కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేకే నాపై దాడి: కవిత

కేసీఆర్ను ఎదుర్కొనే ధైర్యం లేకే  నాపై దాడి: కవిత

సీఎం కేసీఆర్ ను ఎదుర్కొనే ధైర్యం లేకే తనపై దాడికి పాల్పడుతున్నారని  బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వ్యాఖ్యానించారు.  ఫేక్ చాట్ లతో తనపై దుష్ప్రచారం చేస్తున్నారని.. ఆర్థిక నేరగాడు సుఖేశ్ తో తనకు ఎలాంటి పరిచయం లేదని చెప్పారు.  కొన్ని మీడియా సంస్థలు తప్పుడు వార్తలు, తప్పుడు ప్రచారాలు చేస్తున్నాయన్నారు. బీఆర్ఎస్ కు  ఉన్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారన్నారని విమర్శించారు. ఓ ఆర్థిక నేరగాడు ఒక అనామిక లేఖను రిలీజ్ చేస్తే దానిని పట్టుకుని కొందరు రాద్దాంతం చేస్తున్నారన్నారు. ఆ లేఖను పట్టుకుని  బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్  రావు ఈసీకి లేఖ రాయడం, బీజేపీ టూల్ కిట్ లో భాగంగానే పనిగట్టుకుని సోషల్ మీడియాలో  బురద జల్లుతున్నారని ధ్వజమెత్తారు.

మీడియా అత్యుత్సాహం..పనిగట్టుకుని తప్పుడు వార్తలు

అసలు సుఖేశ్ ఎవరో తనకు తెలియదని..అతనితో పరిచయం కూడా లేదని కవిత స్పష్టం చేశారు. ఇవేవి పట్టించుకోకుండా కొన్ని మీడియా సంస్థలు అత్యుత్సాహంతో పనిగట్టుకుని  తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని మండిపడ్డారు.  ఇదివరకు తన  మొబైల్ ఫోన్ల విషయంలో కూడా ఇలాగే తొందరపడి వార్తలు రాసి తర్వాత తోక ముడిచారన్నారు. మళ్లీ ఇప్పుడు క్రిమినల్ సుఖేష్ ను పావుగా వాడుకొని తెలంగాణ ప్రభుత్వాన్ని, బీఆర్ఎస్ పార్టీని, కేసీఆర్  కుటుంబ సభ్యులను బద్నాం చేయాలని ప్రయత్నిస్తున్నాయని చెప్పారు.   పాత్రికేయులు కనీస విలువలు పాటించకపోవడం అత్యంత బాధాకరమన్నారు.  రాజకీయ ఎజెండాలో మీడియా సంస్థలు కూడా పావుగా మారడం దురదృష్టకరమన్నారు.

తలవంచం..తెగించి కొట్లాడుతాం

తెలంగాణ ప్రజలు విజ్ఞులని..  పాలు ఎంటో, నీళ్లేంటో తెలిసిన చైతన్య జీవులని కవిత అన్నారు.. నిజం నిలకడ మీద తెలుస్తుందన్నారు. తన మీద బురదజల్లే వార్తలకు కొన్ని మీడియా సంస్థలు ఇచ్చిన అగ్ర ప్రాధాన్యత , దమ్ముంటే నిజాయితీ ఉంటే తన వివరణకి కూడా అంతే ప్రాధాన్యత ఇవ్వాలని సవాల్ విసిరారు. తెలంగాణ బిడ్డలం తలవంచబోమని..తెగించి కొట్లాడుతాం అంటూ కవిత ట్విట్లర్లో  పేర్కొన్నారు.