా క్రాకర్స్ కాల్చక పొల్యుషన్​ తగ్గడం తెలిసిందే. ఈసారి మాత్రం మోత మోగింది. గురువారం సాయంత్రం మొదలైన పటాకుల మోత తెల్లవారుజాము దాకా సాగింది. దాంతో పొల్యూషన్ భారీగా పెరిగిందని పీసీబీ ఆఫీసర్లు ప్రకటించారు. పీఎమ్​ 2.5 గాఢత వరల్డ్​హెల్త్​ఆర్గనైజేషన్​ గాలి నాణ్యత మార్గదర్శక విలువ కంటే 3 రెట్లు ఎక్కువగా నమోదైందని వివరించారు. ‘‘ఏక్యూఐలో గాలి నాణ్యత 88 పాయింట్లుగా నమోదైంది.  గురువారం రాత్రి  11 గంటలకు పీఎమ్​ 2.5 అధికంగా 180.75 మైక్రోగ్రామ్/క్యూబిక్ ​మీటర్ కాగా, ఒంటి గంటకు 175.33, శుక్రవారం ఉదయం ఐదింటికి 46.14గా నమోదైంది. సాయంత్రానికి 7‌0.5కు పెరిగింది’’ అని చెప్పారు. క్రాకర్స్ దెబ్బకు​సిటిలో ఎక్కడ చూసినా శుక్రవారం ఉదయం రోడ్లన్నీ చెత్తతో నిండిపోయాయి. దీపావళి సంబురాలు పలు కుటుంబాల్లో విషాదం నింపాయి. ఇద్దరు చనిపోగా పలువురు కళ్లు పోగొట్టుకున్నారు. చాలామంది కంటి సమస్యలతో ఆస్పత్రులపాలయ్యారు. పాతబస్తీలోని కందికల్‌గేట్‌లో గురువారం రాత్రి ఓ ప్లాస్టర్ ఆఫ్‌ ప్యారిస్‌ యూనిట్‌లో భారీ పేలుడు జరిగింది. ఇద్దరు వర్కర్స్‌ స్పాట్‌లో చనిపోగా మరొకరు తీవ్రంగా గాయపడ్డాడు. ఉల్లాస్‌ అనే వ్యాపారి ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్‌ బొమ్మలు తయారీ యూనిట్‌ లో కుటుంబంతో పాటు దీపావళి పూజలు చేశాడు. వర్కర్లకు టపాసులిచ్చాడు. వాటిని భారీ శబ్దంతో పేల్చాలని కెమికల్‌తో కలిపి గోతిలో పెట్టి కాల్చారు. దాంతో భారీ పేలుడు జరిగింది. డబ్బాతో పాటు రాళ్లు ఎగిరిపడ్డాయి. వెస్ట్ బెంగాల్‌కు చెందిన విష్ణు(25), జగన్(30) అక్కడికక్కడే చనిపోగా యూపీకి చెందిన బీరెన్ (25) తీవ్రంగా గాయపడ్డాడు. భారీ పేలుడుతో అక్కడి వాళ్లంతా భయాందోళనకు లోనయ్యారు. మరోవైపు క్రాకర్స్ కాల్చి పొగ తదితరాల వల్ల చాలామంది కంటి సమస్యలతో ఆస్పత్రుల పాలయ్యారు. గురువారం రాత్రి సరోజనీ దేవి కంటి ఆస్పత్రిలో 31కేసులు నమోదయ్యాయి. వీటిలో ఐదు చూపు పోయే ప్రమాదమున్న ఎమర్జెన్సీ కేసులని హాస్పిటల్ ఆర్ఎంఓ తెలిపారు. శుక్రవారం కూడా ఉదయం నుంచి సిటీలోని పలు కంటి ఆస్పత్రులకు పేషెంట్లు క్యూ కట్టారు.